శ్రీరామ నవమి

నరావతారం

ఒంటిని మరిగించే అగ్ని గోళాన్ని
పంటి కింద ఫలహారము చేయాలని
గగన తరువులో చదల పండును
తండ్రి ఊతముతో దరికి చేరాలని
ఉవ్వెతున ఎగసి పట్టుకోబోవు పాపానికి
దవడ వాయగొట్టించుకున్న ఫలితానికి
విచక్షణా దక్షుడాయె హనుమ
శిక్షతో శిక్షణందిన కనుమ

ముక్కు మూసుకుని పక్క నక్కిన మునులను
మూడు చెరువుల నీళ్ళు గుక్కతప్పక తాగించి
జన్నముల కోసము తెచ్చిపెట్టిన ద్రవ్యరాసులను
చెట్టుతొర్రలలో దాగుడు మూతలంటూ దాచిపెట్టి
అడ్డాల నాడు అబ్బిన పిల్ల కోతి చేతలతో
గడ్డాల వారిని ముప్పు తిప్పలు పెట్టించి
వారి శాపముతో ఉన్న విద్దెలన్ని మరచిన మారుతి
బలము కండది కాదు గుండెది అని నేర్చెను అప్పటి సంధి

కాల మహిమ వల్ల తను చేయని తప్పులకు
అన్న చేత చావు దెబ్బలు తిన్న చిన్న రాజుకు
న్యాయమైన నడతగ కొండంత అండగా నిలబడిన సమవర్తి
చెరలోని సతిని చేరలేని రాజ్యాన్ని తలచుకుని విలపించు మిత్రునికి
విఙ్ఞతతో వేళకు మాట సాయము విశ్వాసముతో అదనుకు మనిషి సాయముతో
అవసర సమయములో ఉచిత సలహాలతో అక్కర్కకు వచ్చిన ఆప్తహితుడు
కష్టములలో కూడా కలిసి నడచిన జీవిత భాగస్వామి
సుఖములలో కర్తవ్యము గుర్తు చేసిన మనస్సాక్షి

కోతిగా పుట్టి కోటి పుణ్యాల పెంపుగా ఎదిగి
నరునికి వానరునికి వారధిగా నిలచి
కోతి నుండి మనిషి పుట్టెనన్న పరిణామ సిద్ధాంతానికి
నిలువెత్తు రూపముగా నిల ఆంజనేయుడు
హరిహరాంచింతమైన ఆదికావ్యాన్ని
అగ్నిపునీతము చేసిపెట్టిన సూత్రధారుడు

యుగాది

నాక - నక్క

ఎప్పుడో ఎక్కడో ఎవరో ఎందుకో
మొదలిచ్చి వదిలిన మరబొమ్మ ఇది
చుక్కల చుట్టూ గోళాలూ గ్రహాలూ
గిరి తప్పక గిరగిరా తిరుగుతూ
తమ క్రమబద్ధమైన కదలికలో 
కొత్త కొత్త క్రీడలు సృజించుకుంటూ
సహజాతమైన సమయ పరిమాణముతో పాటు
వియన్మండలిన పరిధి పెంచుకుని పోతూ
అలుపెరగక అంతములో అడుగులు వేసుకుంటూ
తోటి ఆటకుల కూడి ఆడే ఒంటరి ఆట ఇది

ఇరుసు నుండి ఓ పక్కకొరిగిన ఒక్క కారణాన
కాలాల కల్పతరువులు వెలిసెనీ జగాన
ఋతువుకొక రంగు రుచి అనుభూతి
కాలానికొక వేళ వేష భూష
ప్రకృతితో మమేకమైన ప్రాణికోటి
పద్ధతులను కాలనుగుణముగా మార్చుకుంటూ
దివరాత్రాల చీకటివెలుగులలో
జీవన దిశానిర్దేశము చేసుకుంటూ
పరిధులు దాటి పైనెక్కడో జరిగే జగన్నాటకములో
తెలియని పాత్రను తలవంచుకుని పొషించుకునే వింత భూమికిది

అంతరిక్ష గవాక్షాలలో కంటపడని అద్భుతాలకీ
నేల మాళిగలో పూటా దర్శనమిచ్చే దైనిందినానికీ
పేర్లు పుట్టించి పండగలు పెట్టించే సంస్కృతి
అనాదిగా మనిషికి అందివస్తున్న వారసత్వపు ఆస్తి
కొత్త చిగురు వేసినా ఇంట నలుసు చేరినా
చెట్టు మోడు వారిన గుండె ఆట ఆపినా
ఆరంభానికో సంబరం వీడ్కోలులో గాంభీర్యం
తరతరాలుగా మనిషి నేర్చిన జీవన వేదం
అంతు అగుపడని ఈ చిరంతన చక్ర భ్రమణములో
వెళ్ళిపోయినది తిరిగి వస్తుందన్న విషయము వెల్లడి చేయునీ యుగాది

శివరాత్రి

శివ తత్వము


ముల్లోకములను ముంచేయు దివిజను
పిడికిలి మూయునంత సుళువుగా
మూడు ముళ్ళు వేసి వడిసిపట్టు వేళ
నచ్చిన నెచ్చిలిని దక్కించుకొన్న దక్షిణామూర్తి

తలకెక్కించుకున్న భక్తుని వరముతో
తలమీదికే తెచ్చుకున్న వైరము వల్ల
తప్పించుకొను తెలివి తలపునకు రాక
పరుగు మంత్రం పఠించుకున్న బేలమూర్తి

విశ్వమంతము చేయు విషమును
గుటక వేసినంత అవలీలగ
పట్టి పురిషెడు పుచ్చుకునే వేళ
పరమునే పట్టించుకునే పరేంగితఙ్ఞుడు

కోరినంతనే కడుపులో కొలువయి
వెలుపలకి వచ్చు విధముగానక
అంధకారమును బంధువు చేసుకునే
ప్రసవము మునుపు పరీస్థితితో పసి పశుపతి

వలచి వచ్చిన వనితను వలదని
కోరికను కలిగించిన మదనుని మరిగించి
మనువు ముహూర్తమున మరణ మృదంగము మ్రోగించిన
మరుభూమి మారాజు ఈ విలయ నటరాజు

మోహమాటాన మగనిపై మనసుపడి
వలపు బేరాన నలుసునొకని మొలిపించి
ప్రాకృతిక నియమములను పరిహసించే
లింగ భేదములను విస్మరించిన లింగమూర్తి

అర్ధమైతే మహిమలు అందకపోతే లీలలు
లెక్కించగలిగితే శివుని తత్వములో ఇవి వేవేలు 

సంక్రాంతి

సమిష్టి

మబ్బు దుప్పట్లు తీయ నిరసించిన బాల భానుడు
మంచు చీకట్లు తరుమ తత్సారము చేస్తుంటే
చల్ల అంబలి బొక్కి కొడవళ్ళు బట్టి శ్రామికులు
చద్ది మూటలు గట్టి చేల వైపు వెడుతుంటే
గింజ బరువుతో తలలు వాలిపోయిన వరికంకులు
భారమందుకోను ఆపన్నహస్తములకై చూస్తుంటే
జానపదాల ఊపుతో బారులు తీరిన భూపతులు
కత్తికో వేటుగా వరివైరుల తలలు తెగ్గోస్తుంటే
నారుమళ్ళ నుండి నూర్పిళ్ళ వరకు
చేతులన్ని కలిసిన మహా సందోహమిది

వేకువకు వంది వల్లించు తొలి కోడి
బుట్ట బయటికి రాక బుట్టబొమ్మలా కూర్చునుంటే
వెన్ను వణికించు చలిపులికి వెరయక
పారాణి పదాలు వాకిట వైపు అడుగులు వేస్తుంటే
కీచురాల రాగాలికి అందెల తాళాలతో
గాజుల గుంపులు గలగలల కచ్చేరి పెడుతుంటే
చిమ్ములాటల గిలిగింతతో కళ్ళాపి చల్లింతతో
ముంగిలికి ముగ్గులతో ముత్తైదవతనము తెచ్చిపెడుతుంటే
వీధి కున్న ప్రతి వాకిలికీ వెలుగులందీయ
చేతులన్ని కలిసిన మహా సమూహమిది

దీపావళివెలుగు వాకిటకి ఎక్కుపెట్టిన కనుబొమల విల్లంబులు
కాంతి రేకలు విరజిమ్ము పువ్వొత్తుల కంటి పాపలు
పువ్వొత్తులను నిలబెట్టు తీగలాగిన కంటి కొసలు
నవ్వుల మతాబాలు నొక్కిపెట్టిన  అరవిచ్చిన పెదవులు
ముద్దంత ఒక్కచోట చేర్చిన చిచ్చు బుడ్డుల చుబుకాలు
చక్రాలు గింగిరాలు తిరగ చారడేసి చెక్కిళ్ళు
పాంబిళ్ళలు జరజర ప్రాకిపోవు మెలికెల జడపాయలు
అంతవరకు తలొంచుని అంతలోనే ఎగసిపడే తారాజువ్వల తలంపులు
మిరుమిట్ల కాంతులకు మందుగుండుతో పనిలేదు
చిరునవ్వు పులుముకున్న ప్రియ వదనమే చాలు

కంటి నలుపుల కార్చీకట్లను తరుమ
రెప్ప వెంట్రుకల పత్తి వత్తులు చుట్టి
కంటి చెమ్మల చమురున వాటినిన్ తడిపి
చూపు కాంతితో వెలిగించు కంటి ప్రమిదలు
చిమ్మ చీకటిని కరింగించు చిన్న దీప కళికలు

నిస్సత్తువ ఆవురించిన నిశీధి వీధులలో
కాలి అందియల గలగలు
పట్టుబట్టల బిరబిరలు
పలుకు తేనియల మధురిమలు
నిశ్శబ్దమను పారద్రోలు ప్రియ వచన గీతికలు

శబ్దకాంతుల కేళే దీపావళైతే
మాటకు మించిన టపాసు లేదు
చూపుకు తగిన ప్రమిద కానరాదు

నవరాత్రి

అతీతము

ధర్మము సృష్టిని కొనసాగించే కీలు
ఇందులో తప్పొప్పులకు మంచిచెడులకు
పక్షపాతాలకు విచక్షణలకు తావు లేదు
త్రాసు ఒక వైపు బరువుతో ఒరిగినపుడు
రెండవ ప్రక్క చేరు సమతౌల్యమే ధర్మము
పోటెత్తినట్టు అల వచ్చి తీరమును తరిమితే
ఆటల్లె పగ్గము వేసి వెనకలాగుటే విద్యుక్తము
మంచి ప్రబలి విస్తరణతో సంతులన విషమమైతే
చెడుగా పేట్రేగిపోయి లెక్క సరిచేయుటే దాని లక్ష్యము
అటు ఆటు దైవతము కాదు
ఇటు పోటు దానవత్వము కాదు
లక్షణములకు చెందనిదే ధర్మము

గుణములకు సంకోచవ్యాకోచములు సహజము
ఆత్మ నియంత్రణలు తమ పరిధికందని విషయము
మంచి తగుమాత్రముగనే చెడు తగినంత మేరకే
గిరి గీసుకుని మసలే నిబద్దత వాటికి లేవు
ఉన్నంతలో ఇవి ఒకదానితో ఒకటి కలబడి తలపడి
అస్థిత్వము కోసమోనో ఆధిపత్యము పేరుతోనో
సమతుల్యము సిద్ధించు పనిలో సదా వ్యస్తులవుటే వీటి సాధన
మంచి వైపు ఓ పక్క కొండంత అండగ నిలబడు శక్తే
చెడు చేతినీ మరో వంక బలోపేతము చేసినిది
సృష్టికి పరమార్ధము దృష్టే
జరుగు క్రమములో తన పాత్ర నామమాత్రమే
గుణములనే చక్షువులతో శక్తి ఒక సాక్షిభూతమే

వినాయక చవితి


ఓం ప్రధమం

ఆరంభమునకు అధిపతిగా హేరంబుడెందుకు? ఆటంకములను అరికట్ట కరివదనుడెందుకు? కంటకములను పోకార్చ ఏకదంతుడెందుకు? కామితములను ఈడేర్చ ఈశుసుతుడెందుకు? కోరితే కరిగిపోయి కాన్కలందిచే వేడితే వుప్పొంగి వరములందించే మాటలకు పడిపోయె గాలిదేవులెందరున్నా పనికి మాత్రము ఈ పొట్టివానిని మడమ తిప్పని ఈ గట్టివానిని కలిసి ఎన్నుకున్న కారణము ఎందుకన్న తల తెంచబడిన వాడు కాని తల వంచబడిన వాడు కాడు తెలుసుకోను నిలిచిపోయిన వాడు కాని తెలియలేదని వదిలిపోయిన వాడు కాడు అవకరమును అధిగమించిన వాడు కాని ఆకారమును నిందించుకున్న వాడు కాడు పనికి ప్రాధమికమైన పట్టుదలను వెతల ఎదురీతలో వీడిపోవనివాడు గెలుపుకు ప్రధమమైన సంకల్పమును సమస్యల సుడిగుండములలో సడలనీయనివాడు కర్మ అంటే రాత కాదు చేత క్రియ అంటే సిద్ధి కాదు బుద్ధి కర్త అంటే చేతులు కాదు చేతలు ఇవి నిరూపించినందుకే గణపతి కార్య నిర్వహణకు అయ్యెను అధిపతి