పుస్తక సమీక్ష : The Making of the Atomic Bomb




 రాతి గుహపు మనిషి నాటి నుండి, అతని పరిణామ దశలో, ఉన్న స్థానం నుండి అంచెలంచలుగా కాకుండా ఎన్నో అంగలు ఒక్క ఉదుటునే వేసిన సందర్భాలు వేళ్ళ మీద పెట్టవచ్చు. అలా జరిగిన ప్రతీసారీ లోకం ఒక్కసారిగా ఉలిక్కిపడి జరుగుతున్న/జరుగుబోతున్న మార్పుని చివరి నిముషం వరకు ఆపడానికి ప్రయత్నించి విఫలమై, ఇక గతిలేక ఆ మార్పుని అలవాటు చేసుకోని చివరికి దానితో సహజీవనం చేయడం రివాజైపోయింది. రెండు రాళ్ళ రాపిడి నుండి నిప్పు పుట్టించడం, డైనమైట్ యొక్క సృష్టి, ఇక చివరగా అణుబాంబు - మనిషి చరిత్రలో కాస్త సాత్వికమైన, కానీ అంతే ముఖ్యమైన చక్రం, అచ్చు యంత్రాలను పక్కన పెడితే, ఈ మూడు సృజనలూ నిప్పుకి సంబంధించినవే, వినాశనానికి దోహద పడేవే, మనిషి యొక్క గతిని సమూలనంగా మార్చేసినవే. నిప్పును కనుక్కున్న మొదటి మనిషిని అప్పటి గుంపు కొంత ఆసక్తితోనూ, అంతే భయంతోనూ చూసి ఉంటుంది. ఆ నిప్పుతో అతను చీకటిని తద్వారా భయాన్ని జయించడం, తిండిని రుచికరంగా ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుకోవడమే కాకుండా, నిప్పుతో శత్రువులను - హాని తలపట్టే మృగాలు, తోటి మానవ సమూహాలు - మట్టుపెట్టవచ్చు అని ఎప్పుడు తెలుసుకున్నాడో, మానవ రక్షణ వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన భయంకరమైన తొలి ఆయుధం అతని తోడయ్యింది. ఇక అక్కడి నించి నిప్పుతో జరిపిన రకరకాల ప్రయోగాలలో ముందు ఆవిరి శక్తిని, తరువాత మందుగుండును, ముఖ్యంగా మానవ నాగరికత చరితలో అత్యంత కీలకమైన డైనమైట్ వెలువడ్డాయి. అప్పటి వరకూ రక్షణ రంగంలో కానీ, కుటుంబ సంరక్షణ రంగంలో కానీ, పరిమితులతో కూడిన పనిముట్టుగానే ఉన్న నిప్పు డైనమైట్ ఆవిర్భావంతో విధ్వంస రచనలో ఒక కీలక అస్త్రంగా రూపుదిద్దుకుంది. తుపాకీతో, మందుగుండుతో మితంగానే మట్టుబెట్టగల నిప్పు డైనమైట్ తో పదుల వందల సంఖ్యలో ప్రాణలను పొట్టనబెట్టుకునే వరకూ ఎదిగింది. అదే నిప్పు చురకను పరమాణువుల స్థాయికి దింపగలిగితే... ఆ శక్తిని ఆవిష్కరించే క్రమంలో మనిషి నడిచిన తప్పటడుగుల తడబాటు అడుగుల బాటే The Making of the Atomic Bomb


శాస్త్రం:


ఊహ తెలిసిన నాటి నుండి గగనానికి దృష్టి సారించి, దాని విస్త్రుతికి అబ్బురపడి, వియన్మండలి యొక్క మర్మాలను ఛేదించాలనుకున్న మనిషికి, అంతరంగాన్ని తరచి చూసుకుని అంతే విభ్రమ కొలిపే విషయాలు సూక్ష్మ స్థాయిలో కూడా నిగూఢంగా ఉన్నాయి అని తెలుసుకోవడానికి శతాబ్దాలు పట్టింది. 19వ శతాబ్దం వస్తే కాని విశ్వం మొత్తం అణువు ఆధరితం అన్న ప్రాధమిక సూత్రం గుర్తించలేకపోయాడు మనిషి, అక్కడి నుండి రకరకాల వ్యక్తులు రకరకాల ప్రతిపాదనల ద్వారా అణువు ఒక గోళం రూపంలో వస్తు సాంద్రతని నిర్ధారిస్తుంది అన్న సూత్రం వ్యాప్తిలోకి వచ్చింది. 19వ శతాబ్దం చివర్లో అణు పితామహుడు అని చెప్పదగ రూథర్ ఫోర్డ్ రంగప్రవేశం జరుగుతుంది. న్యూజీలండ్ దేశం నుండి ఇంగ్లండ్ దేశానికి వలస వచ్చి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో భౌతిక శాస్త్ర ప్రయోగశాలలో, తన శిష్య గణంతో చేసిన చర్చలు, వాదోపవాదాలు, పరీక్షలు, ప్రయోగాలు, శోధనల కారణంగా గోళాకరంలో ఉన్న అణువే మౌలికమైన కణం కాదనీ, దాని లోపల, మధ్యన పరమాణువు అన్నది మరొకటి ఉన్నదని కనుకున్న కణ విఙ్ఞాన ఖని రూథర్ ఫోర్డ్. ఆ సమయంలో యూరప్ ఖండం సకల శాస్త్రాలకూ, కళలకూ కాణాచిగా వర్ధిల్లేది. ఒక దేశంలో ప్రతిపాదనలు మరోక దేశంలో శాస్త్రఙ్ఞులకు వివిధ శాస్త్ర ముద్రణల ద్వారా తెలియడం, వారు వెంటనే తెలిసిన విషయాన్ని తమ ప్రయోగాల ద్వరా నిరూపించడమో, ఆక్షేపించడమో చేయడం, ఇంతలో ప్రయోగాలకు మూలమైన ప్రతిపాదనల ఆధారంతో మరోక దేశంలో మరొక శాస్త్రఙ్ఞుల గుంపు తమ ప్రయోగశాలలో మరో కొత్త విషయాన్ని కనుక్కోవడం, పంచుకోవడం... ఈ విధంగా మొత్తం యూరోప్ ఖండం శాస్త్ర విఙ్ఞానానికి తేనెతుట్టెలా విలసిల్లింది. వచ్చే మకరందం ఎక్కడిదైనా మాధుర్యం మాత్రం ప్రపంచానికి పంచబడినది. రూదర్ఫోర్డ్ అనేకానేక శిష్య బృందంలో, మన కధకు మూల పురుషుడు అయిన డెన్మార్క్ దేశానికి చెందిన నీల్స్ బోర్ 20వ శతాబ్దపు తొలి దశకాల్లో ప్రత్యక్షమవుతాడు. దృగ్గోచరమైన భౌతిక శాస్త్రానికి మూల పురుషుడు ఐసాక్ న్యూటన్ అనుకుంటే అగోచరమైన అణు శాస్త్రానికి ఆది గురువు నీల్స్ బోర్. ఏ విధంగా విశ్వంలో గురుత్వాకర్షణ శక్తి అన్నీ మూలలకూ ప్రబలి సకలు వస్తు సమితిని కట్టడిలో ఉంచుతుంది అని న్యూటన్ గణీత శాస్త్రాధరితంగా నిరూపించాడో, అదే విధంగా అణు ప్రపంచంలో వివిధ పరమాణు కణాలు ఒక శక్తి బద్ధంగా అణు కేంద్రం చుట్టూ కక్ష్యల్లో తిరగడమో, లేదా ఆ కేంద్రంలో స్థబ్దంగా ఉండడమో జరుగుతుందని, ఏ కారణం చేత అయినా పరమాణువు కణం (మరొక పరమాణు కణంతో ఢీ కొని) అణువు నుండి విడివడాల్సి వస్తే, ఆ విడుదల ఒక శక్తిని బహిర్గతం చేస్తుందని, అణు బాంబుకు అంకురార్పణ జరిపే తారక మంత్రాన్ని కనుక్కున్నాడు, నిరూపించాడు.


యుద్ధం:


రసాయన శాస్త్రంలో ఉత్ప్రేరకం యొక్క ఉపయోగం, జరగాల్సిన పనిని త్వరితగతం చేయడమే. ఉత్ప్రేరకం తనంతట తానుగా ఏమీ చేయలేదు, కానీ రెండు పదార్ధాల సంయోజన సమయంలో ఉత్ప్రేరకం జతకూడితే, జరిగే రసాయనిక ప్రతిక్రియ వేగం రెండింతలు మూడింతలు వేగవంతం అవుతుంది. మనిషి సాంకేతిక విప్లవాత్మక దశల్లో, యుద్ధం ఎప్పుడూ ఒక ఉత్ప్రేరకంలా వ్యవహరించింది. అభివృద్ధి కంటే భయం తనని ఎన్నో రెట్లు వేగంగా  గమ్యం వైపు పరుగులు పెట్టేలా చేసింది. ఆంగ్లంలో దీనినే Irony అంటారు. ఏ యూదులను సమూలంగా మట్టుపెట్టాలని హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధంలో తలపోసాడో, యూరోప్ లోని ఆ యూదు శాస్త్రవేత్తలే యాధృచికంగా సమిష్టియై అణుబాంబు తయారీలో కీలక పాత్రలు పోషించి అదే ప్రపంచ యుద్ధ పరిసమాప్తికి కారణభూతులయ్యారు. అణు విచ్ఛతి ద్వారా శక్తి వెలువడుతుందని కనుక్కున్న దగ్గర నుండి జనావాసం మీద మొదటి/చివరి అణ్వాస్త్ర ప్రయోగం జరిగినప్పటి మధ్య కాలం కేవలం రెండు దశాబ్దాలు. 1930వ కాలం మధ్య యూరప్ లో శాస్త్ర విఙ్ఞానం ఎంత వేగంతో అభివృద్ధి చెందిందో, ఒక అనామక పార్టీ నేత నుండి జర్మన్ నియంతగా హిట్లర్ ఎదుగుదల కూడా అంతే వేగంతో జరిగింది. ఈ కాలంలో అణు శక్తే తమ జాతికి ముక్తి అని భావించి అణు బాంబు ఆలోచనను మొట్టమొదటి సారి ప్రతిపాదించినది హంగరీ యూదు శాస్త్రవేత్త లియో సీలార్డ్. అనుకున్నదే తడవుగా వివిధ దేశాలలోని - ఇంగ్లండ్, ఆస్ట్రియా, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే మరియూ అమెరికా - తోటి శాస్త్రవేత్తలను కూడగట్టి, అమెరికన్ ప్రభుత్వానికి విఙ్ఞాపనలు అందచేశాడు. ఈ సమయంలో హిట్లర్ తూర్పు దిశగా ఉన్న ఒక్కో దేశాన్ని ఆక్రమిస్తూ, ఆయా దేశాల్లో ఉన్న యూదులను తమ సమాజాల నుండి వెలివేస్తూ, ముఖ్యంగా ప్రభుత్వ, రక్షణ, విద్య, పరిశోధన రంగాలలోని వారిని తమ పదవుల నుండి తప్పించడమే కాక బంధించే ప్రయాత్నాలు చేస్తూ ఉండడంతో, పేరెన్నిక కల - ఐన్ స్టీన్, ఫెర్మి (ఇటలీ), ఓట్టో హాన్,రబీ, టెల్లర్ మొ|| - వారందరూ ప్రాణాలరిచేత పెట్టుకుని మొదట ఇంగ్లండుకూ తరువాత అమెరికా వైపూ పలాయన మంత్రం చదివారు. జర్మన్ దేశంలో ఉండిపోయిన శ్వేత జాతి శాస్త్రవేత్తలు - హైసెన్ బర్గ్ వంటి వారు - హిట్లర్ నాజీ సిద్ధాంతాన్ని ఆమోదించకపోయినా, శాస్త్రానికి రాజకీయంతో పని లేదనుకుని జర్మనీలోనే ఉండి అణు సందంధిత కార్యకలాపాల మీద తమ దృష్టి పెట్టారు. ఆ విధంగా రెండో ప్రంపంచ యుద్ధ మేఘాలు యూరోప్, ఆసియాలో పూర్తి స్థాయిలో అలముకునే నాటికి, ఏ గూటి పక్షులు ఆ గూటిలో స్థిరంగా చేరి యుద్ధం ఆపాలంటే అణ్వాయుధం ఒకటే దారి అని నిశ్చయించుకుని, తమకు తెలిసిన అణు శాస్త్రం ద్వారా తొలి అణు అస్త్రం తయారు చేయడంలో తలమునకలయినాయి. శాస్త్రం అస్త్రం వైపు, విచ్ఛిన్నం విధ్వంశం వైపు పడిన తొలి అడుగులు అవే.


అస్త్రం:


ఆయుధంగా అణువును మలచవచ్చు అని తెలుసుకొన్నాక, ఆ పనిని తలపెట్టగల తలకెత్తుకోగల సామర్ధ్యం కలిగిన ఏకైక దేశం, అప్పటి కాలంలో, అమెరికా ఒక్కటే. విచిత్రమైన విషయం, ఈ నిర్ణయం తీసుకునే నాటికి ఆ దేశం అసలు ప్రపంచ యుద్ధంలోనే పాల్గొనక పోవడం. ఒక వైపు యురోప్లో జర్మనీ, మరొక వైపు ప్రాచ్య ఆసియాలో జపాన్ దుందుండుకుతనంతో రణభేరులు మోగించుకుంటూ యుద్ధోన్మాదంతో ముందుకు నడిచినాయే తప్ప, 1939వ సంవత్సరంలో హిట్లర్ పోలండ్లోకి దూసుకువెళ్ళే నాటికి కూడా అమెరికా తో పాటు తత్తిమా ప్రపంచ దేశాలు ఇంకా శాంతి మంత్రం పఠిస్తూనే కూర్చున్నాయి. యుద్ధం మొదలయ్యా కూడా అమెరికా మిత్ర దేశాలకి మాట సాయం, వస్తు చేయూత మాత్రమే అందిస్తూ గట్టు మీదే ఉండిపోయింది. ఒక విధంగా ఇది అణుబాంబు పరిశోధన పాలిట వరమయ్యింది. తఠస్ఠ వైఖరి ముసుగులో అమెరికన్ రక్షణ వ్యవస్థ, అమెరికన్ పారిశ్రామిక వ్యవస్థ, వలస వచ్చిన శాస్త్రవేత్తల సమూహం, న్యు మెక్సీకో రాష్త్రంలో లోస్ ఆలమోస్ ప్రాంతంలో అణు బాంబు పధకానికి శ్రీకారం చుట్టింది. ముందు కావాల్సినది ముడి సరుకు - రేడియోధార్మిక ఉరేనియం. ప్రకృతిలో ధాతువులు ఎన్ని ఉన్నా ఉరేనియంకి ఉన్న రేడియోధార్మికత మరో ధాతువులో అంత కనపడకపోవడం, ఉరేనియంని విచ్చిన్నం చేస్తే వచ్చే శక్తి తగినంత ఉండడంతో, అరుదుగా లభ్యమయ్యే దీని కోసం ప్రపంచం మొత్తం జల్లెడ పట్టి, ఆఫ్రిక ఖండంలో బెల్గియం దేశాధీనం లో ఉన్న కాంగో దేశం గనుల నుండి అత్యంత గోప్యంగా టన్నుల కొద్దీ ఉరేనియం తరలించడం, తెచ్చిన ముడి సరుకుని దేశంలో మూడు చోట్ల ఎంతో వ్యస ప్రయాసలతో, డబ్బు, మేధ, శ్రామిక పెట్టుబళ్ళతో ఏర్పాటు చేయబడిన ప్రాంతాలలో - టెన్నెసీ రాష్ట్రంలో (ఓక్ రిడ్జ్ ప్రాంతంలో), వాషింగ్టన్ రాష్ట్రంలో - శుద్ధిశాలలో ముడి ఉరేనియం నుండి రేదియోధార్మిక స్థాయికి తెచ్చి, జాగ్రత్తగా ఆ తుది సరుకును లోస్ ఆలమోస్ కి తరలించి శాస్త్రవేత్తల చేతిలో పెట్టడం అనేది, చెప్పుకోవడానికి మూడు ముక్కలలో, రాయాడానికి నాలుగు పంక్తులలో అయినా, అది రెండేళ్ళ కఠిన కఠోర దీక్ష. ఒక వైపు సైన్స్ కట్టే తలబొప్పికట్లు, ఇంకొక వైపు నిర్వాహణా తలనొప్పులు, అలకలూ, అభిప్రాయ/సైద్ధాంతిక/తాత్విక భేదాలు, ఒక అడుగు ముందు వెళ్ళిన ప్రతిసారీ అది తప్పు దారి అని తెలుసుకుని మూడు అడుగుల వెనకబాటు - ఈ సమన్వయం అంతా తొలి ఆలోచన చేసిన శాస్త్రవేత్తలు కాకుండా, అమెరికన్ రక్షణ వ్యవస్త చేతులు మీదుగా జరగడం, అక్కడ మళ్ళీ ఫలితం కోసం పాటు పడే మిలిటరీ కార్యదక్షత ఒక వైపు, పద్ధతుల వెంట పరుగుతీసే  శాస్త్రవేత్తల ప్రాకులాట ఒక వైపు, ఈ సంఘర్షణలూ, అవరోధాలూ, ఆటంకాలూ... ఇవన్నీ దాటుకుని ఎట్టకేలకు రెండు బిల్లియన్ డాలర్లు, మూడు యేళ్ళు, లెక్కకు రాని శ్రామిక, పారిశ్రామిక, మేధో మధానాల అనంతరం, జులై 1945 లో మనిషి కృషి ఫలితం - ఆధునిక భస్మాసుర హస్తం, అణు బాంబు, ఆవిర్భావం.


అనుసంధానం నుండి అణు సంధానము వరకు


ఎవరి కోసం బాబ్ము ఉద్దేశ్శింపబడిందో, ఎవరి పాలన అంతమొందించడానికి విశ్వ శాస్త్రవేత్తలూ ఒక్క తాటి పైకి వచ్చి నిద్రాహారాలూ మాని రేయింబవళ్ళూ కష్టపడ్డారో, ఆ హిట్లర్, అణ్వాస్త్ర పరీక్షకు ముందే బెర్లిన్ లో ఒక నేల మాళిగలో చుట్టుముట్టిన రష్యన్ సైన్యానికి చేజిక్కకూడదని పిరికి బాటను పట్టి ప్రాణ త్యాగం చేసుకుంటాడు. మరి ఎక్కు పెట్టిన బాణం మాటో? పరీక్ష సఫలం అయ్యేనాటికి బాంబు వ్యవహారాలు శాస్త్రవేత్తల పరిధి, రక్షణ వ్యవస్థను దాటి పాలకుల, నాయకుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంక బరిలో మిగిలి ఉన్న ఒక్క దేశం జపాన్. అణు శక్తిని ప్రత్యక్షంగా చూసిన శాస్త్ర సమాజానికి ఆశ్చర్యంగా, సహజంగా, దాని ప్రయోగం మీద వ్యతిరేకత మొదలయ్యింది. ఈ అయుధం ఒక నిరోధక/నివారక సాధనంలానే వాడాలి కానీ, నరమేధ కోసం, అందునా యుద్ధంతో ప్రత్యక్ష సంబంధం లేని పౌర సమాజం మీద, అసలే వాడకూడదని అధికార వర్గాలకు తలనొప్పి కలిగించే స్థాయికి అర్జీలు మొదలు పెట్టింది. పాలకుల ఆలోచనా సరళే వేరు. అడవులలో కార్చిచ్చుని ప్రబలకుండా నివారించడానికి, దాని చుట్టూ ఉండే ప్రదేశాన్ని ముందే తగలేసి ఆ మంట పాకడానికి దారి లేకుండా చేయాలి అనేది వారి యుద్ధతంత్రం. పరిశోధన కాలంలోనే జపాన్లో 12 నగరాల పట్టికను తయారు చేసి, చివరి దశలో వచ్చేసరికి 12 కాస్తా 5 చేసి, ఆఖరి నిముషం లో 5 3 అయ్యి, ఇక కట్టకడపటి క్షణంలో క్యోటో నగరాన్ని తీసేసి నాగసాకిని చేర్చడం, పాలితుల తలరాతలు ప్రభువు చేతుల్లో ఎలా (ఏ)మార్చబడతాయో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. యూరోప్ లో యుద్ధం ముగిసినా, జపాన్ వాయుసేన 1941 లో హవాయి రాష్ట్రం పెర్ల్ హార్బర్ తీరాన పొట్టన పెట్టుకున్న వేల మంది సైనుకుల ప్రాణాలకు తగిన ప్రతీకారం జరగలేదు అన్నది, విజయపుటంచులలో నిలిచిన అమెరికా మర్చిపోలేదు. భూమిలో కూరుకుపోయిన చక్రాన్ని వెలికి తీసే నిస్సహాయుడైన కర్ణుడి మీద అస్త్ర సంధానం చేసిన నిర్దయుడైన అర్జునుడిలా, అగస్ట్ 6న హిరోషిమా మీదా, మూడు రోజుల తరువాత 9న నాగసాకి మీద మృత్యువు ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపించింది. క్షణానికి లక్షో వంతులో రెండు మైళ్ళ పరిధిలో ఒక్క సారిగా తాపం 400 డిగ్రీలకు వేడెక్కడం మనిషి శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపించగలదో, ఆ రెండు మైళ్ళ ఆవల, రేడియో ధార్మికతతో వెలువడిన న్యూట్రన్ కణాల వెల్లువలో, శరీరం బయట చిన్న గాటన్నా లేకుండానే, లోపలి అవయవాలు ఎలా దహించుకుని పోయాయో, ఆ అణ్వాస్త్ర దాడికి అప్పుడు చనిపోయిన లక్ష మందే కాక, కొన్ని తరాల వరకూ వాటి పరిణామాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో, ఆ తరువాతి కాలంలో మిగతా దేశాలు ఆత్మ రక్షణ పేరిట అణ్వాస్త్ర సంపత్తిని ఎలా పెంచుకున్నాయో, ఒక మీట మాటున ప్రపంచం క్షణ కాలంలో పూర్తిగా ఎలా భస్మీపటలం కాగలదో, ఇవన్నీ గమనిస్తే, ప్రకృతి అందించేది పరికరాలు మాత్రమే, ఆయుధం గా మలుచుకుంటుందో అభివృద్ధికై వాడుకుంటుందో, అది మానవాళి చేతుల్లోనే ఉంది (భస్మాసుర హస్తమా - ఆపన్న హస్తమా) అనిపించక మానదు!


గణితం మొదలుకొని భౌతిక శస్త్రం, రసాయనంతో సమ్మిళితమయి, ఆ మిశ్రమం మనస్తత్వ శాస్త్రంతో రంగరింపబడి, కనుమ రక్షణ, రాజకీయ రంగాల ప్రభావంతో విస్ఫోపటక శక్తిగా నరహంతక ఆయుధంగా ఎలా పరిణమించిందో తెలిపే హెచ్చరిక-ధే  The Making of the Atomic Bomb

No comments: