' నమ్మితే ప్రాణాలైన ఇస్తాం, నమ్మెడమేరా కష్టం', 'నిత్యం నమాజు పూజలు చేస్తాం, రోజు తన్నుకు చస్తాం', 'రూలు ఉంది రాంగూ ఉంది, తప్పుకు తిరిగే లౌక్యం ఉందీ - ' ఖడ్గం ' సినిమాలోని ' మేమే ఇండియన్స్ ' పాటలోని కొన్ని పంక్తులు ఇవి. విదేశాల్లో ఉండే భారతీయులకు తరచు తారసపడే ప్రశ్న - ' మీ భారత దేశం ఎలా ఉంటుంది '. పాత సినిమాల్లో మాదిరి ఆ ప్రశ్న ప్రతి భారతీయుడి మొహం మీద రింగులు రింగులు తిరిగేలా చేసి తీవ్రమైన వైరుధ్యాల విరాట్ రూపాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరింప చేస్తుంది. సాకీలో ' ఏమని వర్ణించను ' సోలో పాట లోకీలో వినిపిస్తుంది. వెంటనే తెల్ల దుస్తుల్లో ఆదర్శప్రాయ, లోకమాన్య భారతీయుడు ఒక వైపు, మరో వైపు నల్ల దుస్తుల్లో పరిపూర్ణ మానవత్వానికి సరిగ్గా వ్యతిరేక లక్షణాలు నిండిన నీచ భారతీయుడు ఠంగున ప్రత్యక్షమైపోయి వాదులాటలూ, పెనుగులాటలూ, పోట్లాటలూ చేసుకోవడం మొదలు పెడతారు. ' ఐహికాన్ని కొన్ని వేల యేళ్ళ క్రితమే త్యజించిన చింతన నాది ' గర్వంగా ప్రకటిస్తాడు తెల్ల భారతీయుడు (తె.భా.). అసలు అటువంటి ఊసే ఒకటి చేసానని మరిచిపోయి, క్రమంగా తెలివిని తగ్గించేసుకుని, సామాన్యత్వాన్ని కొండకచో దిగజారుడు తనాన్ని అలవరుచుకుని, ఉచ్ఛం వదిలి నీచాన్ని ఆబగా ఆలింగనం చేసుకున్న అభ్యుదయవాదిని, సిసలైన సామ్యవాదిని, తలెగరేస్తాడు నల్ల భారతీయుడు (న.భా.) శూన్యన్ని శోధించి, మధించి, ఆరాధించి, ' సున్నా ' కనిపెట్టిన నిఖార్సైన మిధ్యావాదిని, తె.భా. ' సున్న ' తరువాత మిగిలిన నాగరికతలు తక్కిన అంకెలు కనుక్కుని ముందుకు దూసుకు పోయినా, ఆ ' సున్నా ' సోయాగాన్ని ఆ నున్నని నిగారింపుని తనివి తీరలేనంతగా తలపులలోకి తెచ్చుకుంటూ, తక్కిన మానవాళికి ఉన్నత సోపానాల నధిరోహింప చేసి, తను మాత్రం అక్కడే తొలి మెట్టూగా మిగిలిపోగల సహృదయతనూ, సౌభ్రాతృత్వాన్ని చాటుకుంటుంటాడు న.భా. ' యత్ర నారీ పూజ్యాతే ' సూక్తినాలకించి పూజా పీఠాల నుండీ అధికార పీఠాల వరకు స్త్రీలని పై వరుసలో ప్రతిష్టించిన గొప్ప చరిత ఘనత నాది, తె. భా. అదే స్త్రీలను పిండ రూపం నుంచి పోయిన తరువాత పిండం పెట్టే వరుకూ వింత రీతులలో చిత్ర హింసలు పెట్టగల మగతనం నాది, మద హజం నాది, న.భా. ఇంతకీ మీ భారతదేశం ఎలా ఉంటుందయ్య అని ప్రశ్న వేసినవాడు ఎప్పుడో కదిలిపోయినా, ఈ వాదాల వలువలు చిలవలు పలవలు. ఒక్క ముక్కలో తేల్చవయ్యా అంటే, భారతీయం అనేది భౌగోళికం కాదు, అది పూర్తిగా మానసికం.
నాడెన్నడో మహాభారతంలో శకునిది గాంధారం (నేటి అఫ్ఘనిస్తాన్), అక్కడెక్కడో అర్జునుడి భార్యల్లో ఒకరి పుట్టిల్లు సుమాత్రా (థాయిలాండ్) అన్న పురాణాల ప్రామాణికం తీసుకుంటే ఆ శకుంతలా భరతుడి అవిభాజ్య దేశం అటు పశ్చిమాన మధ్య ప్రాచ్యం నుండి ఇటు తూర్పు ఆగ్నేయాసియా వరకూ, అటు ఉత్తరం హిమవన్నగలా నుండి, ఇటు దక్షిణం రావణ రాజ్యం వరకూ. ఈ సువిశాల భూభాగంలో భిన్న జాతులూ, సంస్కృతూలూ, భాషలూ, మతాలూ, కులాలూ, అచారాలూ, వ్యవహారాలూ. ఇందులో ముఖ్యంగా ఎవరి చరిత వారిదే, ఎవరి తీరు వారిదే, ఎవరి ముచ్చట వారిదే. కాకతీయ పరిపాలనా పాటవాల మీద కళింగ కవులు కీర్తిగానాలు చేసిన దాఖలాలు లేవు, అలాగే నాటి పాటలీపుత్రపు గుప్తుల స్వర్ణ యుగం గురించి, ఇక్కడి గోదావరీ తీరంలో నన్నయ పద్యాలు అల్లలేదు. అందుకే ' భారత దేశ చరిత్ర ' అన్న పద సమ్మేళనం ఒక పరస్పర వైరుద్ధ్యం (oxymoron). ఇది ఎవరికి వారే యమనా తీరే. విచిత్రమేమితంటే ఈ భారత దేశం అన్న భావన పరిపాలనా సౌలభ్యం కోసం తెల్లవాడు చేసిన ఒక ఆలోచన. 14 అగస్ట్ 1947 అర్ధరాత్రి వరకు భారత దేశం అంటే 500 పైచిలుకు సంస్థానాల సముదాయం. అధికార వికేంద్రీకరణ పేరుతో బర్మా, భూటాన్, శ్రీలంక, పిదప రాజకీయ కారణలతో పాకిస్తాన్లను, ఈ సంస్థానాల మట్టి ముద్ద నుంచే తెగ్గోసి, విడగొట్టి, ఆ అవశేషాన్ని భారత దేశం అన్నాడు. నేటి భారతీయుడు నాటి గాంధారాన్ని తనది చేసుకోవచ్చు. నేటి శ్రీలంకను తన దేవుడు నడిచిన నేల అని కొలవచ్చు. కానీ ఇదే నేల నుండి వేరుపడిన నేటి పాకిస్తాన్ తన క్షిపణి పేర్లను నాడు దేశన్ని కొల్లగొట్టిన ఘజినీ, ఘోరీల పేర్లు పెట్టుకుని మురవడం, నేటి భారతీయుడికి మింగుడు పడని విషయం. దానికి కారణం ఒకటే, భారతీయులకి ఒక కలివిడి చరిత్ర (shared/common history) లేదు. ఒక దేశానికి ఉండవలసిన భాషా ఏకత్వం లేదు, సమిష్టి సంస్కృతి లేదు, ఆద్యులు లేరు, మూలాలు లేవు. ప్రపంచంలో చారిత్రక చిరునామా లేని ఏకైక దేశం భారతదేశం. వేళ యేళ్ళ చరిత్రకు నేడు వారసులు లేక, అప్పటి రాజ భాషకు (సంస్కృతం) నేడు ఆదరణ లేక, ఒక నాగరికత మృతమైపోతోదన్న సందర్భంలో తెల్లవాడి అసంకల్పిత చర్యలవల్ల, నేడు భారత దేశానికి మళ్ళీ ఒక అస్థిత్వం వచ్చింది. ఒక విధంగా భారత దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన, అదే విధంగా అత్యంత నవీన దేశం. అటువంటికి దేశానికి ఒక చరిత్ర గ్రంధం రాయడం అనేది, సముద్రానికి మొదలు వెదకడం లాంటిది. ఇక్కడ పురాణాలకూ, చరిత్రకూ వ్యత్యాసం బహు స్వల్పం. కధలకూ, వాస్తవాలకూ, కల్పనలకూ కాలం విప్పలేని ఒక పీట ముడి పడిపోయింది. అటువంటి బ్రహ్మ ముడిని విప్పే ప్రయత్నమే 'India After Gandhi'. పురాణాలూ, పారాయణ గ్రంధాల సరసన నిలవగల, చిన్న తరగతుల నుండి ఉన్నత విద్యల దాకా నిర్బంధ పాఠ్యాంశంగా నిర్ణయింపదగ్గ ఒక సత్య శోధన.
ఛ...ఛ...ఛ.. దేశానికి నెహ్రూ కాకుండా పటేల్ ప్రధాని అయ్యుంటే మన పరిస్థితి వేరుగా ఉండేది, అసలు గాంధీ-నెహ్రూ కారణంగానే మన దేశం విడిపోయింది, నెహ్రూ సామ్యవాదం కాకుండా పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించి ఉంటే, అల్పసంఖ్యాక వర్గాలకు రిజర్వేషన్లు కులప్రాతిపదికన కాక కలిమిలేమితనం మీద ఇచ్చి ఉంటే, రష్యాకు చాచిన స్నేహ హస్తం మొదటి నించి అమెరికాకు అందించిన ఉంటే....అసలు ఇవన్నీ కావండీ, ప్రజాస్వామ్యం కాక చైనా తరహా కమ్యూనిసం ఎంచుకుని ఉంటే....దేశం నేడు ఎందుకు ఈ స్థితిలో అఘోరిస్తోంది అని వాపోయే ఉబుసుపోక విశ్లేషకులు చెప్పే కారణాలలో కచ్చితంగా ఈ పైవాటిలో ఒక రెండు మూడు ఉండి తీరుతాయి. కానీ స్వాతంత్ర్యం అప్పుడే సిద్ధించిన జాతి తొలి అడుగులకు తడబడుతున్న సమయంలో తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం వెనక ఎంత ఆలోచన ఉందో, సమస్యల పట్ల ఎంత సమగ్ర అవగాహన అధ్యయనం ఉన్నాయో, ఇంత భిన్నత్వాన్ని ఒక్కతాటి మీద నిలాపలన్న ఏక దీక్ష వెనుక ఎంతటి శ్రమ ఉందో, ఎంత రక్తం చిందిందో, ఎంత స్వేదం ఇంకిందో, ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్న తరువాత ప్రతి భారతీయుడికి కళ్ళు చెమరించక మానవు, ఛాతి గర్వంతో పొంగక మానదు. ఈ ఎనభై యేళ్ళ శైశైవ స్వంతంత్ర దేశం ప్రతి దశకంలోనూ విచ్ఛిన్నానికి ఆమడ దూరంలో నిలిచిన ప్రతీ సారీ అరాచక మూకలకు ముకుతాడు వేసి సుస్థిరత వైపు ఈడ్చుకుపోయిన ప్రతీ కృషీవలుని కాయకష్టం మేధోమధనం ఈ పుస్తకంలోని ప్రతి పుటాలో దర్శనమిస్తాయి. దేశంగా కలిసుండడానికి భూతద్దం వేసుకుని వెతికినా ఒక్క కారణం కనిపించని భిన్న ప్రాంతాలు, తమిళనాటి కళలు తమవిగా, కాశ్మీరపు కల్లోలాలు తమ పొరుగివిగా, యుద్ధాలలో అశువులు బాసిన అన్ని ప్రాంతాల సైనికులు తమ కుటుంబ సభ్యులుగా, నేడు ఆసేతుహిమాచలం ఒకే విధంగా స్పందించే విధంగా దేశాన్ని తయారుచేసిన కళాసీలకు ఈ పుస్తకం ఒక హృదయాంజలి. ఈ పుస్తకం ఒక వ్యక్తి అభిప్రాయం కాదు. ప్రముఖుల ఉత్తరాలు, నాటి వార్తా పత్రికలు, ప్రసంగాలు, ఆత్మ కధలు, ముఖాముఖులు తదితర అసంఖ్యాక మూలాల క్రోడీకరణ. (ఈ గ్రంధ సంకలన చిట్టా (bibliography) వంద పేజీల పైబడి ఉంది). ఒక తత్వవేత్త చెప్పినట్టు నిజం ఎప్పుడూ వైరుద్ధ్యాల సందుల కొనఊపిరితో కొట్టుకునే అల్పప్రాణం. ఆ నిజాల్ని ఆ సందుల మధ్యనుండి జాగ్రత్తగా వెలికితీసి ప్రపంచానికి (ముఖ్యంగా నేటి భారతీయులకి) తేటతెల్లం చేసే హృద్యమైన, మానవీయమైన, వీటన్నిటినీ మించి, దేశభక్తి ప్రబోధకమైన ప్రయత్నం India after Gandhi. చరిత్ర అంటే ప్రేమ పురాణాలు, ముట్టడులకైన ఖర్చులు, తారీకులు, దస్తావేజులు అని చిన్న చూపు చూసే వారికి చరిత్ర అంటే పంటి బిగువున మోయలేని బరువును ఎత్తిన ప్రయత్నాలనీ, రక్తమోడుతున్నా చివరి బొట్టువరుకూ పోరాటమాపని పటిమనీ, సమస్యలు మేరు పర్వతాలై నిలిచినా అగస్త్యుడిలా అధిగమించగలిగే సమయస్ఫూర్తనీ, అవే దస్తావేజులు, అవే తారీకుల ఆధారంగా రామచంద్ర గుహ ఆవిష్కరించిన అభినవ మహాభారతం India after Gandhi.
1 comment:
This is the apt review for best book. Im going to buy it now.
Post a Comment