సరిగ్గా 50 సంవత్సరాల క్రితం....1963...నాయకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భద్రతా సిబ్బంది ఇనప కవచాల వెనక నక్కి నడవని రోజులు....ప్రజా సమూహాల్లోకి స్వేచ్చగా, నిర్భీతిగా, హుందాగా తిరగ గలిగే రోజులు...అమెరికా సమ్యుక్త రాష్ట్రాలు...టెక్సాస్ రాష్ట్రం...డాలస్ పట్టణం...22 నవంబర్ 1963...జన సంద్రంలో నింపాదిగా సాగిపోతున్న అమెరికా అధ్యక్షుడి కప్పులేని కారు (topless car) పైకి ఒకాదాని వెంబడి ఒకటి తూటాల వర్షం... కళ్ళ ముందే చేతులు ఊపుతున్న నాయుకుడు మొదట కంఠం పట్టుకుని పక్కకు ఒరిగిపోవడం, ఒక్క క్షణం తరువాత సమకాలీన రాజకీయల్లో తల పండిన నాయుకుల్ని సైతం బోల్తా కొట్టించగల చాతుర్యానికి ఆలవాలమైన అతని తల తూటా ధాటికి చిద్రం కావడం లిప్త పాటులో జరిగిపోయాయి... భయం... ఆందోళన... కంగారు... బాధ... పెల్లుబిక్కిన ఆవేశం ఆక్రోశం... ఏమి జరిగిందో ఎందుకు జరిగిందో అసలు ఎలా జరిగిందో తెలియని తీవ్రమైన గందరగోళం... చరిత్ర పుటల్లో ముదురు ఎరుపు రంగులో మరొక బాధాకర అధ్యాయం...
జాన్ ఎఫ్ కెనెడీ హత్య నేటికీ విప్పబడని ఒక పీట ముడి, ఛేదింపబడని ఒక జటిల సమస్య, బదులు దొరకని ఒక శేష ప్రశ్న. ఎక్కడో ఎత్తైన భవనం ఆరవ అంతస్థులోని ఒక చిన్న కిటికీ గుండా దూరంగా సాగిపోతున్న వాహనం మీదకి, చెట్ల గుబురు మధ్యలో నుండి, ఒక వ్యక్తి కచ్చితంగా అధ్యక్షుడి తలపైకి తన తుపాకీ ఎలా గురిపెట్టగలిగాడన్నది, సామాన్యుల నుంచి విశేషఙ్ఞుల వరకు నేటికీ కొరుకునపడని విషయం. పురాణాల్లో ఎప్పుడో మత్స్య యంత్ర ఛేదన తర్వాత, అంతటి చాకచక్యం ప్రస్ఫుట మయ్యే ఆ పాటవం చరిత్ర చెబుతన్న ఆ ఒక్క లీ హార్వీ ఆస్వాల్డ్ సొత్తేనా, లేక ఆ హత్యలో అతని సహకరించిన నిశిత గురిగాళ్ళ (sharp shooters) చెలికాళ్ళు వేరు ఉన్నారా? పోలీసులు, అంతర్గత భద్రతా వ్యవస్థ (FBI), మిలిటరీ వెరసి మొత్తం రక్షణా వ్యవస్థ మొత్తంలో మెరికెల్లంటి గురిగాళ్ళని ఎంపిక చేసి, ఆ భవనంలోని కిటికీ వద్ద నిలబెట్టి ముందు సాగిపోతున్న వాహనం మీదకి హత్య జరిగిన సమయంలో పేలిన తూటాలన్నీ లెక్కబెట్టి ఒక్కొక్కటీ తిరిగి కాల్పించగా, వాహనంలోని డమ్మీ తల పేలిన సందర్భాలు - 0. ఇటువంటి నమ్మలేని సంఘటనలు, భక్తి విషయంలో జరిగితే మహిమలవుతాయి, హత్య విషయంలో జరిగితే అభూత కల్పనలవుతాయి.
ఆ విడివడని హత్యోదాంతానికి పర్యవసానం - నేటికీ ప్రతి యేడాదీ, డాలస్ పట్టణంలో నవంబర్ నెలలో ఔత్సాహికులు, నేర పరిశోధకులు - పదవీ విరమణ పొందిన వాళ్ళు, పోలీసు వ్యవస్థలోకి కొత్తగా అడుగెట్టబోతున్న ఉడుకు రక్తాలు - ఒక చోట కలిసి, ఉన్న సాక్ష్యలను తిరగతోడి, సేకరించిన ఆధారలను మరల కాచి వడబోసి, ఈ 50 యేళ్ళలో ఎవరూ చూడని, కనిపెట్టని కోణన్ని వెలికీ తీసే (వృధా) ప్రయత్నం జరుగుతూ ఉంటుంది... ఈ రావణ కాష్టం ఇలా రగులుతూనే ఉంటుంది...ఆ బేతాళ ప్రశ్నలు - ఎవరు, ఎందుకు, ఎలా - వెక్కిరిస్తూనే ఉంటాయి... ఈ 50 యేళ్ళలో ఎన్నో వ్యాసాలు, పరిశోధనలూ, పుస్తకాలు, అధ్యాయాలు వెలువడ్డాయి. ఒక్కో రచయితది ఒక్కో దృక్పధం. ఆస్వాల్డ్, గాడ్సే మాదిరి, ఒక ఉన్మాది అని, అతని గురి అనితర సాధ్యమనే వాదన నుండి, కెనెడీ హత్య ఒక కుట్ర అని, దానిలో మాఫియా, క్యూబా కాందిశీకులు, ప్రభుత్వ చీకటి సంస్థల (black operations) అందరికీ తలా పడికెడి పాత్ర ఉన్నయని, అందుకనే ఈ హత్య అసలు వివరాలు బయటికి పొక్కనివ్వకుండా జాగ్రత్త పడ్డాయనే మరొక వాదం...కొత్త యేడాది...కొత్త పాత్రలు...కొత్త కధనాలు...కొత్త సిద్ఢాంతాలు...ఏ వాదం నిజానికి దగ్గరో, ఏ ఊహ సత్యదూరమో తెలియని విచిత్రమైన పరిస్తితి... ఈ నేపధ్యంలో ఈ మింగుడుపడని చేదు నిజాన్ని తన అద్భుత ఊహాశక్తితో జోడించి, స్టీఫెన్ కింగ్ వెలువరించిన ఒక కాల్పనిక సత్యశోధన - 11.22.63.
జరిగిపోయిన ఘటనను నవలా నేపధ్యంలో అధ్యయనం చేసే పద్ఢతులు రెండు - 1. నవలా కాలాన్ని గతంలో ఖాయ పరచుకుని పాత్రలు చరిత్రతో చెలగాటమాడడం 2. 50 యేళ్ళ నాటి నేరాన్ని కొత్త కళ్ళతో చూసి గతించిపోయిన పాత్రలకు కాలాతీత శిక్ష వేయడం. ఈ రెండూ నలిగిన దారులు కాకుండా కింగ్ ఎన్నుకున్న కొత్త మార్గం - కాల(ంలో) గమనం (time travel). ఈ పద్ఢతిలో సమకాలీన పాత్రలు గతంలోకి వెళ్ళి వర్తమానంలో తెలిసిన వాస్తవాలని భూతకాలంలో వర్తింపచేసి కాలగతిని మార్చే ప్రయత్నం చేయడం. కాగా ఇటువంటి కాల గమన కథలన్నీ ఇప్పటి వరకు హెచ్చు సంక్యలో కాల్పనిక ప్రపంచంలో పాత్రలకే పరిమితమవగా, 11.22.63 ప్రపంచ చారిత్రిక గతిపై తీవ్రమైన ప్రభావం చూపిచిన ఓ దేశాధ్యక్షుడి హత్యోదాంతం చుట్టూ అల్లడం విశేషం. ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం కూడా, ఎందుకంటే 1963 తరువాతి ప్రపంచ రాజకీయ పరిణామాలు అన్నీ సుపరిచితాలే, శిలాశాసనాలే - కల్పన పేరుతో వాటిని మార్చడం కుదరని పని. కెనెడీ అప్పటి కాలంలో అభ్యుదయ వాది. సోవియట్ రష్యాతో సంబంధాలు క్షీణదశలో ఉన్న దశకంలో, క్యూబా క్షిపణి సంక్షోబం (Cuban missile crisis) సమయంలో అలముకున్న యుద్ధ మేఘాలను తన సమయస్ఫూర్తితో చెదరగొట్టి, సామరస్యానికి పెద్ద పీట వీసిన గొప్ప రాజనీతిఙ్ఞుడు. అతని హత్య పిమ్మటే అమెరికా వియత్నాంతో మరొక సారి రష్యాతో తలపడడం, ఆస్తి, ప్రాణ, పరువు నష్టాల ఘోర పరభవం పొందడం గమనిస్తే, కెనెడీ బ్రతికి ఉంటే 70వ దశకంలో అమెరికా రాజకీయ చరిత్ర మరొక విధంగా ఉండేదన్న సత్యం నిర్వివాదాశమవుతుంది.
కాని కాల గమన కథల్లో ఒక అవ్యక్త వైరుద్ధ్యం (implicit paradox) ఉంది - భూత కాలాన్ని మారిస్తే వర్తమానికి అర్ధం పోతుంది అన్నది. అప్పుడు కథ (చరిత్ర) గతం నిర్ణయించిన (ప్రభావితం చేసిన) సరళ రేఖలో సాగకుండా, ఏ క్షణంలో గతం మార్చివేయబడినదో ఆ ఉత్తర క్షణంలో వర్తమాన బాట మధ్యలో చీలి, చరిత్ర మునుపు నడవని పధంలో దూసుకుని పోతుంది. కెనెడీ హత్యని నివారించ గలిగితే రెండు అగ్రరాజ్యల మధ్య పోటీ, పోరు లేక భువి భూతల స్వర్గమైపోతుందా? లేక కాల ప్రవాహానికి ఒక చోట అడ్డుకట్ట కడితే, దాని ప్రభవం ఊహించని చోట ఉప్పెనై విరుచుకు పడుతుందా? దీనికి కూడా చరిత్రే సాక్ష్యం. జింబాబ్వే దేశనికి స్వాతంత్ర్యం సముపార్జించడంలో కీలక పాత్ర పోషించిన రాబర్ట్ ముగాబే ఆ తరువాత దేశాధ్యక్షుడై, పదవీ లాలసుడై, నియంతగా మారి, ఆ దేశ సౌభాగ్యాన్నే కాలరాస్తున్న చేదు వాస్తవం చిరపరిచితం. కాల గమన రచనల్లో మరొక పెద్ద సవాలు - వాటి నిబంధనలు. కాల గమనం ఎంత కాల్పనికమైన, అది కూడ కొన్ని నిబంధనలని విధిగా అనుసరించవలసినదే. గతాన్ని చెరిపి వేసిన మనిషి యొక్క అస్తిత్వం వర్తమానంలో ఏమవుతుంది, గతాన్ని మార్చడం వల్ల భవిష్యత్తులో జరిగే పరిణామాల ప్రకంపనల పర్యవసానాలు, ఏ గీత దాటితే ఇక గతచరిత్ర పూర్తిగా సమసిపోయి నూతన చరిత్రకి నాంది పలుకుతుందో, ఈ నిబంధనలు సాధారణంగా మొత్తమొదటే పొందు పరచబడతాయి. ఇక వాటిని ఎంత సమర్ధవంతంగా వాడుకుని కథని రక్తి కట్టిస్తాడన్నది రచయిత ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. ఒక విధంగా ఈ తరహా రచనలు, తన ఉచ్చు తనే వేసుకోవడం, తనే దాని బారి నుండి ఎంత తెలివిగా తప్పిచుకోవడం లాంటిది.
కింగ్ రచనల్లో సహజంగా కనపడే ఉత్కంఠా, నాటకీయత, పైపెచ్చు కాలంతో పోటీపడే ఈ సదర్భంలో, పతాక స్ఠాయిలో దర్శనమిస్తాయి. 60వ కాలం నాటి సామాజిక పరిస్థితులు - రంగు వివక్షత ఇంకా సమసిపోని ఆ రోజుల్లో - సామాన్య జనుల జీవన విధి విధానాలు, సంభాషణా వైచిత్రులు, వీటన్నిటిని సమగ్రంగా అధ్యనం చేసి, సమకాలీన irony నిండిన కళ్ళతో భూతకాలని భూతద్దంలో చూడడం, ఒక విధంగా భగవంతుడి పాత్ర పోషిచడం లాంటిదే - జరగబోయేది తెలిసిపోయి, జరుగుతున్న దానిని కావలసిన క్షణంలో మార్పు చేసే ప్రయత్నం చేయడం. చివరికి అనుకున్నది అవుతుందా, అనుకున్నది అయితే, అది అంతటితోనే ఆగుతుందా, గతం పునాదిగా మిగిలిపోయి వర్తమానం దాని మీద ఎదగాల్సిందేనా, లేక గతం తవ్వుకోవడం వర్తమానానికి వాంఛనీయమేనా... ఈ ఆసక్తి దాయకమైన ప్రశ్నలకు సంతృప్తికర సమాధానం - 11.22.63.
No comments:
Post a Comment