Showing posts with label పుస్తక సమీక్షలు. Show all posts
Showing posts with label పుస్తక సమీక్షలు. Show all posts

పుస్తక సమీక్ష



కోర్పరేట్ వ్యవస్థ చెప్పుచేతల్లో ప్రభుత్వపు పని తీరుతెన్నులు. ఉద్యోగ సృష్టికర్తలు అన్న గండపెండేరం తొడిగి, ప్రభుత్వపు పందేరాలలో వారికి పెద్ద పీట వేసి, వడ్డించే వాడు మనవాడే అయితే అన్న చందాన వారి పెట్టుబళ్ళకు ప్రతిగా ప్రభుత్వ పెట్టిపోతలు. పన్ను భారాలతో, మౌలిక సదుపాయాల లేమితో అసలే బక్కచిక్కి మూలుగుతున్న దిగువ తరగతి ప్రజానీకం యొక్క ఆకలి తీర్చడానికి అన్నట్టు ఉదారవాద ప్రభుత్వం అతి ఎత్తు నుండి అప్పుడప్పుడూ జారవిడిచే తాటి పళ్ళు. కోర్పరేట్ లాభల పేరుతో పొరుగు దేశాలకి వలస పోతున్న ఉద్యోగాల ప్రవాహాన్ని అడ్డుకోలేక, ఆర్ధిక భద్రత కోసం, మంచి భవిష్యత్తు కోసం అప్పుడే దేశం లోకి అడుగు పెట్టే వలసదారుల మీద స్థానికులకు పెల్లుబిక్కిన ఆగ్రహం. వచ్చిన దారినే మళ్ళిపోవాలని నిరసనలు, బెదిరింపులు, కొండకచో హింసాత్మక హెచ్చరికలు. జాతుల పేరిట ఆగని సంఘర్షణలు. మహిళల హక్కులలో, ప్రముఖంగా ఉద్యోగ విధి నిర్వహణలో, లోపించిన సమతుల్యత --- ఇవన్నీ చదువుతుంటే ఏ 20వ శతాబ్దపు నాగరిక సమాజ జీవన పరిస్థితులగానో, లేదా ఒక అడుగు ముందుకు వేసి 21వ శతాబ్దమో జీవన స్థితిగతులగానో పొరపడడం కద్దు. ఇవే వాక్యాలు 18వ శతాబ్దానికి, ఆ తరువాత 19వ శతాబ్దానికి కూడా అచ్చుగుద్దినట్టు అమరుతాయి అని తెలిస్తే, నాగరితపు నడక ముందుకా, వెనకకా, లేదా ఉన్న చోటే అడుగు వేస్తూ పురోగతని ఏమారుస్తోందా అని అనుకోవడం సహజం. మరి ఈ 300 యేళ్ళలో మార్పు ఏమీ లేదా అంటే, ఉంది, ఖచ్చితంగా ఉంది - ఫాక్టరీ పొగ గొట్టాల సంఖ్య పెరిగింది, అందులో పని చేసే వారీ సంఖ్యా పెరిగింది, అలా అని కార్మికుల జీవన ప్రమాణాలు మారినాయా? పెట్టుబడిదారి వ్యవస్థ వేలు పెట్టని చోటు లేని విధంగా అభివృద్ధి పేరిట సహజ వనరుల సిరులని కొల్లగొట్టి వాటి పునాదుల మీద కోర్పరేట్ వ్యవస్థ ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు పెరిగినాయి, అవే సహజ వనరులని తరతరాలుగా నమ్ముకుని, వాటి అదృశ్యంతో ఇక ప్రత్యామ్న్యాయ అవకాశాలు లేక పట్టణాలకు వలస వచ్చి అవే ఆకాశ హర్మ్యాల నిర్మాణాలకి రాళ్ళేత్తే కూలీలుగా అవతరించే ప్రజానీకం కుశలాల మాటో? ధనం పేరిట, మతం పేరిట, రంగు పేరిట, రాజ్యం పేరిట, స్థానికత్వం పేరిట, వలస వాదం పేరిట, ఎన్నో శతాబ్దాలుగా కింద తరగతి ప్రజలు పావులుగా విభజించబడి, ఒక్కొక్కరూ ఒక్కో గడిలోకి నెట్టబడి, వారి చేతిలో ఆయుధాలు పెట్టబడి, వారితోనే, వారి మీదే, వారిని వాడుకునే సాగే ఈ వ్యవస్థీకృత వికృత చదరంగాన్ని నడిపించే అసలు చేతులు ఎప్పుడూ మారలేదు. ఇంతవరకూ ఏ పొట్ట పెరిగి పోయిన పెట్టుబడిదారీ తనకు తానుగా మనసు మార్చుకుని, లాభన్ని పక్కకి నెట్టి, పొరుగు వాడి బాగులోనే తన మేలు కూడా ఉన్నదన్న ప్రాధమిక సూత్రనికి కట్టుబడి, తన విశాల వ్యాపార సామ్రాజ్యంలో అన్ని తరగుతుల ప్రజలని (తన పని చేసే వాళ్ళైనా సరే) కలుపుకు పోయిన పాపాన పోలేదు. పంచడం అన్నది ఒక పాపంగా, ఒక మానసిక రోగంగా, అందినంత అందుకోవడమే, కాకుంటే కొల్లగొట్టటమే పునాది రాళ్ళుగా నిర్మింపబడిన నవ నాగరిక అమెరికా సమాజము యొక్క ఓపెన్ హార్ట్ సర్జరీయే ఈ పుస్తకం . ఆ దేశం "ఆవిర్భవించిన" 1492 నుండి, అంటే నాటి కొలంబస్ నుండి నేటి డోనాల్డ్ ట్రంప్ వరకూ, కేవలం పాత్రల పేరు మార్పుతో, వివిధ కాలాలలో, జరిగిన అవే కధల, అవే వెతల సమగ్ర సంకలనమే ఈ "A People's History of the United States"

అనగనగా ఒక అనచ్ఛాదిత ప్రాంతం. కనుచూపు మేర ఎటువైపుకూ అంతే కంపించని బయళ్ళు, నదీనదాలు, హిమవన్నగాలు, యేళ్ళు, సెలయేళ్ళు, జలపాతాలు, వాటి మీద భీతి లేకుండా సంచరిస్తూ, సహజీవనం చేసే పశు జాతులు, మనుష్య సంతతులూ. అవసరం మేరకే వ్యవసాయం, ఆకలి కోసమే వేట. ప్రకృతి అందించినవి మహా ప్రసాదంగా స్వీకరించి పొట్ట కోసం తప్ప కొల్లకొట్టడం అనే ఊసు కూడా తెలియని స్థానిక "ఇండియన్" జాతి. అది 1492. మూడు ఓడల మీద ముల్లోకాలు జయిద్దామని (కాదు... కొల్లగొడదామని) బయలుదేరిన కొలంబస్ మూఠాకు వక్రమైన విధి రాత వల్ల, గుండ్రమైన భౌగోళిక రూపు వల్ల తారసిల్లిన ప్రాంతాలు, మొదట కేరీబియన్ ద్వీపాలు, ఆ బాటనే మీదుగా ఉన్న నేరానికి అమెరికా దేశం. ఈ ప్రాంతానికి, ఆయన యానానికి ఆ తరువాత కాలం శ్వేత జాతి దిద్దుబాటు చరిత్రకారులు పెట్టుకున్న ముద్దు పేరు - "న్యూ వరల్డ్" (కొత్త ప్రపంచం). 15వ శతాబ్దం నాటికి ఐరోప దేశాలు చీకటి రోజుల నుండి అప్పుడప్పుడే బయట పడుతూ తమ రాజ్య ధన దాహాలను తీర్చుకోవడానికి సాహసికులైన అన్వేషకుల ప్రపంచ యాత్రలను ప్రోత్సహించడం మొదలు పెట్టినాయి. అప్పటికే వేల యేళ్ళ చరిత్రలు, వృద్ధి చెందిన నాగరికతలు వర్ధిల్లుతున్న తూర్పు వైపు దృష్టి సారించి, యాత్రకు పెట్టిన రూపాయి పెట్టుబడికి వందింతలు ఎవరు ప్రతిఫలాలు అందచేస్తారో, వారికి సూదిమొన శాతం వాటా ప్రకటించి బరిలోకి ఉసికొల్పినాయి. ఒక వైపు ధన దాహంతో దూసుకు వస్తున్న పడవలు, మరొక వైపు "సొంతమైన", "వ్యక్తిగతమైన" అన్న పదాలే తెలియని సమిష్టి వ్యవస్థలు. ప్రపంచ ఆర్ధిక మూలాలను కుదిపేసిన, అర్ధ సిద్ధాంతాలను తిరగరాసిన విస్ఫోటాత్మక ఘటన జరిగిన యేడాది 1492. పెట్టుబడికి రాబడే అంతిమ లక్ష్యంగా, ఆ రాబడిని రాబట్టేందుకు మనిషి మాన, ప్రాణాలను సమిధలుగా చేసి వేలార్చిన ఈ కనకధారా యఙ్ఞంలో, సాటి మనిషి దురాశకీ, దౌర్జన్యానికీ, దోపిడికీ బలయిపోయి చివరికి పూర్తిగా అంతరించి పోయిన స్థానిక జాతుల కళేబరాల మీదా, కపాలాల మీదా కట్టబడిన ఈ "న్యూ వరల్డ్", పెట్టుబడిదారీ వ్యవస్త యొక్క తొలి మూలాలూ, పునాదులూ ఉన్నవి స్మశానాల మీదా, ఎండిన రక్తపుటేళ్ళ బీళ్ళ మీద అన్న విషయం అనుక్షణం గుర్తుచేస్తూ ఉంటుంది. 1492 నుండి అమెరికా స్వాతంత్ర్యం ప్రకటించుకున్న 1776 వరకూ జరిగిన స్థానికుల నరమేధను యేళ్ళ వారిగా, దశాబ్దాల వారిగా, శతాబ్దాల వారిగా పరిశీలిస్తే, అతిధులుగా వచ్చిన వారిని చేరదీసి ఆశ్రయమిస్తే వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని, మొదట బంగారం కోసం, తరువాత భూమి కోసం, అటు తరువాత బానిసల కోసం, ఎడారిలో ఒంటె గుడారం కథ చందాన, స్థానికతను క్రమక్రంగా ప్రక్షాళన చేసుకుంటూ పోయి, చివరికి అమెరికా గడ్డ పై పూర్తిగా తమ సార్వభౌమత్వాన్ని ఈ ఐరోప దేశాలు ఎలా చాటుకున్నాయో చదువుతూ ఉంటే, గుర్తువచ్చే వరసలు ఇవే - "ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం రణరంగ ప్రవాహిసిక్తం". ఆ రెండు వందల యేళ్ళ పైబడి జరిగిన దురాక్రమణలో ప్రాణాలు కోల్పోయిన కోట్లాది స్థానికుల ఉసురు, పొయటిక్ జస్టిస్ గా, ఐరోప వాసులకీ, అటు తరువాత అమెరికా వాసులకీ తగిలిన ప్రతిఫలం - స్థానికులు వలస వాదులకు తగిలించిన పొగాకు.

చరిత్ర అంటే ఫలానా దేశపు దండయాత్రలూ, ఆ రాణీ రూపురేఖా విలాసాలు, ఈ రాజు కీర్తిగానాలా అని కవి వాపోయినట్టు, మళ్ళీ దానిని సమర్ధించుకుంటూ సామెతలు కూడానూ - చరిత్ర అన్నది విజయుల వీరగాధలే అని. జిన్ అందుకు భిన్నంగా తన చూపుని వ్యవస్థ నిర్మించిన హర్మ్యాల వైపు కాక, గుండె మంట నెగళ్ళలో రాటు దేలిన ఎర్రని ఇటుకల వైపు, అణగదొక్కిన జాతుల వెన్నుల మీద నిలిపిన ఇనుప వాసాల వైపు, బలహీనుల రక్తంతో చెమటతో కన్నీళ్ళతో తడిని బలపడిన స్థంబాల వైపు సారిస్తాడు. ఆ మాటని నిర్ద్వంద్వంగా ప్రవేశికలోనే ప్రకటిస్తాడు - చదువరులూ, ఈ పుస్తకంలో మీ దేశభక్తిని ఉద్రేకపరిచే అంశాలు ఏమీ ఉండవు, ఏమన్నా ఉన్నాయి అంటే మొట్టమొదటి పునాది రాయిగా పడ్డ సంస్థల/వ్యవస్థల దురాక్రమణ తత్వం నుండి, ప్రస్తుతం పెట్టుబడిదారీ సిద్ధాంతానికే తార్కాణంగా ఎదిగిన ఈ రాజప్రసాదపు ప్రతి ఒక అంతస్తు నిర్మాణం వెనక దాగి ఉన్న చీకటి కోణాలే అని. ఇది వెలిగిన కాదు, ఒక నలిగిన కథ. మిగతా దేశాల పుట్టుపూర్వోత్తరాల వలే కాక, అమెరికా దేశ చరిత్ర చాలా భిన్నమైనది, ఒక విధంగా ప్రపంచం కళ్ళ ఎదుటే 500 యేళ్ళ క్రితమే ఊపిరి పోసుకున్న పసికూన. దాని బోర్ల పడడం నుంచి, బుడి బుడి నడల గుండా, క్రమక్రమేపీ ఆ దేశం ఎదుగుదల ప్రపంచానికి సుపరిచతమే. ఇందులో దాచే విషయాలు ఏమీ లేవు, మసి పూసి ఏమార్చే అంశాలు అంత కన్నా లేవు. కొలంబస్ చూపించిన దారిలోనే  - ఉపమానంగానూ, ఉన్నదున్నట్టుగానూ - ఆ తరువాత ఎదిగిన సమాజం, అడుగులు తప్పకుండా, దోచుకో-దాచుకో సూత్రాన్ని త్రికరణశుద్ధిగా నమ్ముకుని అంచెలంచెలుగా ఎలా విస్తరించిందో, ఎక్కడో అమెరికా తూర్పు తీరానికి ఐరోప దేశాల నుండి మత విద్వేషం తప్పించుకోవడానికి శరణార్ధులై వచ్చిన వాళ్ళు, ఒక్కక్కరూ దురాక్రమణ దారులై "ఇండియన్"లను వారి అఙ్ఞానం, తమ ఆధిపత్యం, వారి అమాయకత్వం, తమ అవకాశవాదం, వారి నిస్సహాయత, తమ అమానుషత్వం, వారి ఉదాసీనత, తమ చట్టబద్ధతలతో ఒక్కో అడుగు వీరు వేసుకుంటూ ఒక్కో ప్రాంతం నుండీ వారిని జరుపుకుంటూ, ఒక రెండు వందల యేళ్ళ కాలంలో వలస పేరుతో వచ్చిన వారు విస్తరణ పేరుతో ఎలా ఆక్రమించుకుంటూ పోయి చివరికి వారి దేశంలోనే వారికి నిలువ నీడలేకుండా చేసారో గమనిస్తే, సామ్రాజ్యవాదం అన్నది రాచరికపు జన్మ హక్కు కాదనీ, అవసరం-అవకాశం-ఆయుధం సమపాళ్ళలో కలిస్తే ప్రతి సామాన్యుడిలోనూ ఒక సామ్రాజ్యవాది దాగి ఉంటాడని, కాలం కలిసిరాగానే పడగలు విప్పి బుసలు కొడతాడని, దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఊచకోతకు గురికాబడిన విబ్భిన్న "ఇండియన్" జాతులు ముక్త కంఠంతో ఆక్రోశిస్తాయి. ఈ ప్రక్షాళన పనులను మతం పేరుతో సమర్ధించుకుంటూ, చట్టం పేరుతో శాసనాలు చేస్తూ, ఆవిర్భావమే ఒక దమనకాండ మీద జరుపుకున్న దేశం ఆ తరువాతి కాలాల్లో హింసావాదాన్ని పూర్తిగా వదిలి పెట్టి శాంతి మంత్రాలను (కొంగ) జపం చేస్తుంది అనుకోవడం మూర్ఖత్వమే. స్థానిక "ఇండియన్" లను పూర్తిగ మట్టిగరిపిన తరువాత ఆ మట్టిని సాగు చేయడానికి ఎంచుకున్న తరువాతి తెగ - ఆఫ్రికా నుండి బందీలుగా తేబడి బానిసలుగా పని చేయబడిన నల్ల జాతీయులు. ఆధునిక చరిత్రలోనే బహుశ మరే జాతీ చవిచూడనంత కౄరత్వం రెండు వందల యేళ్ళ పాటు పంటి బిగువున భరించి, "ఇండియన్"ల బూడిదలతో పరిపుష్టమైన అమెరికా నేలని తమ రక్తం మాంసాలతో చదును చేసి నివాస యోగ్యం చేసి శ్వేత సౌధాల్ని నిర్మించి, దేశానికి ఒక రూపు తెచ్చిన అసలు అవిశ్రాంత విశ్వకర్మలు, ఈ నల్ల జాతీయులు.

వివక్ష అన్న ఇంటి పేరుతోనూ, విషాదం అన్న వంటి పేరుతోనూ అమెరికాలో రెండు వందల యేళ్ళ పాటు నల్ల జాతీయులు తమ జాతి చరిత్రను తెల్ల పుటల మీద ఎర్రని అక్షరాలతో రాసుకున్నారు. సూర్యుడు ఒకింత తము పుట్టింటి దేశాల మీద ఎక్కువ ప్రేమని కురిపించిన పాపానికి, పరిణామ క్రమంలో ఆ యెండ బారినుండి తప్పించుకోవడనికి వంటి చాయ కాస్త ఎక్కువయిన (నలుపు అన్నది రంగు ఎక్కువయినదువల్ల, తక్కువయినదువల్ల కాదు) నేరానికి, శ్వేత దేశాల వలస వాదులు రంగు అనేది తమకు దైవ క్రమంగా లభించిన హక్కుగానూ, వారికి అదే చేయి వల్ల సంప్రాప్తించిన శాపంగానూ చూపించి, వారి దేశాలని ఆక్రమించి, వీరిని పట్టి బంధించి సంకెళ్ళు కట్టి, పడవల్లోకి నెట్టి తమ దేశాలకి తరలించుపోయి, ఇక తరతరాల పాటు వారి చేత ఊడిగాలు చేయించుని, వారి సేవల మీద శవాల మీద తమ విలాసాలు, చిద్విలాసాలు నెరుపుకున్న వైనం, గుండె ఉన్న వాడు ఎవరన్నా గర్హించాల్సిందే, మానవత్వం ఉన్న వాడు ఎవరన్నా ఖండించాల్సిందే. 1970ల తరువాత నెమ్మదిగా విద్య, ఉద్యోగ, రాజకీయ, సామాజిక రంగాల్లో మెరుగవుతున్న నల్ల జాతీయుల పరిస్థితులను చూపించి నేటి జాతి దురహంకారులు, ఇంకా ఎంత కాలం వారికి ప్రత్యేక హోదాలు, బుజ్జగింపులు అన్న ఆరోపణలు వింటుంటే, 200 యేళ్ళ పూర్వం పడవల్లో అడుగు భాగాన వందల సంఖ్యల్లో ఇరుకుగదుల్లో, కూర్చునే మాట పక్కన పెట్టి సరిగా నుంచోవడానికి, గుండె నిండా గాలి పీల్చుకోవడానికి సైతం చోటు లేని విధంగా కుక్కబడి, సమ్రుదాల మీద ప్రయాణం చేసి, ఆ యానంలో తిండిలేమితో, రోగాలతో, కాన్పులతో, మతి చలించి పోవడంతో, కాలు మోపుకునే ఇంకాస్త చోటు కోసం కాస్త బలహీనంగా ఉన్న తమ వాళ్ళనే కింద వేసి తొక్కి చంపి పొందిన ఆ ఆరడగూ ఊరటతోనూ, నెలల తరువాత గమ్యం చేరినాక, ప్రాణాల్తో మిగిలిన వాళ్ళన్ని ఇళ్ళ వెనుక పశువుల కొష్టాల పక్కన కట్టిబడి ఉంచి, అవే పశువుల మాదిరిగా కొరడా దెబ్బలు తింటూ, వారి ఆడవారు ఇంటి యజమానుల కోరికలు అన్ని విధాలుగా తీరుస్తూ, పొలాల్లో నెమ్మదిగా పని నేర్చుకుని, ఆ రోజు పొలంలో ఏరిన పత్తి బరువు బట్టి వేసిన తిండి తింటూ, ఉండబట్టలేక తిరగబడితే చెట్టుకు కట్టి చర్మం ఊడిపోయేలా దెబ్బలు తింటూ, ఏ దేవుడు ఇలా మనిషికి విధి రాయగలడు అని కుమిలిపోతూ.....ఒక వంద యేళ్ళు.... వంద యేళ్ళు.... ఇలాంటి గంటలు, 24 సార్లు, ఇలాంటి రోజులు 365 సార్లు, ఇలాంటి యేళ్ళు 100 సార్లు... ఎన్ని తరాలు ఇలా ఊడిగాల్లో ప్రభువుల పాదాల కింద నలిగిపోయాయో, యజమానుల తరాలను పెంచి పోషించడంలో తమ తరాలు కడతేరిపోయినాయో, దేశం అని చెప్పబడుతున్న చిన్న శాతం శ్వేత సంపన్న వర్గం సేవలో తమ జీవితాలు తరించిపోయినాయో తెలుసుకుంటే... గత 50 యేళ్ళగా బెరుకు బెరుకుగా దొడ్డిలోంచి ఇంటి గడపలోకి కాలు మోపుతున్న నల్ల జాతీయుడికి ఇచ్చే ఈ కొద్దిపాటి ఊరడింపు, ఈ చిన్నపాటి ఆశ్వాసన, శతాబ్దాల పాటు వీపు మీద వేసిన కొరడా దెబ్బల చురకలను మాన్పగలదా, వందల యేళ్ళ పాటు కార్చి కార్చి బుగ్గల మీద ఎండిపోయిన రక్త కన్నీటి చారికలను తుడపగలదా? అబ్రహాం లింకన్ 1860ల కాలంలో చేసిన బానిసత్వ నిషేధ చట్టం వారి స్థితిని కాస్త మెరుగు పరిచి ఉండచ్చు కాక, కాని అక్కడ నించి లిండన్ జాన్సన్ 1960 ల కాలం లో చేసిన పౌరహక్కుల చట్టం వరకూ, మరొక వంద యేళ్ళు మరో అంతర్యుద్ధం. అమెరికా దక్షిణ రాష్ట్రాల్లో, నల్లవారు ఇక తమ బానిసలు కారు అన్న వాస్తవాన్ని జీర్ణించులేని ప్రజ, యజమానులం కాకపోవచ్చు కాని పెత్తనం ఇంకా మాదే అన్న ధోరణిలో, నల్లవారిని దరి చేరనీయని, వారికి సమజంలో గౌరవం అందనీయని పద్ధతలు (సామూహిక భోజనశాలల్లో వ్రేలాడకట్టబడిన ప్రకటన - "కుక్కలు, నల్ల వారు ఇక్కడ నిషిద్దం"... ఇది 1960ల్లో....) పరికిస్తే, బానిసత్వం పోయిఉండచ్చు గాక, మనుషుల్లో కుంచితత్వం పోవడానికి ఇంకా కాలం పడుతుందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది.

ఇంత కల్లోలభరితమైన చరిత్రకి జిన్ చూపే ఏకైక కారణం - స్వంత సొత్తు, వ్యక్తిగత ఆస్తి - పెట్టుబడిదారి వ్యవస్థకి బీజం, లాభం అన్న భావన కి ఆది మూలం.

కొలంబస్ 1500వ కాలంలో కేరీబియన్ ద్వీపాలలో చేసిన ధ్వంస రచన తరువాత, ఇక ఓడల బళ్ళు కట్టుకుని సముద్రాల మీద అలల మాదిరిగా అమెరికా తీరానికి ప్రవాహాల మాదిరిగా చేరడం మొదలు పెట్టారు ఐరోపా దేశీయులు, ప్రధానంగా ఆంగ్లేయులు, ఫ్రెంచ్, డచ్, స్పానిష్ జాతీయులు. ఓడలు కట్టిన వాళ్ళు అంతా మారాజులు కారు, ఎక్కువ శాతం తమ దేశాల్లో కూటికి గతి లేని వాళ్లే, చెల్లని నాణేలే, దేశం మారితే అన్నా తమ తలరాతలు ఏమన్నా మారతాయేమో అన్న ఆశతో వచ్చిన కాందిశీకులే. తీరం చేరాక, సాదరంగా ఆహ్వానించిన "ఇండియన్"ల నేల మీదే కన్నేసి కాలంతరములో, ఈ చెల్లని చిల్లి కాణీలే, వందల ఎకరాలకు భూస్వాములై, ఆ భూములను సాగు చేయడానికి తమ దేశాల నించి మరిన్ని సత్తు కాణీలను దిగుమతి చేసుకోవడంతో పాటు, కష్టతర పనులకు తలఒగ్గని జాతిగా పేరు మోసిన ఆఫ్రికా జాతీయుల జుట్టు పట్టుకుని వారిని జట్టు కట్టుకుని, 1776 నాటికి, ఈ రెండు వందల యాభై యేళ్ళ కాలంలో పెట్టుబడిదారులుగా పడగలెత్తారు, ఆ చెల్లని నాణేల తరువాతి తరాలు. భూమి, పంట, దిగుబడి ఎప్పుడైతే పుష్కలంగా చేతికొచ్చి, తమ పూర్వీకులు వేసిన నావిక దారుల్లో తమ మాతృ దేశాలతో వర్తకం మొదలు పెట్టారో, క్రమంగా తమ ఆస్తులను కాపాడుకునేందుకు సమూహాలుగా ఏర్పడి, ఆ సమూహాలు సంఘాలై, సంఘాలు స్థానిక ప్రభుత్వాలై, ఆ ప్రభుత్వాల ద్వారా తమ పెట్టుబళ్ళకు అనుగుణమైన చట్టాలు చేసుకుని, వారి దురాక్రమణకు ఎదురుతిరిగిన "ఇండియన్" జాతులతో యుద్దాలు ఒక వైపు, సంధి ఒప్పందాలు మరొక వైపుగా, పూర్తిగా ఏకపక్ష ఏర్పాట్లు చేసుకుని, తమ పెట్టుబళ్ళను వందింతలు లక్షింతలు చేసుకోగలిగారు ఈ బజారు మనుషులు. ఇంతలో వీళ్ళ లాభాల మీద కప్పం పేరుతో పెత్తనం చేలాయించడానికి చూసిన బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి, యుద్ధంలో తమ మోచేతి నీటి మీద బ్రతుకీడ్చే బానిసలను, తమ నీడ కింద బ్రతుకులు వెళ్ళబోసే దిగువ తరగతి పని వారినీ యుద్ధ భూమిలోకి ముందుకు నడిపి, వారి బలపరాక్రమాల మీద స్వతంత్ర్యం తెచ్చుకోగలిగారు. ఇందులో అసలు విషాదమేమిటంటే, నల్ల జాతి బానిసలకు ఇంగ్లండు ప్రభువైనా వచ్చేదేమీ లేదు, ఇంటి ముందు యజమానైనా ఒరిగేది ఏమీ లేదు, తనకు కానిది, తన తలరాతని మార్చని ప్రభువు ఎవరైతే ఏమిటన్న ఆలోచన కూడా దరి చేరనీయక, తమ యజమానులకోసం వారి కప్పాల నుండి లాభల విముక్తి కోసం పోరాటాలు సలిపిన నిస్స్వార్ధ యోధులు, తెలివిలేని అమాయకులు ఆ బానిసలు. స్వతంత్ర్యం సిద్దించింది. తెల్ల దొరలకు ఆర్ధిక స్వేచ్చ లభించింది. ఇంక పెట్టుబడి-రాబడి-లాభాలే పరమావధిగా విస్తరణ సాగింది. పక్క దేశాల మీద యుద్ధాలు ప్రకటించి, వారి భూభాగాలని తమ రాష్ట్రాలుగా కలుపుకుంటూ, అప్పటికే దేశంలో మరుగైపోతున్న, ఒక మూలైపోతున్న "ఇండియన్" జాతుల దగ్గర ఉన్న ఆ కాస్త నేలను కూడా ప్రభుత్వ లాంచనాలతో లాక్కుని, వారితో "జరుగయ్యా... లేకుంటే ఉరికొయ్య" వ్యూహాలతో, 13 రాష్ట్రాలతో మొదలయిన దేశం పక్క శతాబ్దం నాటికి ఒకటి రెండు మినహా ఇప్పటి ప్రస్తుత రూపుని సంతరించుకుంది. ఈ విస్తరణ వెనుక లక్ష్యం ఒకటే - భూమి, పంట, ఖనిజం, వ్యాపారం, పెట్టుబడి, రాబడి. వంద యేళ్ళ క్రితం పెట్టుబడి దారులు, ఆ కాలం తిరిగే నాటికి దొరలయ్యారు. చమురు నిక్షేపాలని పక్క రాజ్యం నించి లాక్కున్న రాష్ట్రంలో కనుగొన్నాక, ఈ దొరలు అందులో పెట్టుబళ్ళు పెట్టి చూస్తుండగా ఇక ధనంతో పని లేని శాసకులయ్యారు. ఇక చెప్పేవాదిదే చట్టం, రాసేవాదిదే రాజ్యం. ప్రభుత్వం అన్నది ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క అన్న నానుడి వెనుక నిజ రూపం, పెట్టుబడి యొక్క, పెట్టుబడి కోసం, పెట్టుబడి చేతే ప్రభుత్వం అన్నది.

అక్కడి నించి ఇప్పటి వరకూ అమెరికన్ విధానం స్వార్ధం, స్వలాభం, స్వప్రయోజనం అన్న తారక మంత్రాల చుట్టూనే తిరుగుతూ ఉంది, దీనికి వారు కప్పుకున్న ఉన్నతమైన ముసుగు - స్వేచ్ఛ, స్వతంత్ర్యం, సంతోషాన్వేషణ.

రాజ్యాంగంలోని ప్రతి సవరణ వెనక అభాగ్యుల బలిదానాలూ, రక్త తర్పణలే... ప్రజా ప్రయోజనాల శాసనాల వెనక తిరుగుబాటు దాకా వెళ్ళిన ఉదంతాలే... దేశానికి సంబంధించని ప్రాంతలలో యుద్ధ సమీకరణల వెనక ఆర్ధిక ప్రయోజనాలే...

బైబిల్ లో ఒక సూక్తి - తండ్రుల పాప ఫలాలు పిల్లలకు తప్పని అహారాలు (the sins of the fathers are visited upon the children)... నేడు ఐరోపా లోనూ, అమెరికాలో ప్రబలుతున్న వైషమ్య ధోరణుల విష బీజాలు ఎప్పటివి? ఎక్కడ నాటినవి? ఎవరు నాటినవి?

మేడి పండు పొట్ట విప్పి అసలు రంగు బయట పెట్టిన ఉదంతం... కాదు, విషాదం... కాదు, విప్పిన ఙ్ఞాన నేత్రం,  Howard Zin's "A People's History of the United States"

పుస్తక సమీక్ష : The Making of the Atomic Bomb




 రాతి గుహపు మనిషి నాటి నుండి, అతని పరిణామ దశలో, ఉన్న స్థానం నుండి అంచెలంచలుగా కాకుండా ఎన్నో అంగలు ఒక్క ఉదుటునే వేసిన సందర్భాలు వేళ్ళ మీద పెట్టవచ్చు. అలా జరిగిన ప్రతీసారీ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడి జరుగుతున్న/జరుగుబోతున్న మార్పుని చివరి నిముషం వరకు ఆపడానికి ప్రయత్నించి విఫలమై, ఇక గతిలేక ఆ మార్పుని అలవాటు చేసుకోని చివరికి దానితో సహజీవనం చేయడం రివాజైపోయింది. రెండు రాళ్ళ రాపిడి నుండి నిప్పు పుట్టించడం, డైనమైట్ యొక్క సృష్టి, ఇక చివరగా అణుబాంబు - మనిషి చరిత్రలో కాస్త సాత్వికమైన, కానీ అంతే ముఖ్యమైన చక్రం, అచ్చు యంత్రాలను పక్కన పెడితే, ఈ మూడు సృజనలూ నిప్పుకి సంబంధించినవే, వినాశనానికి దోహద పడేవే, మనిషి యొక్క గతిని సమూలనంగా మార్చేసినవే. నిప్పును కనుక్కున్న మొదటి మనిషిని అప్పటి గుంపు కొంత ఆసక్తితోనూ, అంతే భయంతోనూ చూసి ఉంటుంది. ఆ నిప్పుతో అతను చీకటిని తద్వారా భయాన్ని జయించడం, తిండిని రుచికరంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా, నిప్పుతో శత్రువులను - హాని తలపట్టే మృగాలు, తోటి మానవ సమూహాలు - మట్టుపెట్టవచ్చు అని ఎప్పుడు తెలుసుకున్నాడో, మానవ రక్షణ వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన భయంకరమైన తొలి ఆయుధం అతని తోడయ్యింది. ఇక అక్కడి నించి నిప్పుతో జరిపిన రకరకాల ప్రయోగాలలో ముందు ఆవిరి శక్తిని, తరువాత మందుగుండును, ముఖ్యంగా మానవ నాగరికత చరితలో అత్యంత కీలకమైన డైనమైట్ వెలువడ్డాయి. అప్పటి వరకూ రక్షణ రంగంలో కానీ, కుటుంబ సంరక్షణ రంగంలో కానీ, పరిమితులతో కూడిన పనిముట్టుగానే ఉన్న నిప్పు డైనమైట్ ఆవిర్భావంతో విధ్వంస రచనలో ఒక కీలక అస్త్రంగా రూపుదిద్దుకుంది. తుపాకీతో, మందుగుండుతో మితంగానే మట్టుబెట్టగల నిప్పు డైనమైట్ తో పదుల వందల సంఖ్యలో ప్రాణలను పొట్టనబెట్టుకునే వరకూ ఎదిగింది. అదే నిప్పు చురకను పరమాణువుల స్థాయికి దింపగలిగితే... ఆ శక్తిని ఆవిష్కరించే క్రమంలో మనిషి నడిచిన తప్పటడుగుల తడబాటు అడుగుల బాటే The Making of the Atomic Bomb


శాస్త్రం:


ఊహ తెలిసిన నాటి నుండి గగనానికి దృష్టి సారించి, దాని విస్త్రుతికి అబ్బురపడి, వియన్మండలి యొక్క మర్మాలను ఛేదించాలనుకున్న మనిషికి, అంతరంగాన్ని తరచి చూసుకుని అంతే విభ్రమ కొలిపే విషయాలు సూక్ష్మ స్థాయిలో కూడా నిగూఢంగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి శతాబ్దాలు పట్టింది. 19వ శతాబ్దం వస్తే కాని విశ్వం మొత్తం అణువు ఆధరితం అన్న ప్రాధమిక సూత్రం గుర్తించలేకపోయాడు మనిషి, అక్కడి నుండి రకరకాల వ్యక్తులు రకరకాల ప్రతిపాదనల ద్వారా అణువు ఒక గోళం రూపంలో వస్తు సాంద్రతని నిర్ధారిస్తుంది అన్న సూత్రం వ్యాప్తిలోకి వచ్చింది. 19వ శతాబ్దం చివర్లో అణు పితామహుడు అని చెప్పదగ రూథర్ ఫోర్డ్ రంగప్రవేశం జరుగుతుంది. న్యూజీలండ్ దేశం నుండి ఇంగ్లండ్ దేశానికి వలస వచ్చి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రయోగశాలలో, తన శిష్య గణంతో చేసిన చర్చలు, వాదోపవాదాలు, పరీక్షలు, ప్రయోగాలు, శోధనల కారణంగా గోళాకరంలో ఉన్న అణువే మౌలికమైన కణం కాదనీ, దాని లోపల, మధ్యన పరమాణువు అన్నది మరొకటి ఉన్నదని కనుకున్న కణ విఙ్ఞాన ఖని రూథర్ ఫోర్డ్. ఆ సమయంలో యూరప్ ఖండం సకల శాస్త్రాలకూ, కళలకూ కాణాచిగా వర్ధిల్లేది. ఒక దేశంలో ప్రతిపాదనలు మరోక దేశంలో శాస్త్రఙ్ఞులకు వివిధ శాస్త్ర ముద్రణల ద్వారా తెలియడం, వారు వెంటనే తెలిసిన విషయాన్ని తమ ప్రయోగాల ద్వరా నిరూపించడమో, ఆక్షేపించడమో చేయడం, ఇంతలో ప్రయోగాలకు మూలమైన ప్రతిపాదనల ఆధారంతో మరోక దేశంలో మరొక శాస్త్రఙ్ఞుల గుంపు తమ ప్రయోగశాలలో మరో కొత్త విషయాన్ని కనుక్కోవడం, పంచుకోవడం... ఈ విధంగా మొత్తం యూరోప్ ఖండం శాస్త్ర విఙ్ఞానానికి తేనెతుట్టెలా విలసిల్లింది. వచ్చే మకరందం ఎక్కడిదైనా మాధుర్యం మాత్రం ప్రపంచానికి పంచబడినది. రూదర్ఫోర్డ్ అనేకానేక శిష్య బృందంలో, మన కధకు మూల పురుషుడు అయిన డెన్మార్క్ దేశానికి చెందిన నీల్స్ బోర్ 20వ శతాబ్దపు తొలి దశకాల్లో ప్రత్యక్షమవుతాడు. దృగ్గోచరమైన భౌతిక శాస్త్రానికి మూల పురుషుడు ఐసాక్ న్యూటన్ అనుకుంటే అగోచరమైన అణు శాస్త్రానికి ఆది గురువు నీల్స్ బోర్. ఏ విధంగా విశ్వంలో గురుత్వాకర్షణ శక్తి అన్నీ మూలలకూ ప్రబలి సకలు వస్తు సమితిని కట్టడిలో ఉంచుతుంది అని న్యూటన్ గణీత శాస్త్రాధరితంగా నిరూపించాడో, అదే విధంగా అణు ప్రపంచంలో వివిధ పరమాణు కణాలు ఒక శక్తి బద్ధంగా అణు కేంద్రం చుట్టూ కక్ష్యల్లో తిరగడమో, లేదా ఆ కేంద్రంలో స్థబ్దంగా ఉండడమో జరుగుతుందని, ఏ కారణం చేత అయినా పరమాణువు కణం (మరొక పరమాణు కణంతో ఢీ కొని) అణువు నుండి విడివడాల్సి వస్తే, ఆ విడుదల ఒక శక్తిని బహిర్గతం చేస్తుందని, అణు బాంబుకు అంకురార్పణ జరిపే తారక మంత్రాన్ని కనుక్కున్నాడు, నిరూపించాడు.


యుద్ధం:


రసాయన శాస్త్రంలో ఉత్ప్రేరకం యొక్క ఉపయోగం, జరగాల్సిన పనిని త్వరితగతం చేయడమే. ఉత్ప్రేరకం తనంతట తానుగా ఏమీ చేయలేదు, కానీ రెండు పదార్ధాల సంయోజన సమయంలో ఉత్ప్రేరకం జతకూడితే, జరిగే రసాయనిక ప్రతిక్రియ వేగం రెండింతలు మూడింతలు వేగవంతం అవుతుంది. మనిషి సాంకేతిక విప్లవాత్మక దశల్లో, యుద్ధం ఎప్పుడూ ఒక ఉత్ప్రేరకంలా వ్యవహరించింది. అభివృద్ధి కంటే భయం తనని ఎన్నో రెట్లు వేగంగా  గమ్యం వైపు పరుగులు పెట్టేలా చేసింది. ఆంగ్లంలో దీనినే Irony అంటారు. ఏ యూదులను సమూలంగా మట్టుపెట్టాలని హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో తలపోసాడో, యూరోప్ లోని ఆ యూదు శాస్త్రవేత్తలే యాధృచికంగా సమిష్టియై అణుబాంబు తయారీలో కీలక పాత్రలు పోషించి అదే ప్రపంచ యుద్ధ పరిసమాప్తికి కారణభూతులయ్యారు. అణు విచ్ఛతి ద్వారా శక్తి వెలువడుతుందని కనుక్కున్న దగ్గర నుండి జనావాసం మీద మొదటి/చివరి అణ్వాస్త్ర ప్రయోగం జరిగినప్పటి మధ్య కాలం కేవలం రెండు దశాబ్దాలు. 1930వ కాలం మధ్య యూరప్ లో శాస్త్ర విఙ్ఞానం ఎంత వేగంతో అభివృద్ధి చెందిందో, ఒక అనామక పార్టీ నేత నుండి జర్మన్ నియంతగా హిట్లర్ ఎదుగుదల కూడా అంతే వేగంతో జరిగింది. ఈ కాలంలో అణు శక్తే తమ జాతికి ముక్తి అని భావించి అణు బాంబు ఆలోచనను మొట్టమొదటి సారి ప్రతిపాదించినది హంగరీ యూదు శాస్త్రవేత్త లియో సీలార్డ్. అనుకున్నదే తడవుగా వివిధ దేశాలలోని - ఇంగ్లండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే మరియూ అమెరికా - తోటి శాస్త్రవేత్తలను కూడగట్టి, అమెరికన్ ప్రభుత్వానికి విఙ్ఞాపనలు అందచేశాడు. ఈ సమయంలో హిట్లర్ తూర్పు దిశగా ఉన్న ఒక్కో దేశాన్ని ఆక్రమిస్తూ, ఆయా దేశాల్లో ఉన్న యూదులను తమ సమాజాల నుండి వెలివేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వ, రక్షణ, విద్య, పరిశోధన రంగాలలోని వారిని తమ పదవుల నుండి తప్పించడమే కాక బంధించే ప్రయాత్నాలు చేస్తూ ఉండడంతో, పేరెన్నిక కల - ఐన్ స్టీన్, ఫెర్మి (ఇటలీ), ఓట్టో హాన్,రబీ, టెల్లర్ మొ|| - వారందరూ ప్రాణాలరిచేత పెట్టుకుని మొదట ఇంగ్లండుకూ తరువాత అమెరికా వైపూ పలాయన మంత్రం చదివారు. జర్మన్ దేశంలో ఉండిపోయిన శ్వేత జాతి శాస్త్రవేత్తలు - హైసెన్ బర్గ్ వంటి వారు - హిట్లర్ నాజీ సిద్ధాంతాన్ని ఆమోదించకపోయినా, శాస్త్రానికి రాజకీయంతో పని లేదనుకుని జర్మనీలోనే ఉండి అణు సందంధిత కార్యకలాపాల మీద తమ దృష్టి పెట్టారు. ఆ విధంగా రెండో ప్రంపంచ యుద్ధ మేఘాలు యూరోప్, ఆసియాలో పూర్తి స్థాయిలో అలముకునే నాటికి, ఏ గూటి పక్షులు ఆ గూటిలో స్థిరంగా చేరి యుద్ధం ఆపాలంటే అణ్వాయుధం ఒకటే దారి అని నిశ్చయించుకుని, తమకు తెలిసిన అణు శాస్త్రం ద్వారా తొలి అణు అస్త్రం తయారు చేయడంలో తలమునకలయినాయి. శాస్త్రం అస్త్రం వైపు, విచ్ఛిన్నం విధ్వంశం వైపు పడిన తొలి అడుగులు అవే.


అస్త్రం:


ఆయుధంగా అణువును మలచవచ్చు అని తెలుసుకొన్నాక, ఆ పనిని తలపెట్టగల తలకెత్తుకోగల సామర్ధ్యం కలిగిన ఏకైక దేశం, అప్పటి కాలంలో, అమెరికా ఒక్కటే. విచిత్రమైన విషయం, ఈ నిర్ణయం తీసుకునే నాటికి ఆ దేశం అసలు ప్రపంచ యుద్ధంలోనే పాల్గొనక పోవడం. ఒక వైపు యురోప్లో జర్మనీ, మరొక వైపు ప్రాచ్య ఆసియాలో జపాన్ దుందుండుకుతనంతో రణభేరులు మోగించుకుంటూ యుద్ధోన్మాదంతో ముందుకు నడిచినాయే తప్ప, 1939వ సంవత్సరంలో హిట్లర్ పోలండ్లోకి దూసుకువెళ్ళే నాటికి కూడా అమెరికా తో పాటు తత్తిమా ప్రపంచ దేశాలు ఇంకా శాంతి మంత్రం పఠిస్తూనే కూర్చున్నాయి. యుద్ధం మొదలయ్యా కూడా అమెరికా మిత్ర దేశాలకి మాట సాయం, వస్తు చేయూత మాత్రమే అందిస్తూ గట్టు మీదే ఉండిపోయింది. ఒక విధంగా ఇది అణుబాంబు పరిశోధన పాలిట వరమయ్యింది. తఠస్ఠ వైఖరి ముసుగులో అమెరికన్ రక్షణ వ్యవస్థ, అమెరికన్ పారిశ్రామిక వ్యవస్థ, వలస వచ్చిన శాస్త్రవేత్తల సమూహం, న్యు మెక్సీకో రాష్త్రంలో లోస్ ఆలమోస్ ప్రాంతంలో అణు బాంబు పధకానికి శ్రీకారం చుట్టింది. ముందు కావాల్సినది ముడి సరుకు - రేడియోధార్మిక ఉరేనియం. ప్రకృతిలో ధాతువులు ఎన్ని ఉన్నా ఉరేనియంకి ఉన్న రేడియోధార్మికత మరో ధాతువులో అంత కనపడకపోవడం, ఉరేనియంని విచ్చిన్నం చేస్తే వచ్చే శక్తి తగినంత ఉండడంతో, అరుదుగా లభ్యమయ్యే దీని కోసం ప్రపంచం మొత్తం జల్లెడ పట్టి, ఆఫ్రిక ఖండంలో బెల్గియం దేశాధీనం లో ఉన్న కాంగో దేశం గనుల నుండి అత్యంత గోప్యంగా టన్నుల కొద్దీ ఉరేనియం తరలించడం, తెచ్చిన ముడి సరుకుని దేశంలో మూడు చోట్ల ఎంతో వ్యస ప్రయాసలతో, డబ్బు, మేధ, శ్రామిక పెట్టుబళ్ళతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాలలో - టెన్నెసీ రాష్ట్రంలో (ఓక్ రిడ్జ్ ప్రాంతంలో), వాషింగ్టన్ రాష్ట్రంలో - శుద్ధిశాలలో ముడి ఉరేనియం నుండి రేదియోధార్మిక స్థాయికి తెచ్చి, జాగ్రత్తగా ఆ తుది సరుకును లోస్ ఆలమోస్ కి తరలించి శాస్త్రవేత్తల చేతిలో పెట్టడం అనేది, చెప్పుకోవడానికి మూడు ముక్కలలో, రాయాడానికి నాలుగు పంక్తులలో అయినా, అది రెండేళ్ళ కఠిన కఠోర దీక్ష. ఒక వైపు సైన్స్ కట్టే తలబొప్పికట్లు, ఇంకొక వైపు నిర్వాహణా తలనొప్పులు, అలకలూ, అభిప్రాయ/సైద్ధాంతిక/తాత్విక భేదాలు, ఒక అడుగు ముందు వెళ్ళిన ప్రతిసారీ అది తప్పు దారి అని తెలుసుకుని మూడు అడుగుల వెనకబాటు - ఈ సమన్వయం అంతా తొలి ఆలోచన చేసిన శాస్త్రవేత్తలు కాకుండా, అమెరికన్ రక్షణ వ్యవస్త చేతులు మీదుగా జరగడం, అక్కడ మళ్ళీ ఫలితం కోసం పాటు పడే మిలిటరీ కార్యదక్షత ఒక వైపు, పద్ధతుల వెంట పరుగుతీసే  శాస్త్రవేత్తల ప్రాకులాట ఒక వైపు, ఈ సంఘర్షణలూ, అవరోధాలూ, ఆటంకాలూ... ఇవన్నీ దాటుకుని ఎట్టకేలకు రెండు బిల్లియన్ డాలర్లు, మూడు యేళ్ళు, లెక్కకు రాని శ్రామిక, పారిశ్రామిక, మేధో మధానాల అనంతరం, జులై 1945 లో మనిషి కృషి ఫలితం - ఆధునిక భస్మాసుర హస్తం, అణు బాంబు, ఆవిర్భావం.


అనుసంధానం నుండి అణు సంధానము వరకు


ఎవరి కోసం బాబ్ము ఉద్దేశ్శింపబడిందో, ఎవరి పాలన అంతమొందించడానికి విశ్వ శాస్త్రవేత్తలూ ఒక్క తాటి పైకి వచ్చి నిద్రాహారాలూ మాని రేయింబవళ్ళూ కష్టపడ్డారో, ఆ హిట్లర్, అణ్వాస్త్ర పరీక్షకు ముందే బెర్లిన్ లో ఒక నేల మాళిగలో చుట్టుముట్టిన రష్యన్ సైన్యానికి చేజిక్కకూడదని పిరికి బాటను పట్టి ప్రాణ త్యాగం చేసుకుంటాడు. మరి ఎక్కు పెట్టిన బాణం మాటో? పరీక్ష సఫలం అయ్యేనాటికి బాంబు వ్యవహారాలు శాస్త్రవేత్తల పరిధి, రక్షణ వ్యవస్థను దాటి పాలకుల, నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంక బరిలో మిగిలి ఉన్న ఒక్క దేశం జపాన్. అణు శక్తిని ప్రత్యక్షంగా చూసిన శాస్త్ర సమాజానికి ఆశ్చర్యంగా, సహజంగా, దాని ప్రయోగం మీద వ్యతిరేకత మొదలయ్యింది. ఈ అయుధం ఒక నిరోధక/నివారక సాధనంలానే వాడాలి కానీ, నరమేధ కోసం, అందునా యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం లేని పౌర సమాజం మీద, అసలే వాడకూడదని అధికార వర్గాలకు తలనొప్పి కలిగించే స్థాయికి అర్జీలు మొదలు పెట్టింది. పాలకుల ఆలోచనా సరళే వేరు. అడవులలో కార్చిచ్చుని ప్రబలకుండా నివారించడానికి, దాని చుట్టూ ఉండే ప్రదేశాన్ని ముందే తగలేసి ఆ మంట పాకడానికి దారి లేకుండా చేయాలి అనేది వారి యుద్ధతంత్రం. పరిశోధన కాలంలోనే జపాన్లో 12 నగరాల పట్టికను తయారు చేసి, చివరి దశలో వచ్చేసరికి 12 కాస్తా 5 చేసి, ఆఖరి నిముషం లో 5 3 అయ్యి, ఇక కట్టకడపటి క్షణంలో క్యోటో నగరాన్ని తీసేసి నాగసాకిని చేర్చడం, పాలితుల తలరాతలు ప్రభువు చేతుల్లో ఎలా (ఏ)మార్చబడతాయో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. యూరోప్ లో యుద్ధం ముగిసినా, జపాన్ వాయుసేన 1941 లో హవాయి రాష్ట్రం పెర్ల్ హార్బర్ తీరాన పొట్టన పెట్టుకున్న వేల మంది సైనుకుల ప్రాణాలకు తగిన ప్రతీకారం జరగలేదు అన్నది, విజయపుటంచులలో నిలిచిన అమెరికా మర్చిపోలేదు. భూమిలో కూరుకుపోయిన చక్రాన్ని వెలికి తీసే నిస్సహాయుడైన కర్ణుడి మీద అస్త్ర సంధానం చేసిన నిర్దయుడైన అర్జునుడిలా, అగస్ట్ 6న హిరోషిమా మీదా, మూడు రోజుల తరువాత 9న నాగసాకి మీద మృత్యువు ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపించింది. క్షణానికి లక్షో వంతులో రెండు మైళ్ళ పరిధిలో ఒక్క సారిగా తాపం 400 డిగ్రీలకు వేడెక్కడం మనిషి శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపించగలదో, ఆ రెండు మైళ్ళ ఆవల, రేడియో ధార్మికతతో వెలువడిన న్యూట్రన్ కణాల వెల్లువలో, శరీరం బయట చిన్న గాటన్నా లేకుండానే, లోపలి అవయవాలు ఎలా దహించుకుని పోయాయో, ఆ అణ్వాస్త్ర దాడికి అప్పుడు చనిపోయిన లక్ష మందే కాక, కొన్ని తరాల వరకూ వాటి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, ఆ తరువాతి కాలంలో మిగతా దేశాలు ఆత్మ రక్షణ పేరిట అణ్వాస్త్ర సంపత్తిని ఎలా పెంచుకున్నాయో, ఒక మీట మాటున ప్రపంచం క్షణ కాలంలో పూర్తిగా ఎలా భస్మీపటలం కాగలదో, ఇవన్నీ గమనిస్తే, ప్రకృతి అందించేది పరికరాలు మాత్రమే, ఆయుధం గా మలుచుకుంటుందో అభివృద్ధికై వాడుకుంటుందో, అది మానవాళి చేతుల్లోనే ఉంది (భస్మాసుర హస్తమా - ఆపన్న హస్తమా) అనిపించక మానదు!


గణితం మొదలుకొని భౌతిక శస్త్రం, రసాయనంతో సమ్మిళితమయి, ఆ మిశ్రమం మనస్తత్వ శాస్త్రంతో రంగరింపబడి, కనుమ రక్షణ, రాజకీయ రంగాల ప్రభావంతో విస్ఫోపటక శక్తిగా నరహంతక ఆయుధంగా ఎలా పరిణమించిందో తెలిపే హెచ్చరిక-ధే  The Making of the Atomic Bomb

పుస్తక సమీక్ష - Pet Semetary





భయము అన్న మాటకి అర్ధం వయసుతో పాటు మారుతూ ఉంటుంది. చిన్నతనంలో భయం అన్నది కంటికి కనపడని వాటినుండి మొదలుకుని పెద్దయ్యే సమయానికి కళ్ళెదురుగా కనపడే వాటిగా రూపాంతరం చెందుతుంది. ఈ రెండు వయసుల్లోనూ భయం కలిగేది పరిణామాల వల్లే, సాధ్యతల వల్లే (consequences, possibilities). ఏదో తప్పకుండా జరుగుతుంది అన్న కీడెంచే శంక కంటే, ఏం జరగచ్చో తెలియని అయోమయం ముఖ్యంగా భయానికి కారణభూతం. అర్ధరాత్రి...నిశ్శబ్దం....కూసేవి, అరిచేవి కూడా నిద్రలోకి జారుకున్న వేళ...ఇంట్లో ఓంటరిగా ఉన్నప్పుడు, గది చీకటిగా ఉండి, చుట్టూ కళ్ళుపొడుచుకున్నా కూడ ఎక్కడ గోరంత వెలుగు లేనప్పుడు, ఆ గదిలోకి వెళ్ళి ఏదన్న పని చేయాలంటే, చిన్న పిల్లల మాట పక్కన పెట్టి, అన్నీ తెలిసిన పెద్ద వాళ్ళకి కూడా గుండె కావలసినదాని కంటే కాస్త ఎక్కువగా కొట్టుకోవటం మానదు. ఇది దెయ్యాలు, భూతాలు ప్రశ్న కాదు, సాధ్యాలూ, పరిణామాల ప్రశ్న. నిజానికి కల్పన తోడై, ఊహకి వాస్తవం జోడై, ఆ సాధ్యత మనసుని వొద్దన్న చోటికి లాక్కెడుతుంది, మదిని తీవ్రమైన ఆలోచలనతో నింపేస్తుంది, శూన్యంలోకి ఒక్కసారిగా గాలి జొరబడినట్లుగా. ఒక్క సారి లైటు వేస్తే, ఎదురుగా ఆ మధ్య చనిపోయిన కావలసిన మనిషి కుర్చీలో కూర్చుని తలేత్తి ఒక్కసారి నవ్వితే....అప్పటి వరకూ విన్నవి, కన్నవి, ఎవరెవరి అనుభవాలో లీలగా చెవిన పడినవి అన్నీ కట్టకట్టుకుని మన వాస్తవాల మీద మూకుమ్మడి దాడి చేసి ఆ సెకనులో సగం కాలం లోనే, చేయి స్విచ్చి దగ్గ్గరకు వెళ్ళి లైటు వేయబోయిన లిప్త పాటులోనే, ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తాయి. ఇది సరే సాధారణ భయాలు, చీకట్లో పక్కన దాకున్ని భౌ అని అరిచే బాపాతులు, ఈ భయాలకి ఆలోచనతో లంకె ఏమీ ఉండదు. ఇటువంటి భయాలకి ప్రతిస్పందన అంత అసంకల్పితంగానే ఉంటాయి. ఒక్కసారి ఉలిక్కిపడి, ఝడుసుకుని ఆనక తమయాయించుకుని అన్నవాడి మీద గొంతు చించుకునో, లేక ఫక్కున నవ్వేసో మర్చిపోయే భయాలు. ఇక రెండో తరగతివి. ఈ భయాలు ఎక్కడికీ పోవు, మెదడు పొరల్లో ఎక్కడో నక్కి ఉంటాయి, మనసు కాస్త కుదుట పడిన వేళ్ళలో, ఆలోచనలకు కాస్త తీరిక దొరికిన సమయల్లో నెమ్మదిగా తలపుల తలుపులు తెరుచుకుని ఒచ్చి మొహం చూపించి మళ్ళీ మాయం అవుతాయి. మిట్ట మధ్యాన్నం...సూర్యుడు నడి నెత్తికొచ్చాడూ...చుట్టు అంతా వెలుగే...అయినా...ఆ నిశ్శబ్దం చీల్చుకుంటూ...ఒక్కసారి ఫోను మోగితే...ఇంట్లో లేని వాళ్ళ గురించి వినకూడని వార్త వినాల్సి వస్తే....ఈ భయాలు కల్పనలలోంచి పుట్టుకు రావు, వీటికి వేళ్ళు వాస్తవాల్లోనే ఉంటాయి. చీకట్లోంచి దెయ్యం వచ్చి మీద పడుతున్న భయం కన్నా, ప్రేమించే వాళ్ళ గురించి వినలేని వార్త వినాల్సి వస్తుందన్న భయం కోటి రెట్లు భీతావహం. అందుకే, కల్పన కన్న వింతైనది, భయం కొల్పేది, నిజం...సాధ్యత కలిగిన నిజం (possible truth). దీనిలో, సాధ్యత కలిగిన నిజాల్లోకి అత్యంత భయకరమైనది చావు...అంతేనా? చావేనా?

భయం అన్న ఏకైక భావనను ఊతం చేసుకున్ని గత నాలుగు దశాబ్దాలుగా తన పబ్బం బ్రహ్మాండంగా గడుపుకుంటున్న రచయిత స్టీఫెన్ కింగ్. కుక్కల దగ్గర నుంచి కార్ల వరకు, దెయ్యాల దగ్గర నుంచి గ్రహాంతర వాసుల వరకూ ఏ వస్తువునీ విడవకుండా ఒక్కో నవలలో ఒక్కో రీతిలో ప్రపంచాన్ని హిస్టీరియా రోగ పీడితుల్లాగా వణికిస్తున్న అసాధారణ రచయిత. భయము, చావుని త్రికరణ శుద్ధిగా నమ్ముకుని ఇప్పటికి 60 కి పైగా పుస్తాకాలు రాసిన ఈయన, ఇప్పటికీ తన రచనల్లో తనను వ్యకిగతంగా భయపెట్టిన రచన ఏమిటయా అంటే ఠక్కున Pet Semetary అంటాడు. ఈ పుస్తకం విడుదలయి దాదాపు 25 సంవత్సరాలు కావొస్తోంది, కాని కింగ్ తన మాటని ఇప్పటి వరకూ మార్చునే ప్రయత్నం చేయలేదు. Pet Semetary కి మించిన భయం పడను, పెట్టలేను, పెట్టబోను కూడ అని ఘంటాపధంగా చెబుతాడు. ఈ వాక్యంలో ఏమాత్రం అతిశయం లేదు. నిర్ద్వంద్వంగా Pet Semetary స్టీఫెన్ కింగ్ రచనల్లోకి అత్యంత భయోత్పాత మయినది (horrific). విచిత్రమేమిటంటే ఇందులో దెయ్యాలూ భూతాలు ఉండవు, రక్త పాతాలూ, మారణ కాండలు ఉండవు. ఇవి లేకుండా భయమేమిటయ్యా అంటే, ఈ నవల పునాది అంతా వాస్తవంలో, సాధ్యత మీద ఉంటుంది. ఒక డాక్టరు కుటుంబం, ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య, ముచ్చటైన ఇద్దరు చిన్న పిల్లలు (వయసులు 10, 2). ఆ ఊరికి ఉద్యోగం నిమిత్తం కొత్తగా వచ్చారు. ఊరు శుద్ధ పల్లెటూరు - నాగరికతకు దూరంగా, ప్రశంతతకు దగ్గరగా. విసిరేసినట్టు ఉన్న ఇళ్ళు. యాంత్రిక యుగంలోనే ఉన్నారని గుర్తు చేస్తునట్టు అప్పుడప్పుడు ఉన్న ఒక్క పెద్ద రోడ్డు మీద దూసుకుపోయే పెద్ద పెద్ద ట్రక్కులు. ఇదే వాతావరణం. కింగ్ శైలి పాఠకుడిని ఆ ప్రదేశం లోకి తీసుకుని వదిలేస్తుంది. వాహనాల హోరు కన్నా గాలి హోరు అక్కడ ఎక్కువగా వినిపిస్తుంది. రోడ్డుకి ఒక వైపు డాక్టరుగారి కుటుంబం మరొక వైపు దూరంగా ఒక వృద్ధ దంపతుల కాపురం. కనుచూపు మేరకు కనపడే ఇళ్ళు ఈ రెండే. వచ్చిన రోజే తాతగారు పరిచయాలు చేసుకుంటూ డాక్టరుని హెచ్చరిస్తాడు, రోడ్డు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త అని. ఇక అక్కడి నించీ కథ తనంతట తానే రాసుకుపోతుంది. ప్రతి రోజూ పొద్దున్నే దినపత్రికలో కనపడే చిరపరిచితమైన వార్త - అదుపు తప్పిన వాహనం, అభాగ్యుని మరణం. యేళ్ళ తరబడి వినీ వినీ చూసీ చూసినా కూడా, అప్పుడప్పుడూ ఉలిక్కిపడేట్టు చేసేది, అటువంటి వహనాలకి అభం శుభం ఎరుగని పసి కందులు బలైపోయినప్పుడు. స్కూలు బస్సు రివర్స్ చేస్తూ చూసుకోకుండా అప్పుడే దిగిన చిన్నారి మీద ఎక్కించేసిన వార్తలు, ట్రాఫిక్ అంటే అవగాహన లేని పిల్లలు రోడ్డు మీదకు పరిగెత్తి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు, ఇవి దినపత్రికల్లో నిత్యపారాయణలూ. అనుకున్నదే జరగకూడనిదే జరుగుతుంది, డాక్టరుగారి రెండేళ్ళ పిల్లవాడు ఒక సాయకాలం పూట ఆటలో తండ్రి వెనక పిలుస్తున్నా, అరుస్తున్నా, వెంటపడుతున్నా, వినక ఆగక, ఆ రోడ్డు మీదకి పరిగెత్తి, తండ్రి కళ్ళ ఎదురుగానే, ఎగిరి దూకి పట్టుకోబోయిన చేతులకి ఒక రెండడుగుల దూరంలోనే, ఒక ట్రక్కు కింద నలిగి, ఈడ్చుకుపోబడి....

చావు బ్రతుకుకి ఒక విషాదాంతం అన్నది జీవిత సూత్రం అయితే, కింగ్ ఆ సూత్రానికి సిసలైన అగ్నిపరీక్ష పెడతాడు. ఒకవేళ, ఏ అవకాశం చేతనైనా చచ్చి పోయిన వారిని తిరిగి బ్రతికించుకోనే అవకాశం ఉంటే...ఉన్న చిన్న మెలిక అల్లా, మృత్యువు నించి తిరిగి వచ్చే వారు పూర్తిగా పూర్వపు మనిషిగా తిరిగి రాకపోవచ్చు...కళ్ళు కాస్త నిస్తేజంగా ఉండవచ్చు, మనసులో పూర్వపు బంధాలు, అనుబంధాలు గుర్తుండక పోవచ్చు, మాటల్లో, చేతల్లో అంతకు మునుపు లేని కౄరత్వం (పైశాచికత్వం) అక్కడక్కడా మెరవవచ్చు, ఇంకొన్ని లోపాలూ, దోషాలు ఉండిఉండ వచ్చు. కానీ విషాదంతో రగిలిపోతున్న మదికి ఇవీ ఏమీ పట్టవు. ప్రమాదంలో మాంసపు ముద్దగా మిగిలిన వాడు, ఒక్కసారి మళ్ళీ యధా రూపంలో కళ్ళకు కనిపిస్తే చాలును, మాటలు ముద్దుగా కాక ముద్దగా నూతిలోంచి వస్తున్నట్టు ఉన్నా ఒక్కసారి ఆ గొంతుతో మళ్ళీ తనని పిలిస్తే బావుండు, ప్రతీ రాత్రి పడుకునే ముందు నిష్కల్మష ప్రేమతో పెనవేసుకునే ఆ చిన్న చేతులు మరొక సారి కౌగిలించుకుంటే (అది ధృతరాష్ట్ర కౌగిలి అయినా సరే) బావుండు అన్న భావనలు (అందులో తిరిగి తెచ్చుకునే అవకాశం ఉందని తెలిసినప్పుడు) విచక్షణలకు, ప్రకృత్రి నియమాలకూ తావునీయవు. ఇంట్లో ఉన్న పిల్లవాడు పొద్దున్నే బడికి వెళ్ళి తిరిగివచ్చేంత వరకు ప్రతి తల్లితండ్రుల మదిలో ఎక్కడో గూడు కట్టుకున్న అత్యంత సహజమైన సాధ్యత (possible) ఉన్న అతి పెద్ద భయం ఇది. ఇదేనా ఆఖరి సారి, ఇవేనా ఆఖరి మాటలు, ఇదేనా ఆఖరి చూపు... ఇక్కడ ఆ భావావేశాలతో (అంత భయపడుతూనే) ఆడుకుంటాడు కింగ్. అదే పరిస్థితుతలో ఏ తల్లి ఉన్నా, ఏ తండ్రి ఉన్నా ఏం చేస్తారు? చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఆ దేహాన్ని తెచ్చి తిరిగి ఇంట్లో పెట్టుకుని అవే అవ్యాజానురాగాలు పంచగలరా? కన్న పాశం, గర్భశోకం ఎంత వరకు తెగించగలదు? కధలోని చివరి రెండొంతులు విషాదానికి, విచక్షణకి, విధ్వంసానికి మధ్య జరిగే వర్గపోరుని ప్రతిబింబిస్తుంది. బాధను భరించలేక ఏకాస్త ఊరటైనా ఏదో విధంగా పొందడానికి మనసు చేసే ఆలోచనలు, తప్పని తెలిసినా సరే వాదంతో తర్కంతో తనను తాను సమాధాన పరుచుకునే పద్ధతి, కింగ్ రాసిన (అనేకానేక) స్వగతాలకి మకుటాయమానంగా నిలుస్తుంది. భయానికి అర్ధం ఏ విధంగా వయసుతో పాటు మారుతుందో, అదే విధంగా Pet Semetary కి ప్రతిస్పందన కూడా. పిల్లలు లేనప్పుడు చదివితే ఇది కేవలం ఒక మంచి రచయితకి వచ్చిన గొప్ప ఊహగా వర్గీకరించచ్చు, అదే పిల్లలు కలిగిన తరువాత చదివితే, చావు దైనిందినానికి ఎంత దగ్గరగా ఉందో, విషాదం మనిషిని ఎంత దూరం వరకూ లాకెళ్ళగలదో, నిజ జీవితల సాక్షిగా చూపించగలిగిన గొప్ప దర్పణం Pet Semetary.

పుస్తక సమీక్ష : The Innocent Man




గణేష్ ఉత్సవాల నేపధ్యంలో నేర చరిత్ర కలిగిన వాళ్ళని ముందు జాగ్రత్త చర్యగా జైళ్ళలోకి తోయడం, నగరంలో భారీ దొంగతనం ఏది జరిగినా పేరు మోసిన ముఠాలకు ముందస్తుగా విచారణల పేరుతో థర్ద్ డిగ్రీ తీపి రుచులను మారు వడ్డించడం వ్యవస్థకు చిరపరిచతమైన చర్యలు. ఇవి చూసినప్పుడు శిక్ష పడేది చేసిన నేరానికా, ఉన్న నేర ప్రవృత్తికా అన్న మీమాంస వ్య్వస్థను వేధించక మానదు. నేరాన్ని నివారించడనికి, సంఘాన్ని పరిరక్షించుకోవడానికి ఇవన్నీ ఆవశ్యకాలు అని సంఘం ఎంత సరిపెట్టుకున్నా, అదే శిక్షాస్మృతిలో వందమంది నేరస్థులకు శిక్ష పడకపోయిన పర్వాలేదు, ఒక్క అమాయకుడు కూడా చేయని నేరానికి బలి అవకూడదు అన్న సూత్రం అంతర్వాహినిగా చెలామణీ అవుతుందన్నది నిర్వివాదాంశం. శోచనీయమైన విషయం ఏమిటంటే, ఇంత ప్రాధమిక సూత్రం అంతర్వాహినిగా, ఆకాశంలో అరుంధతిగా, లేక చెప్పుకోవడానికి బావున్న నానుడిలాగా కాక, ఒక స్థిరమైన చట్టంగా తర్జుమా కాకపోవడం. ఆ కారణంతో ప్రపంచవ్యాప్తంగా వేల కొద్దీ నిర్భాగ్యులు వంచిత పరిస్థితుల దృష్ట్యా నేరస్థులుగా ముద్ర పడిపోయి జైలు గోడల మధ్య కృశించిపోవడమన్నది నాగరికతకు చెంప పెట్టుగా, సమాజానికి మాయని మచ్చగా ముద్ర పడిపోయింది. వాళ్ళు చేసిన ఏకైక నేరం, అంతకు మునుపు సంఘం చేత నేరస్థులుగా ముద్ర వేయించుకోవడం. 70వ దశకంలో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టేన్లీ కూబ్రిక్ 'A Clockwork Orange' అన్న చిత్రంతో నేర ప్రవృత్తిని శిక్షాస్మ్రితిని ఒక్క కుదుపు కుదిపాడు. అందులో అసాంఘిక భావాలు ధమనుల్లో జీర్ణిచుకుపోయిన ఒక కరుడు కట్టిన నేరస్థుడిని, శిక్షా వ్యవస్థ అప్పుడే కనిపెట్టబడిన ఒక కొత్త ప్రక్రియ ద్వారా సంస్కరణకు ప్రయత్నిస్తుంది. ఆ ప్రక్రియ ఒక విధంగా ఆ నేరగాడిలో మానవత్వం మొలకెత్తించడానికి బదులు, మనిషితనన్నే కూకటి వేళ్ళతో పెకలించివేసి చివరికి పిచ్చివాడిని చేస్తుంది. కొండ నాలుక - ఉన్న నాలుక చందాన సమాజ బాధ్యత నేరానికి శిక్ష వేయడం వరకే గాని, ఆ ప్రవృత్తిని ప్రేరేపించే మనసు మీద సమాజానికి ఎటువంటి హక్కు లేదని తేలుస్తుంది. సినిమా కాబట్టి విమర్శకులు ఆహా అన్నారు, ప్రేక్షకులు ఓహో అన్నారు. నిజ జీవితం లో సమాజం కాసింత కాని, శిక్షాస్మృతి రవ్వంత గాని మారిన పాపాన పోలేదు. ఇటువంటి అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న సమాజ అసంకల్పిత ప్రతీకార చర్యలకు బలైపోయిన ఒక వాస్తవ కధ, జాన్ గ్రిషం కలం కార్చిన ఒక కన్నీటి బొట్టు  'The Innocent Man : Murder and Injustice in a small town'

ఒక యువతి మానభంగం హత్యలకు బాధ్యుడిని చేసి ఒక వ్యక్తిని చట్టానికి రెండు కళ్ళ వంటి రక్ష-శిక్ష వ్యవస్థలకు రూపులైన పోలీసు యంత్రాంగం, చట్టం మంత్రాంగాలు కలిసి చేయని నేరానికి ఉరికొయ్యల ఊగులాటలకు ఎంత దగ్గరగా చేర్చాయో అన్నది స్థూలంగా కేసు. సరి సరి ఈ బాపతులు నేర చరిత్రలో కోకొల్లలు, ఈ మాత్రానికే న్యాయ దేవతకు ఏదో నడి బజార్లో పరాభవం జరింగిందన్నట్టు ఆవేశలూ ఆక్రోశాలు శోకాలూ ఎందుకో! అవును, ఈ బాపతలు మన ధర్మ పన్నాలలో చర్విత చరణాలూ నిత్య పారాయణాలూ. ఆ నేరాలు చేసింది నేను కాదు అని గింజుకున్నా, గొంతు చించుకున్నా  వినిపించుకోకుండా, ఏదీ నువ్వు ఆ నేరాలు చేయలేదని నిరూపించుకో అని జవాబుదారీతనాన్ని (burden of proof) ఎదురు ఆరోపించబడిన వాడి నెత్తి మీదే వెయ్యడం అన్నది ఈ కేసు ప్రత్యేకత. అందులోనూ నేరం జరిగింది మరణ శిక్షలకు పుట్టిల్లయిన అమెరికా దేశంలోని ఓక్లహోమ రాష్త్రం. ఇక్కడి న్యాయ సిబ్బంది నమ్మిన సూత్రం - shoot first, ask questions later (ముందు కాల్చు, ఆనక విచారించు). అది 80వ దశకం. అమెరికన్ సమాజంలో నేరం రాజ్యమేలుతున్న కాలం. ఆ పరిస్థితులకనుగుణాంగా నాటి దేశ అధ్యక్షులు నేరస్థులకు (ఆరోపితులకు) న్యాయస్థానాలలో ఏమాత్రం వెసులుబాటు లేకుండా చట్టాన్ని ఇనుప చట్రాలలో అష్టదిగ్బంధనం చేయడం, తత్ఫలితంగా పోలీసులకూ న్యాయస్థానాలకూ విశేషాధికారలు పట్టుబడడం, వాటి అండదండలతో 'న్యాయం'  ఋజువుల ఊతాల్లేకుండా విశృఖలంగా తాండవించడం ఈ కేసుకు పట్టిన దౌర్భాగ్యం, ఆ ఆరోపితుడు చేసుకున్న దురదృష్టం. నేటి రోజులకు మల్లే సంఘటనా స్థలుల నుండి DNA సాక్ష్యాలు సేకరించే సాంకేతికత ఇంక అబ్బని కాలం అది. అప్రత్యక్ష సాక్ష్యాలు (circumstantial evidence) ఆధారంగా మాత్రమే నిరూపింపగలిగే కేసుల్లో అప్పటి విఙ్ఞానం అందించిన ఏకైక  అస్త్రం - కేశ శాస్త్రం. నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన వెంట్రుక వాసి బట్టి నేరాన్ని నిరూపించడమే (నేరం చేసిన వాడిని నిర్ధారించడం) ఈ శాస్త్రం. కాని ఆ తరువాతి కాలంలో పెంపొందిన విఙ్ఞానం వల్ల తెలిసిన ఫలితం, కేశ శాస్త్రం లోపభూయిష్టమైనది తేలడం, దానిని ఆధరం చేసుకుని నిరూపించిన నేరాలలో 80% వరకు తప్పుడివిగా తేటతెల్లమవడం. ఇది ఆ కేసుకి సంబంధించిన సాంకేతికత (technicality). ఇప్పటి వరకు ఇంత నేరగాడి పరిచయం జరగలేదు కదూ...

నేరానికి ముందు అతని గతం అప్రస్తుతం. అయినా వివరాల కోసం ఐతే, చిన్నప్పటి నించి baseball ఆటలో మంచి ప్రావిణ్యం చూపి చదువుకున్న పాఠ్శాలల్లో, కళాశాల్లో మంచి పేరు తెచ్చుకుని, ఆ పైన దేశంలోనే ప్రఖ్యాతి కాంచిన New York Yankees జట్టులో చోటు సంపాదించి, ఎక్కడో చిన్న ఊరిలో పుట్టి New York వరకు ఎగసిన తారాజువ్వ తత్వం ఒక పార్శ్వం. కాని రెండు పదులు కూడా పూర్తిగా నిండని ఆ చిన్న వయసులోనే లభించిన ఆదరణ డబ్బు పేరునూ నిలబెట్టుకునే వయసు, అనుభవం, పరిపక్వత లేని కారణంతో నింగికెగసిన జువ్వ ప్రకృతి నియమంగా చల్ల బడి నేలరాలి పోవడం, అది తట్టుకునే మానసిక స్థైర్యం లేక వ్యసనాలతో సావాసం చేయడం, ఇక తన వెంటన్ సిరి, లచ్చి వెంటన్ అవరోధ..... వెరసి సర్వ భ్రష్టుడయ్యె... ఒకప్పుడు కుటుంబానికి కంటికి వెలుగుగా ఉన్నవాడు కాలక్రమంలో వారి గుండెల మీద కుంపటై, నిత్యమూ రగులుతున్న రావణ కాష్టమై... ఇవి కూడా చర్విత చరణాలే...ఇంటింటి రామాయణాలే... పెద్దగా ఆశ్చర్య పడాల్సినది ఏదీ లేదు. ఒక్కప్పుడు ఊరిలో ఎవరి కీర్తి దేదీప్యమానంగా వెలగ గలదన్న ప్రశ్నకు ప్రతి వారి వేలు తన వైపు చూపెట్టుకున్న వ్యక్తి, అ తరువాతి రోజుల్లో ఊరిలో ఎటువంటి అసాంఘిక పని జరిగినా అవే వేళ్ళు తన వైపు తిప్పుకున్నే దశకు దిగజారాడు. చెడు అలవాట్లూ, సావాసాలు, అందితే ఫోర్జరీలు, అవి చెల్లని చోట చిల్లర దొంగతనాలు, జడలతో జతులూ, వాటితో జగడాలూ, ఎక్కే జైలూ, దిగే కేసూ. కానీ వీటిలో ఎక్కడా హత్యల వెరకూ దారి తీసే పరిస్థితులు లేవు. ఎప్పటికన్నా మారకపోతాడా అని గుండె చిక్కబట్టుకున్న తల్లితండ్రులూ, తిరిగి మళ్ళీ తారపథాన దూసుపోకపోతాడా అని కనిపెట్టుకున్న అక్కలూ....ఇది ఆ నేరగాడి నేపథ్యం. ఓ రాత్రి.... ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు....తెలిసేసరికి తన ఇంట్లో చచ్చి పడి ఉన్న ఒక యువతి, హత్యా స్థలంలో వేలి ముద్రలు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు, హత్య చేసి పోయిన వాడు జారవిడిచిన వల్లా ఓ రెండు తల వెంట్రుకలు. (ఆ వెంట్రుకలే ఉరితాళ్ళై అతని మెడకు బిగిసినాయి). ఆధారలు ఏమీ లేని చోట మొలకెత్తేవి అనుమానాలే. ఉన్న వేళ్ళు అసంకల్పితంగా పాపాల భైరవుడి వైపు చూపడం, మెరుపు వేగంతో రక్ష-శిక్ష వ్యవస్థ వ్యవహరించి, 'చట్టం తన పని తను చేసుకుపోయిందని ' అని చంకలు గుద్దుకోవడం జరిగిపోయినాయి. మిగిలిన వల్లా 'నేను కాదు మొర్రో' అన్న మొరలే...

అమెరికన్ న్యాయ వ్యవస్థకు, భారతీయ వ్యవస్థకూ ఉన్న వ్యత్యాసం, అక్కడి న్యాయ పతులు ప్రజల చేత ఎన్నుకోబడిన వారు, ఎంతో ముఖ్యమైన ఆ పదవులకి కూడా ఎన్నికలు, పోటీలు, అవతలి వాడి దుమ్మెత్తి పోయడాలు తదితర ప్రజాస్వామ్య అవలక్షాణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. పోటీ చేస్తున్నాపుడు నేను ఇంతమందిని ఉరికంబం ఎక్కించాను, నేను ఇంతమందిని జైళ్ళలోకి నెట్టేను, అసలు నేరం అన్న మాటకు నా పేరంటేనే హడల్ వంటి ప్రగల్భాలు పలకడాలూ, ఛాతిని చరుచుకోవడాలూ కడు మామూలు. మధ్యంతర ఎన్నికలూ వస్తున్నాయంటే ఏవిధంగా పాలక పక్షంవారి మనసులు మబ్బుల్లా కరిగి వరాలు వర్షిస్తాయో, అదే విధంగా ధర్మాధికారుల ఎన్నికలు సమీపిస్తున్నాయంటే న్యాయపతులకు చట్టం మీదా ఎక్కడ లేని మమకారం, దాని ఉల్లంఘన అంటే పట్టరాని కోసం, అవి చేసిన వాడిని ఏ కాస్త వీలు చిక్కినా ఉరికొయ్యలకు ఎర వెయ్యడం అమెరికన్ న్యాయ వ్యవస్థపు అతి పెద్ద లోపం. న్యాయం, విద్య, వైద్యం, ఈ సమాజపు మూలస్థంబాలు ఎప్పుడైతే ప్రజా హితం నించి మరలి ప్రజాదరణ (వాళ్ళకేది ఇష్టమో అదే ఇస్తాం) బాట పట్టాయో, ఆ మూడిటికీ సమాజంలో ఉన్న సమున్నత స్థానం కాస్తా సాధారణమయిపోయింది. నన్ను గెలిపించిండి నేను మరిన్ని మరణ శిక్షలు అమలు చేస్తా, కాదు నన్ను గద్దె నెక్కించండి నేరం గుండెల్లో నిద్ర పోతా, అంటూ శపథాలు చేసే తలారులు ఒక పక్క, ఇక వారి న్యాయ వ్యవస్థలోని మరో బలహీనత - ప్రజలే ధర్మకర్తలై వ్యవహరించే పద్ధతి (jury of peers) - మరొక వైపు. చేసిన తప్పు నలుగురి ఎదురుగా ఋజువు చేసే ఆలోచన ఉదాత్తమే కావచ్చు, కాని ఆ నిర్ణయాధికరం కలిగిన ఆ నలుగురికి కూడా ఆవేశకావేషాలు ఉంటయని, వాటిని రెచ్చకొట్టి వారిని తెలివిగల న్యాయవాదులు తమకు అనుకూలంగా తెచ్చుకోగలరని, అసలు నేరాన్ని ఋజువు చేయడం చేయకపోవడంతో పని లేకుండా, ఆ ధర్మకర్తల్ని ప్రసన్నం చేసుకోవటమే న్యాయస్థానల పరమార్ధమైపోయిన పరిస్థితులలో, ఒంటరి (అందులో చాల అందగెత్తైన) ఆడదాని మీద నీచంగా కిరాతకంగా కీచకంగా ప్రవర్తించింది మునుపు నేరాల గండపెండేరాలు ధరించిన ఈ నిత్య నేరగాడే అని నమ్మించడానికి ఎవరూ పెద్దగా కష్టపడలేదు.  అనుకున్నట్టే తూ తూ మంత్రాల చావు బాజా మోగడమూ అతని ఉరి శిక్ష పడడమూ పధకం ప్రకారం జరిగిపోయినాయి...కధ ఇక్కడే ముగియలేదు...అసలు అక్కడే మొదలయ్యింది...

విచారణ మొదలు పెట్టక మునుపు నుండి అతని ప్రవర్తన రోజు రోజుకీ దిగజారడం కళ్ళకి గంతలు కట్టుక్కున్న న్యాయానికి కనపడలేదు. ఒక్కొక్కసారి ఉలుకుపలుకూ లేక మౌన మునిలా ఉండిపోయిన వాడే, మరు నిముషమే ఉన్మాదిలా మారి పిచ్చి ప్రేలాపనలు చేయడం, ఒక్కోసారి కేసు పూర్వోత్తరాలు ఔపోసన పట్టిన అగస్థ్యుడిలా వల్లెవేసిన వాడే, మరో సారి పిచ్చివాడిలా శూన్యంతో సంభాషించడం న్యాయస్థానం చూసినా, అవి schizophrenia లక్షణాలు అని తెలిసినా వైద్య పరీక్షలకు ఆదేశించనూలేదు, తాత్కాలిక పిచ్చితనం (temporary insanity) కింద విచరణార్హుడు కాదు అని ప్రకటించనూలేదు. ఆ ప్రహసనం అంతటితో ముగియలేదు. న్యాయస్థానం కాబట్టి ఆ పిచ్చితనాన్ని ఉపేక్షించి అప్పుడప్పుడూ సుత్తి విరిగిపోయేలా order order అని గద్దించినా, శిక్షను అమలు చేసే జైళ్ళు ఆ మాత్రమూ కనికారం కూడ చూపకుండా, మాట వినని పిచ్చి వాడిని నేరుగా ఏకాంత నిర్బంధానికి (solitary confinement) నడిపినాయి. అసలే ఉన్మాదం, అందులో బలవంతపు ఏకాంతం. న్యాయపు వైకుంఠపాళీలో అతనికి పడిన ప్రతి అడుగున ఒక కాలసర్పము కాచుకోవడం కసిగా కటువేయడమే. అతనిది దురదృష్టమా,  న్యాయపు పక్షపా(వా)తమా,  లేక వ్య్వస్థాగత లోపమా అన్నది యక్ష ప్రశ్నే. ఈ కధలో ఎక్కడా గ్రిషం కనిపించడు. కల్పనలో కూడ రాయలేని మలుపులు, ప్రతినాయకుల కంటే కృరమైన ప్రతికూల పరిస్థితులూ,  కంచే చేను మేసిన చందాలు ఈ చేదు వాస్తవానికి సొంతం. మరణ శిక్షను సమర్ధించే వారు మరిచే ముఖ్యమైన విషయాలు ఈ కధలో ప్రతి పుటాలో సాక్షాత్కరిస్తాయి - నేరం శిక్షార్హర్మే కావచ్చు, కాని నేరగాడని నిర్ణయించే పద్ధతులు సహేతుకం కాకపోతే అది నేరాన్ని మించిన ఘోరం అవుతుంది . వాటిలో ఏ మాత్రమైనా అనుమానానికీ, సందేహానికీ తావుంటే, నేరం ఋజువు చేసే ప్రక్రియలో చేతకాని తనానికి చోటిస్తే, న్యాయ దేవత చేతిలోని త్రాసు యొక్క రెండు పక్షాలు నేరము-శిక్ష కాక, అభిప్రాయం-మంది న్యాయం (mob justice) కే ప్రతీకలవుతాయి. కొన్ని ఖచ్చితమైన కేసుల్లో మరణ శిక్ష సరియైనదే కావచ్చు, కాని మనిషి తాలుకూ దౌర్బల్యం, కౄరం, పక్షపాతం నిజ నిర్ధారణ పద్ధతులపై పడినంత కాలం, జరిగినది ఏదీ, నిరూపించగలినది ఏదీ, నేరమేది, శిక్ష ఎవరికి అన్న వాటి మీద అనుమానాలు రాక మానవు, ఆక్షేపణలూ జరగక మానవు. నూటికి తొంభైతొమ్మిది శాతం సక్రమమైనా, కాని ఆ ఒక్క శాతం విషయంలో తిరగబడలేని అమాయక చక్రవర్తులకు ముళ్ళ కిరీటాలు తొడగబడితే? వ్యవస్థ మొత్తం కూడబలుక్కుని ఒక మనిషి మీద కసి తీర్చుకుంటే? వ్యక్తిగతం కాకపోయినా వ్యవస్థలో అనాదిగా పేరుకుపోయిన పాచి భావాల కారణంగా రంగు, జాతి, మతాల పరదాల కింద నలిగి నిజం కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతుంటే? ఇదే కధలో జరిగితే చదివిన వాళ్ళకు కన్నీరొలకచ్చు, అదే నిజ జీవితంలో ఐతే, ముసురుకున్న పరిస్థితులు ఉసురు తీయడానికి చూస్తే, గుండె చిక్కబట్టుకున్న వాడు తీవ్రవాది అవుతాడు, అంత బలం లేని వాడు పిచ్చి వాడు అవుతాడు.

పుస్తక సమీక్ష - India After Gandhi




' నమ్మితే ప్రాణాలైన ఇస్తాం, నమ్మెడమేరా కష్టం', 'నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం', 'రూలు ఉంది రాంగూ ఉంది, తప్పుకు తిరిగే లౌక్యం ఉందీ - ' ఖడ్గం ' సినిమాలోని ' మేమే ఇండియన్స్ ' పాటలోని కొన్ని పంక్తులు ఇవి. విదేశాల్లో ఉండే భారతీయులకు తరచు తారసపడే ప్రశ్న - ' మీ భారత దేశం ఎలా ఉంటుంది '. పాత సినిమాల్లో మాదిరి ఆ ప్రశ్న ప్రతి భారతీయుడి మొహం మీద రింగులు రింగులు తిరిగేలా చేసి తీవ్రమైన వైరుధ్యాల విరాట్ రూపాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తుంది. సాకీలో ' ఏమని వర్ణించను ' సోలో పాట లోకీలో వినిపిస్తుంది. వెంటనే తెల్ల దుస్తుల్లో ఆదర్శప్రాయ, లోకమాన్య భారతీయుడు ఒక వైపు, మరో వైపు నల్ల దుస్తుల్లో పరిపూర్ణ మానవత్వానికి సరిగ్గా వ్యతిరేక  లక్షణాలు నిండిన నీచ భారతీయుడు ఠంగున ప్రత్యక్షమైపోయి వాదులాటలూ, పెనుగులాటలూ, పోట్లాటలూ చేసుకోవడం మొదలు పెడతారు. ' ఐహికాన్ని కొన్ని వేల యేళ్ళ క్రితమే త్యజించిన చింతన నాది ' గర్వంగా ప్రకటిస్తాడు తెల్ల భారతీయుడు (తె.భా.). అసలు అటువంటి ఊసే ఒకటి చేసానని మరిచిపోయి, క్రమంగా తెలివిని తగ్గించేసుకుని, సామాన్యత్వాన్ని కొండకచో దిగజారుడు తనాన్ని అలవరుచుకుని, ఉచ్ఛం వదిలి నీచాన్ని ఆబగా ఆలింగనం చేసుకున్న అభ్యుదయవాదిని, సిసలైన సామ్యవాదిని, తలెగరేస్తాడు నల్ల భారతీయుడు (న.భా.) శూన్యన్ని శోధించి, మధించి, ఆరాధించి, ' సున్నా ' కనిపెట్టిన నిఖార్సైన మిధ్యావాదిని, తె.భా. ' సున్న ' తరువాత మిగిలిన నాగరికతలు తక్కిన అంకెలు కనుక్కుని ముందుకు దూసుకు పోయినా, ఆ ' సున్నా ' సోయాగాన్ని ఆ నున్నని నిగారింపుని తనివి తీరలేనంతగా తలపులలోకి తెచ్చుకుంటూ, తక్కిన మానవాళికి ఉన్నత సోపానాల నధిరోహింప చేసి, తను మాత్రం అక్కడే తొలి మెట్టూగా మిగిలిపోగల సహృదయతనూ, సౌభ్రాతృత్వాన్ని చాటుకుంటుంటాడు న.భా. ' యత్ర నారీ పూజ్యాతే ' సూక్తినాలకించి పూజా పీఠాల నుండీ అధికార పీఠాల వరకు స్త్రీలని పై వరుసలో ప్రతిష్టించిన గొప్ప చరిత ఘనత నాది, తె. భా. అదే స్త్రీలను పిండ రూపం నుంచి పోయిన తరువాత పిండం పెట్టే వరుకూ వింత రీతులలో చిత్ర హింసలు పెట్టగల మగతనం నాది, మద హజం నాది, న.భా. ఇంతకీ మీ భారతదేశం ఎలా ఉంటుందయ్య అని ప్రశ్న వేసినవాడు ఎప్పుడో కదిలిపోయినా, ఈ వాదాల వలువలు చిలవలు పలవలు. ఒక్క ముక్కలో తేల్చవయ్యా అంటే, భారతీయం అనేది భౌగోళికం కాదు, అది పూర్తిగా మానసికం.

నాడెన్నడో మహాభారతంలో శకునిది గాంధారం (నేటి అఫ్ఘనిస్తాన్), అక్కడెక్కడో అర్జునుడి భార్యల్లో ఒకరి పుట్టిల్లు సుమాత్రా (థాయిలాండ్) అన్న పురాణాల ప్రామాణికం తీసుకుంటే ఆ శకుంతలా భరతుడి అవిభాజ్య దేశం అటు పశ్చిమాన మధ్య ప్రాచ్యం నుండి ఇటు తూర్పు ఆగ్నేయాసియా వరకూ, అటు ఉత్తరం హిమవన్నగలా నుండి, ఇటు దక్షిణం రావణ రాజ్యం వరకూ. ఈ సువిశాల భూభాగంలో భిన్న జాతులూ, సంస్కృతూలూ, భాషలూ, మతాలూ, కులాలూ, అచారాలూ, వ్యవహారాలూ. ఇందులో ముఖ్యంగా ఎవరి చరిత వారిదే, ఎవరి తీరు వారిదే, ఎవరి ముచ్చట వారిదే. కాకతీయ పరిపాలనా పాటవాల మీద కళింగ కవులు కీర్తిగానాలు చేసిన దాఖలాలు లేవు, అలాగే నాటి పాటలీపుత్రపు గుప్తుల స్వర్ణ యుగం గురించి, ఇక్కడి గోదావరీ తీరంలో నన్నయ పద్యాలు అల్లలేదు. అందుకే ' భారత దేశ చరిత్ర ' అన్న పద సమ్మేళనం ఒక పరస్పర వైరుద్ధ్యం (oxymoron). ఇది ఎవరికి వారే యమనా తీరే. విచిత్రమేమితంటే ఈ భారత దేశం అన్న భావన పరిపాలనా సౌలభ్యం కోసం తెల్లవాడు చేసిన ఒక ఆలోచన. 14 అగస్ట్ 1947 అర్ధరాత్రి వరకు భారత దేశం అంటే 500 పైచిలుకు సంస్థానాల సముదాయం. అధికార వికేంద్రీకరణ పేరుతో బర్మా, భూటాన్, శ్రీలంక, పిదప రాజకీయ కారణలతో పాకిస్తాన్లను, ఈ సంస్థానాల మట్టి ముద్ద నుంచే తెగ్గోసి, విడగొట్టి, ఆ అవశేషాన్ని భారత దేశం అన్నాడు. నేటి భారతీయుడు నాటి గాంధారాన్ని తనది చేసుకోవచ్చు. నేటి శ్రీలంకను తన దేవుడు నడిచిన నేల అని కొలవచ్చు. కానీ ఇదే నేల నుండి వేరుపడిన నేటి పాకిస్తాన్ తన క్షిపణి పేర్లను నాడు దేశన్ని కొల్లగొట్టిన ఘజినీ, ఘోరీల పేర్లు పెట్టుకుని మురవడం, నేటి భారతీయుడికి మింగుడు పడని విషయం. దానికి కారణం ఒకటే, భారతీయులకి ఒక కలివిడి చరిత్ర (shared/common history) లేదు. ఒక దేశానికి ఉండవలసిన భాషా ఏకత్వం లేదు, సమిష్టి సంస్కృతి లేదు, ఆద్యులు లేరు, మూలాలు లేవు. ప్రపంచంలో చారిత్రక చిరునామా లేని ఏకైక దేశం భారతదేశం. వేళ యేళ్ళ చరిత్రకు నేడు వారసులు లేక, అప్పటి రాజ భాషకు (సంస్కృతం) నేడు ఆదరణ లేక, ఒక నాగరికత మృతమైపోతోదన్న సందర్భంలో తెల్లవాడి అసంకల్పిత చర్యలవల్ల, నేడు భారత దేశానికి మళ్ళీ ఒక అస్థిత్వం వచ్చింది. ఒక విధంగా భారత దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన, అదే విధంగా అత్యంత నవీన దేశం. అటువంటికి దేశానికి ఒక చరిత్ర గ్రంధం రాయడం అనేది, సముద్రానికి మొదలు వెదకడం లాంటిది. ఇక్కడ పురాణాలకూ, చరిత్రకూ వ్యత్యాసం బహు స్వల్పం. కధలకూ, వాస్తవాలకూ, కల్పనలకూ కాలం విప్పలేని ఒక పీట ముడి పడిపోయింది. అటువంటి బ్రహ్మ ముడిని విప్పే ప్రయత్నమే 'India After Gandhi'. పురాణాలూ, పారాయణ గ్రంధాల సరసన నిలవగల, చిన్న తరగతుల నుండి ఉన్నత విద్యల దాకా నిర్బంధ పాఠ్యాంశంగా నిర్ణయింపదగ్గ ఒక సత్య శోధన.

ఛ...ఛ...ఛ.. దేశానికి నెహ్రూ కాకుండా పటేల్ ప్రధాని అయ్యుంటే మన పరిస్థితి వేరుగా ఉండేది, అసలు గాంధీ-నెహ్రూ కారణంగానే మన దేశం విడిపోయింది, నెహ్రూ సామ్యవాదం కాకుండా పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించి ఉంటే, అల్పసంఖ్యాక వర్గాలకు రిజర్వేషన్లు కులప్రాతిపదికన కాక కలిమిలేమితనం మీద ఇచ్చి ఉంటే, రష్యాకు చాచిన స్నేహ హస్తం మొదటి నించి అమెరికాకు అందించిన ఉంటే....అసలు ఇవన్నీ కావండీ, ప్రజాస్వామ్యం కాక చైనా తరహా కమ్యూనిసం ఎంచుకుని ఉంటే....దేశం నేడు ఎందుకు ఈ స్థితిలో అఘోరిస్తోంది అని వాపోయే ఉబుసుపోక విశ్లేషకులు చెప్పే కారణాలలో కచ్చితంగా ఈ పైవాటిలో ఒక రెండు మూడు ఉండి తీరుతాయి. కానీ స్వాతంత్ర్యం అప్పుడే సిద్ధించిన జాతి తొలి అడుగులకు తడబడుతున్న సమయంలో తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం వెనక ఎంత ఆలోచన ఉందో, సమస్యల పట్ల ఎంత సమగ్ర అవగాహన అధ్యయనం ఉన్నాయో, ఇంత భిన్నత్వాన్ని ఒక్కతాటి మీద నిలాపలన్న ఏక దీక్ష వెనుక ఎంతటి శ్రమ ఉందో, ఎంత రక్తం చిందిందో, ఎంత స్వేదం ఇంకిందో, ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్న తరువాత ప్రతి భారతీయుడికి కళ్ళు చెమరించక మానవు, ఛాతి గర్వంతో పొంగక మానదు. ఈ ఎనభై యేళ్ళ శైశైవ స్వంతంత్ర దేశం ప్రతి దశకంలోనూ విచ్ఛిన్నానికి ఆమడ దూరంలో నిలిచిన ప్రతీ సారీ అరాచక మూకలకు ముకుతాడు వేసి సుస్థిరత వైపు ఈడ్చుకుపోయిన ప్రతీ కృషీవలుని కాయకష్టం మేధోమధనం ఈ పుస్తకంలోని ప్రతి పుటాలో దర్శనమిస్తాయి. దేశంగా కలిసుండడానికి భూతద్దం వేసుకుని వెతికినా ఒక్క కారణం కనిపించని భిన్న ప్రాంతాలు, తమిళనాటి కళలు తమవిగా, కాశ్మీరపు కల్లోలాలు తమ పొరుగివిగా, యుద్ధాలలో అశువులు బాసిన అన్ని ప్రాంతాల సైనికులు తమ కుటుంబ సభ్యులుగా, నేడు ఆసేతుహిమాచలం ఒకే విధంగా స్పందించే విధంగా దేశాన్ని తయారుచేసిన కళాసీలకు ఈ పుస్తకం ఒక హృదయాంజలి. ఈ పుస్తకం ఒక వ్యక్తి అభిప్రాయం కాదు. ప్రముఖుల ఉత్తరాలు, నాటి వార్తా పత్రికలు, ప్రసంగాలు, ఆత్మ కధలు, ముఖాముఖులు తదితర అసంఖ్యాక మూలాల క్రోడీకరణ. (ఈ గ్రంధ సంకలన చిట్టా (bibliography) వంద పేజీల పైబడి ఉంది). ఒక తత్వవేత్త చెప్పినట్టు నిజం ఎప్పుడూ వైరుద్ధ్యాల సందుల కొనఊపిరితో కొట్టుకునే అల్పప్రాణం. ఆ నిజాల్ని ఆ సందుల మధ్యనుండి జాగ్రత్తగా వెలికితీసి ప్రపంచానికి (ముఖ్యంగా నేటి భారతీయులకి) తేటతెల్లం చేసే హృద్యమైన, మానవీయమైన, వీటన్నిటినీ మించి, దేశభక్తి ప్రబోధకమైన ప్రయత్నం India after Gandhi. చరిత్ర అంటే ప్రేమ పురాణాలు, ముట్టడులకైన ఖర్చులు, తారీకులు, దస్తావేజులు అని చిన్న చూపు చూసే వారికి చరిత్ర అంటే పంటి బిగువున మోయలేని బరువును ఎత్తిన ప్రయత్నాలనీ, రక్తమోడుతున్నా చివరి బొట్టువరుకూ పోరాటమాపని పటిమనీ, సమస్యలు మేరు పర్వతాలై నిలిచినా అగస్త్యుడిలా అధిగమించగలిగే సమయస్ఫూర్తనీ, అవే దస్తావేజులు, అవే తారీకుల ఆధారంగా రామచంద్ర గుహ ఆవిష్కరించిన అభినవ మహాభారతం India after Gandhi.


పుస్తక సమీక్ష - The Litigators



కాఫీ కొనుక్కోవడానికి కొట్టుకు వెళ్ళి, ఇచ్చిన కాఫీని చేయి జార్చుకొని ఒంటి మీద ఒలకపోసుకుని ఒళ్ళు కాలుచుకుని, తన ' చేతకానితనానికి ' కారణం ఆ కాఫీ వేడిగా ఉండడం వల్లే అని కాఫీ కొట్టు వాడి మీద కేసు చేసుకున్న ఉదంతం ఆ మధ్యకాలంలో అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ ' ఫార్సు ' అంతటితో ఆగలేదు. సదరు కోర్టు వారు ఫిర్యాదు వైపే మొగ్గు చూపి, కాఫీ మరీ ' అంత ' వేడిగా (ఆత్రేయ గారి భాషలో, అంత ' ఇదిగా ') ఉండకూడదని నిర్ధారించి, వారిచేత లక్షల డాలర్ల పరిహారం కూడా ఇప్పించారు. తత్ఫలితంగా ఇప్పుడు కాఫీ కప్పుల మీది సూక్ష్మ ముద్రణ (fine print) - 'కాఫీ వేడిగా ఉండవచ్చు, చూసుకుని ఊదుకుని జాగ్రత్తగా త్రాగ మనవి ' అని.

వేడిగా ఉన్న ఇస్త్రీ పెట్టె మీదా పొరపాటున చేయి వేసి చేయి కాల్చుకుని, అది చాలక ఆ ఇస్త్రీ వాడినే కోర్టుకీడ్చి ఉతికి ఆరేసిన సందర్భాలు, దొంగతనానికి ఒక ఇంటికి వెళ్ళి నేల మీద గచ్చు మరీ నున్నగా ఉండడంతో కాలు జారినందువల్ల నడుము జారిపోయిన కారణానికి ఆ ఇంటి యజమాని పైనే  కేసు వేసిన ఉదాహరణలు, అభూత కల్పనలు కావు. ఇవి అమెరికా న్యాయ వ్య్వవస్థకే మకుటాయమైన తార్కాణాలను. 'నేను నీతో ఏకీభవించను కానీ, నీ భావప్రకటనా హక్కు కోసం నా తుది శ్వాస వరకూ పోరడతా 'ననే సూత్రం అమెరికా స్వేఛ్ఛావాద సమాజానికి ఎలా మూల స్థంబమై నిలిచిందో, అదే విధంగా వారి న్యాయ వ్యవస్థలో హేతువు, తర్కానికి ఎంత ప్రాధాన్యత ఉన్నాయో, అవే పాళ్ళల్లో అవివేకం, తెలివితక్కువతనం, మూర్ఖత్వం, కొండకచో తుంటరితననికి కూడా అంతే ప్రవేశార్హత ఉన్నవనడానికి పై మచ్చుతునకు చాలు. దానికి వారు ముద్దుగా పెట్టుకున్న పేరు ' టార్ట్ ' (tort). ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఉండే ఏ వ్యవహారంలో ఐనా, అది ఆర్ధిక, రాజకీయ, మతపర తదితర ఏ పరిధి పరిమితులలో ఉన్నా, ఒకడు మరొకడిని ఏ కారణానికైనా, శారీక, మానసిక, సామాజిక నష్టాల కింద, కోర్టు కీడ్చే వెసులుబాటును వారి న్యాయ వ్యవస్థ కల్పించింది. ఆ చట్టం పేరే 'టార్ట్ లా'.

కానీ, పైన కాఫీ కేసులో ఇస్త్రీ ఇబ్బందిలో, ఏ లాపాయింటు లాగి అవతల సంస్థని గిలగిలలాడించవచ్చు? దానికి జవాబే, లాలోని మెలికెలు, మెలకువలు, చీకటి కోణాలూ, రేచీకటి తీర్పులన్నీ ఔపోసన పట్టేసి, కేసు వేయువారికి వీనుల విందుగా విశద పరిచే విద్యా విశరదులే మన లిటిగేటర్స్. కాఫీ మీద ఒలికి, ఒళ్ళు కాలిందా? తప్పు మీది ఎంత మాత్రమూ కాదు, అసలు ఆ కప్పు అంత వేడిగా ఎందుకు వుండాలి, ఉండెను ఫో! ఆ కప్పుకు ఒక పరిరక్షణా వలయాన్ని పొందుపరచుకుండా మీ చేతికేల అందీయాలి, ఇచ్చెను ఫో! ఆ విషయం, అదే కాఫీ వేడిగా ఉండును అన్న ప్రాధమిక విషయం, మీకు చెప్పకుండా ఏల దాచాలి! ఇందులో మీ అవివేకం, అప్రయోజకత్వం, అసమర్ధత, అజ్ఞానం, ఎంత మాత్రమూ లేవు, ఉంటే గింటే, ఆ పెట్టుబడిదారీ సంస్థ యొక్క దురహంకారం, ఏం చేసినా చెల్లునులే అన్న పొగరు, కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అది చాలు వారి ముక్కుని న్యాయస్థానం నేల మీద అరగదీసి, ఆ అరిగిన ముక్కుని పిండి నష్ట పరిహారం పొందడానికి. మా ఫీసా, భలేవారే, మీరు బయానాగా ఏమీ ఇచ్చుకోవక్కర్లేదు, ఆ 'లక్షల డాలర్లలో', ఒక పావో వంతో అరో వంతో మీకిచ్చే పరిహారంలో మేము మినహాయించుకుంటాం! పైసా పెట్టుబడి లేని బేవార్సు బేరం! ఆలసించిన ఆశాభంగం!

కాదే వస్తువూ కవిత కనర్హం అని కవి అన్నట్టు, కాదే అసంబద్ధమూ కేసుకనర్హం అన్నది ప్రస్తుత న్యాయవాద నీతి. ఈ టార్ట్ బారిన పడ్డ వ్యాపార సంస్థల మీద మరీ అంత జాలి పడే పరీస్థితీ కాదు. చిన్న ఉదాహరణ: విపణిలోకి కొత్తగా వచ్చిన ఒక సంస్థ కారులో సాంకేతికమైన లోపాలు ఉన్నట్టు సదరు కారు కంపెనీ వారు గుర్తించారు. ధర్మాన్ని అనుసరించి వెంటనే విక్రయించబడ్డ కార్లనన్నిటిని వెనక్కి పిలిపించి (recall) ఆ లోపాన్ని స్వీయ ఖర్చుతో సరిచేయించి తిరిగి దానిని వినియోగదారుడికి అప్పగించాలి. వాస్తవానికి జరిగేది వేరు. లోపాలు సవరించడానికి అయ్యే ఖర్చు కన్నా, ఆ సాంకేతిక సమస్యల వల్ల కలిగే ప్రమాదాలు, దాని ఫలితంగా అయ్యే కోర్టు కచ్చేరీల ఖర్చు తక్కువైతే, ఆ లోపాల మాట బయటికి పొక్కనివ్వరు, కోర్టు ఖర్చులే ఎక్కువనుకున్న పక్షంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించి (అంటే, తప్పని తద్దినంగా, చచ్చినట్టు) ఆ కార్లను తిరిగి రప్పించి బాగు చేయించే ప్రక్రియ చేపడతారు. ఈ వినిమయదారుడు - విక్రయదారుడి వింత లెక్కలలో, బాధితులు ఉండరు, లబ్దిదారులు తప్ప.

జాన్ గ్రిషం సరిక్రొత్త నవల ' ద లిటిగేటర్స్ ' న్యాయశాస్త్రపు మరో పార్వ్శాన్ని స్పృశించే మెచ్చదగిన ప్రయత్నం. ఇందులో విక్రయదారుడు, కోట్లకి పడగలెత్తిన ఒక మందుల కంపెనీ. వినియోగదారులు, ఆ కంపెనీ తయారు చేసిన కొలెస్ట్రాల్ మందు వాడిన వారు. వ్యాజ్యం, ఆ మందు వాడినందు వలన గుండెపోటు వచ్చి బాధితుడు పోయాడని అభియోగం. సూత్రధారులుగా, మందు వైపు, గంటకి వందల డాలర్లు వసూలు చేసే ఖరీదైన వకీళ్ళు, మంది వైపు, కంపెనీ కుంభస్థలాన్ని కొట్టి, ఆ కురిసే కోట్ల పరిహారానికి కాచుక్కూర్చునే చకోర పక్షుల్లాంటి చెట్టు కింద ప్లీడర్లు. ఇలాంటి బలవంతుడు-బలహీనుడి కధల నేపధ్యంలో, బలవంతుడు దుర్మార్గుడుగాను, బలహీనుడు ఆదర్శవాదిగా చిత్రీకరించడం సర్వ సాధారణం. బలం మీద హజం చేసి చివరికి నైతిక విజయం పొందడమనేది శిల్పం పరంగా చాలా స్ఫూర్థిదాయకమైన బాట. ఐతే గ్రిషం ఇక్కడ చూపించదలచినది వాస్తవం. నిజ జీవితంలో కోట్ల కంపెనీలన్నీ చెడ్డవీ కావు, బక్క చిక్కిన బాధితులందరూ పతిత్తులుగారు. ఇక్కడి పోరు అత్యాశకి అవకాశవాదానికి మధ్యలోనే. నోటి మీద నియంత్రణ లేక ఊబకాయులైన వాళ్ళు, తమ స్థూలత్వానికి మరొకరిని బాధ్యుల్ని చేసి తద్వారా ధనవంతులమవ్వాలన్న దురాశ ఒక వైపు, మందుల తయారీలో అత్యంత కీలక పర్వమైన మానవ పరీక్షలను (human testing) నియంత్రణల చట్టాలే లేని ప్రాంతలలో గుట్టు చప్పుడు కాకుండా చేససి సామాజిక బాధ్యతల నుండి చేయి కడిగేసుకునే పెట్టుబడిదారీ సంస్థల ధన మదాంధం మరొక వైపు. సందట్లో సడేమియా అంటూ, చచ్చిన శవాలను చూపి మొసలి కన్నీళ్ళు కారుస్తూ, సానుభూతిని రేకెత్తించి సంస్థల గల్లాపెట్టెలు కొల్లగొట్టచూసే న్యాయ బేహారీలు (dealers in law) ఒక వైపు. ప్రజా ప్రయోజనాలు వల్లించినా చివరకు లాభమే పరమావధిగా భావించే పెట్టుబడిదారుల, తమ అధోగతికి మరెవ్వడో కారణం అని చూపుడు వేలు ఎప్పుడూ ఎదుటి వాడి వైపు ఎక్కుపెట్టే ' బలహీన వర్గాల ', ఈ ఎలుక ఎలుక పోరును తీర్చే క్రమంలో రొట్టె మొత్తం ఎగవేసుకుపోదామని కాచుకుని ఉండే ప్లేడర్ల, ముప్పేట పోటీని కళ్ళు కట్టినట్టు వ్రాసిన గ్రిషం శైలి, కధనా చాతుర్యం అమోఘం. ఆదర్శానికి, వాస్తవానికి గల అంతరాన్ని సహజత్వం దగ్గరగా, కావలసిన మేరకే కల్పనని వినియోగించి, గ్రిషం వేలార్చిన ఈ కాలపు విదుర నీతి ' ద లిటిగేటర్స్ '.

తుదిపలుకు: ప్రఖ్యాత తెరవేల్పుగారి తాజా వ్యాపార ప్రకటనలో భవనాలు దూకుతూ, రోడ్ల మీద కార్ల పైకి ఉరుకుతూ, అవిశ్రాంతంగా అటుఇటూ ఎందుకనో పరిగెడుతూ, ఆ తెగువ అంతా ఫలానా వారిని శీతల పానీయం సేవించడం వల్లే అని అమాయకత్వంతో కూడిన అవివేకంతో శలవిస్తారు. ఆ ప్రకటన వస్తున్నంత సేపు, తెర దిగువ భాగం లో సూక్ష్మ ముద్రణలో - ఈ పరాక్రమం అంతా ఉత్తిత్తినే! నిజమే అనుకనేరు! దీనికి అంత దృశ్యము లేదు, దయచేసి అనుకరించవలదు - అని చూపించే అవసరం వెనక, పైన చెప్పి ఒక తెలివిలేని బాధితుడు, ఆ తెలివి తక్కువ తనాన్ని తన లాభంగా తర్జుమా చేసికున్న న్యాయవాదుల సమిష్టి కృషి దాగి ఉంది.

పుస్తక సమీక్ష - 11/22/63




సరిగ్గా 50 సంవత్సరాల క్రితం....1963...నాయకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భద్రతా సిబ్బంది ఇనప కవచాల వెనక నక్కి నడవని రోజులు....ప్రజా సమూహాల్లోకి స్వేచ్చగా, నిర్భీతిగా, హుందాగా తిరగ గలిగే రోజులు...అమెరికా సమ్యుక్త రాష్ట్రాలు...టెక్సాస్ రాష్ట్రం...డాలస్ పట్టణం...22 నవంబర్ 1963...జన సంద్రంలో నింపాదిగా సాగిపోతున్న అమెరికా అధ్యక్షుడి కప్పులేని కారు (topless car) పైకి ఒకాదాని వెంబడి ఒకటి తూటాల వర్షం... కళ్ళ ముందే చేతులు ఊపుతున్న నాయుకుడు మొదట కంఠం పట్టుకుని పక్కకు ఒరిగిపోవడం, ఒక్క క్షణం తరువాత సమకాలీన రాజకీయల్లో తల పండిన నాయుకుల్ని సైతం బోల్తా కొట్టించగల చాతుర్యానికి ఆలవాలమైన అతని తల తూటా ధాటికి చిద్రం కావడం లిప్త పాటులో జరిగిపోయాయి... భయం... ఆందోళన... కంగారు... బాధ... పెల్లుబిక్కిన ఆవేశం ఆక్రోశం... ఏమి జరిగిందో ఎందుకు జరిగిందో అసలు ఎలా జరిగిందో తెలియని తీవ్రమైన గందరగోళం... చరిత్ర పుటల్లో ముదురు ఎరుపు రంగులో మరొక బాధాకర అధ్యాయం...

జాన్ ఎఫ్ కెనెడీ హత్య నేటికీ విప్పబడని ఒక పీట ముడి, ఛేదింపబడని ఒక జటిల సమస్య, బదులు దొరకని ఒక శేష ప్రశ్న. ఎక్కడో ఎత్తైన భవనం ఆరవ అంతస్థులోని ఒక చిన్న కిటికీ గుండా దూరంగా సాగిపోతున్న వాహనం మీదకి, చెట్ల గుబురు మధ్యలో నుండి, ఒక వ్యక్తి కచ్చితంగా అధ్యక్షుడి తలపైకి తన తుపాకీ ఎలా గురిపెట్టగలిగాడన్నది, సామాన్యుల నుంచి విశేషఙ్ఞుల వరకు నేటికీ కొరుకునపడని విషయం. పురాణాల్లో ఎప్పుడో మత్స్య యంత్ర ఛేదన తర్వాత, అంతటి చాకచక్యం ప్రస్ఫుట మయ్యే ఆ పాటవం చరిత్ర చెబుతన్న ఆ ఒక్క లీ హార్వీ ఆస్వాల్డ్ సొత్తేనా, లేక ఆ హత్యలో అతని సహకరించిన నిశిత గురిగాళ్ళ (sharp shooters) చెలికాళ్ళు వేరు ఉన్నారా? పోలీసులు, అంతర్గత భద్రతా వ్యవస్థ (FBI), మిలిటరీ వెరసి మొత్తం రక్షణా వ్యవస్థ మొత్తంలో మెరికెల్లంటి గురిగాళ్ళని ఎంపిక చేసి, ఆ భవనంలోని కిటికీ వద్ద నిలబెట్టి ముందు సాగిపోతున్న వాహనం మీదకి హత్య జరిగిన సమయంలో పేలిన తూటాలన్నీ లెక్కబెట్టి ఒక్కొక్కటీ తిరిగి కాల్పించగా, వాహనంలోని డమ్మీ తల పేలిన సందర్భాలు - 0. ఇటువంటి నమ్మలేని సంఘటనలు, భక్తి విషయంలో జరిగితే మహిమలవుతాయి, హత్య విషయంలో జరిగితే అభూత కల్పనలవుతాయి.

ఆ విడివడని హత్యోదాంతానికి పర్యవసానం - నేటికీ ప్రతి యేడాదీ, డాలస్ పట్టణంలో నవంబర్ నెలలో ఔత్సాహికులు, నేర పరిశోధకులు - పదవీ విరమణ పొందిన వాళ్ళు, పోలీసు వ్యవస్థలోకి కొత్తగా అడుగెట్టబోతున్న ఉడుకు రక్తాలు - ఒక చోట కలిసి, ఉన్న సాక్ష్యలను తిరగతోడి, సేకరించిన ఆధారలను మరల కాచి వడబోసి, ఈ 50 యేళ్ళలో ఎవరూ చూడని, కనిపెట్టని కోణన్ని వెలికీ తీసే (వృధా) ప్రయత్నం జరుగుతూ ఉంటుంది... ఈ రావణ కాష్టం ఇలా రగులుతూనే ఉంటుంది...ఆ బేతాళ ప్రశ్నలు - ఎవరు, ఎందుకు, ఎలా - వెక్కిరిస్తూనే ఉంటాయి... ఈ 50 యేళ్ళలో ఎన్నో వ్యాసాలు, పరిశోధనలూ, పుస్తకాలు, అధ్యాయాలు వెలువడ్డాయి. ఒక్కో రచయితది ఒక్కో దృక్పధం. ఆస్వాల్డ్, గాడ్సే మాదిరి, ఒక ఉన్మాది అని, అతని గురి అనితర సాధ్యమనే వాదన నుండి, కెనెడీ హత్య ఒక కుట్ర అని, దానిలో మాఫియా, క్యూబా కాందిశీకులు, ప్రభుత్వ చీకటి సంస్థల (black operations) అందరికీ తలా పడికెడి పాత్ర ఉన్నయని, అందుకనే ఈ హత్య అసలు వివరాలు బయటికి పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డాయనే మరొక వాదం...కొత్త యేడాది...కొత్త పాత్రలు...కొత్త కధనాలు...కొత్త సిద్ఢాంతాలు...ఏ  వాదం నిజానికి దగ్గరో, ఏ ఊహ సత్యదూరమో తెలియని విచిత్రమైన పరిస్తితి... ఈ నేపధ్యంలో ఈ మింగుడుపడని చేదు నిజాన్ని తన అద్భుత ఊహాశక్తితో జోడించి, స్టీఫెన్ కింగ్ వెలువరించిన ఒక కాల్పనిక సత్యశోధన - 11.22.63.

జరిగిపోయిన ఘటనను నవలా నేపధ్యంలో అధ్యయనం చేసే పద్ఢతులు రెండు - 1. నవలా కాలాన్ని గతంలో ఖాయ పరచుకుని పాత్రలు చరిత్రతో చెలగాటమాడడం  2. 50 యేళ్ళ నాటి నేరాన్ని కొత్త కళ్ళతో చూసి గతించిపోయిన పాత్రలకు కాలాతీత శిక్ష వేయడం. ఈ రెండూ నలిగిన దారులు కాకుండా కింగ్ ఎన్నుకున్న కొత్త మార్గం - కాల(ంలో) గమనం (time travel). ఈ పద్ఢతిలో సమకాలీన పాత్రలు గతంలోకి వెళ్ళి వర్తమానంలో తెలిసిన వాస్తవాలని భూతకాలంలో వర్తింపచేసి కాలగతిని మార్చే ప్రయత్నం చేయడం. కాగా ఇటువంటి కాల గమన కథలన్నీ ఇప్పటి వరకు హెచ్చు సంక్యలో కాల్పనిక ప్రపంచంలో పాత్రలకే పరిమితమవగా, 11.22.63 ప్రపంచ చారిత్రిక గతిపై తీవ్రమైన ప్రభావం చూపిచిన ఓ దేశాధ్యక్షుడి హత్యోదాంతం చుట్టూ అల్లడం విశేషం. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా, ఎందుకంటే 1963 తరువాతి ప్రపంచ రాజకీయ పరిణామాలు అన్నీ సుపరిచితాలే, శిలాశాసనాలే - కల్పన పేరుతో వాటిని మార్చడం కుదరని పని. కెనెడీ అప్పటి కాలంలో అభ్యుదయ వాది. సోవియట్ రష్యాతో సంబంధాలు క్షీణదశలో ఉన్న దశకంలో, క్యూబా క్షిపణి సంక్షోబం (Cuban missile crisis) సమయంలో అలముకున్న యుద్ధ మేఘాలను తన సమయస్ఫూర్తితో చెదరగొట్టి, సామరస్యానికి పెద్ద పీట వీసిన గొప్ప రాజనీతిఙ్ఞుడు. అతని హత్య పిమ్మటే అమెరికా వియత్నాంతో మరొక సారి రష్యాతో తలపడడం, ఆస్తి, ప్రాణ, పరువు నష్టాల ఘోర పరభవం పొందడం గమనిస్తే, కెనెడీ బ్రతికి ఉంటే 70వ దశకంలో అమెరికా రాజకీయ చరిత్ర మరొక విధంగా ఉండేదన్న సత్యం నిర్వివాదాశమవుతుంది.

కాని కాల గమన కథల్లో ఒక అవ్యక్త వైరుద్ధ్యం (implicit paradox) ఉంది - భూత కాలాన్ని మారిస్తే వర్తమానికి అర్ధం పోతుంది అన్నది. అప్పుడు కథ (చరిత్ర) గతం నిర్ణయించిన (ప్రభావితం చేసిన) సరళ రేఖలో సాగకుండా, ఏ క్షణంలో గతం మార్చివేయబడినదో ఆ ఉత్తర క్షణంలో వర్తమాన బాట మధ్యలో చీలి, చరిత్ర మునుపు నడవని పధంలో దూసుకుని పోతుంది. కెనెడీ హత్యని నివారించ గలిగితే రెండు అగ్రరాజ్యల మధ్య పోటీ, పోరు లేక భువి భూతల స్వర్గమైపోతుందా? లేక కాల ప్రవాహానికి ఒక చోట అడ్డుకట్ట కడితే, దాని ప్రభవం ఊహించని చోట ఉప్పెనై విరుచుకు పడుతుందా? దీనికి కూడా చరిత్రే సాక్ష్యం. జింబాబ్వే దేశనికి స్వాతంత్ర్యం సముపార్జించడంలో కీలక పాత్ర పోషించిన రాబర్ట్ ముగాబే ఆ తరువాత దేశాధ్యక్షుడై, పదవీ లాలసుడై, నియంతగా మారి, ఆ దేశ సౌభాగ్యాన్నే కాలరాస్తున్న చేదు వాస్తవం చిరపరిచితం. కాల గమన రచనల్లో మరొక పెద్ద సవాలు - వాటి నిబంధనలు. కాల గమనం ఎంత కాల్పనికమైన, అది కూడ కొన్ని నిబంధనలని విధిగా అనుసరించవలసినదే. గతాన్ని చెరిపి వేసిన మనిషి యొక్క అస్తిత్వం వర్తమానంలో ఏమవుతుంది, గతాన్ని మార్చడం వల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాల ప్రకంపనల పర్యవసానాలు, ఏ గీత దాటితే ఇక గతచరిత్ర పూర్తిగా సమసిపోయి నూతన చరిత్రకి నాంది పలుకుతుందో, ఈ నిబంధనలు సాధారణంగా మొత్తమొదటే పొందు పరచబడతాయి. ఇక వాటిని ఎంత సమర్ధవంతంగా వాడుకుని కథని రక్తి కట్టిస్తాడన్నది రచయిత ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఒక విధంగా ఈ తరహా రచనలు, తన ఉచ్చు తనే వేసుకోవడం, తనే దాని బారి నుండి ఎంత తెలివిగా తప్పిచుకోవడం లాంటిది.

కింగ్ రచనల్లో సహజంగా కనపడే ఉత్కంఠా, నాటకీయత, పైపెచ్చు కాలంతో పోటీపడే ఈ సదర్భంలో, పతాక స్ఠాయిలో దర్శనమిస్తాయి. 60వ కాలం నాటి సామాజిక పరిస్థితులు - రంగు వివక్షత ఇంకా సమసిపోని ఆ రోజుల్లో - సామాన్య జనుల జీవన విధి విధానాలు, సంభాషణా వైచిత్రులు, వీటన్నిటిని సమగ్రంగా అధ్యనం చేసి, సమకాలీన irony నిండిన కళ్ళతో భూతకాలని భూతద్దంలో చూడడం, ఒక విధంగా భగవంతుడి పాత్ర పోషిచడం లాంటిదే - జరగబోయేది తెలిసిపోయి, జరుగుతున్న దానిని కావలసిన క్షణంలో మార్పు చేసే ప్రయత్నం చేయడం. చివరికి అనుకున్నది అవుతుందా, అనుకున్నది అయితే, అది అంతటితోనే ఆగుతుందా, గతం పునాదిగా మిగిలిపోయి వర్తమానం దాని మీద ఎదగాల్సిందేనా, లేక గతం తవ్వుకోవడం వర్తమానానికి వాంఛనీయమేనా... ఈ ఆసక్తి దాయకమైన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానం - 11.22.63.