కాఫీ కొనుక్కోవడానికి కొట్టుకు వెళ్ళి, ఇచ్చిన కాఫీని చేయి జార్చుకొని ఒంటి మీద ఒలకపోసుకుని ఒళ్ళు కాలుచుకుని, తన ' చేతకానితనానికి ' కారణం ఆ కాఫీ వేడిగా ఉండడం వల్లే అని కాఫీ కొట్టు వాడి మీద కేసు చేసుకున్న ఉదంతం ఆ మధ్యకాలంలో అమెరికాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఆ ' ఫార్సు ' అంతటితో ఆగలేదు. సదరు కోర్టు వారు ఫిర్యాదు వైపే మొగ్గు చూపి, కాఫీ మరీ ' అంత ' వేడిగా (ఆత్రేయ గారి భాషలో, అంత ' ఇదిగా ') ఉండకూడదని నిర్ధారించి, వారిచేత లక్షల డాలర్ల పరిహారం కూడా ఇప్పించారు. తత్ఫలితంగా ఇప్పుడు కాఫీ కప్పుల మీది సూక్ష్మ ముద్రణ (fine print) - 'కాఫీ వేడిగా ఉండవచ్చు, చూసుకుని ఊదుకుని జాగ్రత్తగా త్రాగ మనవి ' అని.
వేడిగా ఉన్న ఇస్త్రీ పెట్టె మీదా పొరపాటున చేయి వేసి చేయి కాల్చుకుని, అది చాలక ఆ ఇస్త్రీ వాడినే కోర్టుకీడ్చి ఉతికి ఆరేసిన సందర్భాలు, దొంగతనానికి ఒక ఇంటికి వెళ్ళి నేల మీద గచ్చు మరీ నున్నగా ఉండడంతో కాలు జారినందువల్ల నడుము జారిపోయిన కారణానికి ఆ ఇంటి యజమాని పైనే కేసు వేసిన ఉదాహరణలు, అభూత కల్పనలు కావు. ఇవి అమెరికా న్యాయ వ్య్వవస్థకే మకుటాయమైన తార్కాణాలను. 'నేను నీతో ఏకీభవించను కానీ, నీ భావప్రకటనా హక్కు కోసం నా తుది శ్వాస వరకూ పోరడతా 'ననే సూత్రం అమెరికా స్వేఛ్ఛావాద సమాజానికి ఎలా మూల స్థంబమై నిలిచిందో, అదే విధంగా వారి న్యాయ వ్యవస్థలో హేతువు, తర్కానికి ఎంత ప్రాధాన్యత ఉన్నాయో, అవే పాళ్ళల్లో అవివేకం, తెలివితక్కువతనం, మూర్ఖత్వం, కొండకచో తుంటరితననికి కూడా అంతే ప్రవేశార్హత ఉన్నవనడానికి పై మచ్చుతునకు చాలు. దానికి వారు ముద్దుగా పెట్టుకున్న పేరు ' టార్ట్ ' (tort). ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఉండే ఏ వ్యవహారంలో ఐనా, అది ఆర్ధిక, రాజకీయ, మతపర తదితర ఏ పరిధి పరిమితులలో ఉన్నా, ఒకడు మరొకడిని ఏ కారణానికైనా, శారీక, మానసిక, సామాజిక నష్టాల కింద, కోర్టు కీడ్చే వెసులుబాటును వారి న్యాయ వ్యవస్థ కల్పించింది. ఆ చట్టం పేరే 'టార్ట్ లా'.
కానీ, పైన కాఫీ కేసులో ఇస్త్రీ ఇబ్బందిలో, ఏ లాపాయింటు లాగి అవతల సంస్థని గిలగిలలాడించవచ్చు? దానికి జవాబే, లాలోని మెలికెలు, మెలకువలు, చీకటి కోణాలూ, రేచీకటి తీర్పులన్నీ ఔపోసన పట్టేసి, కేసు వేయువారికి వీనుల విందుగా విశద పరిచే విద్యా విశరదులే మన లిటిగేటర్స్. కాఫీ మీద ఒలికి, ఒళ్ళు కాలిందా? తప్పు మీది ఎంత మాత్రమూ కాదు, అసలు ఆ కప్పు అంత వేడిగా ఎందుకు వుండాలి, ఉండెను ఫో! ఆ కప్పుకు ఒక పరిరక్షణా వలయాన్ని పొందుపరచుకుండా మీ చేతికేల అందీయాలి, ఇచ్చెను ఫో! ఆ విషయం, అదే కాఫీ వేడిగా ఉండును అన్న ప్రాధమిక విషయం, మీకు చెప్పకుండా ఏల దాచాలి! ఇందులో మీ అవివేకం, అప్రయోజకత్వం, అసమర్ధత, అజ్ఞానం, ఎంత మాత్రమూ లేవు, ఉంటే గింటే, ఆ పెట్టుబడిదారీ సంస్థ యొక్క దురహంకారం, ఏం చేసినా చెల్లునులే అన్న పొగరు, కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. అది చాలు వారి ముక్కుని న్యాయస్థానం నేల మీద అరగదీసి, ఆ అరిగిన ముక్కుని పిండి నష్ట పరిహారం పొందడానికి. మా ఫీసా, భలేవారే, మీరు బయానాగా ఏమీ ఇచ్చుకోవక్కర్లేదు, ఆ 'లక్షల డాలర్లలో', ఒక పావో వంతో అరో వంతో మీకిచ్చే పరిహారంలో మేము మినహాయించుకుంటాం! పైసా పెట్టుబడి లేని బేవార్సు బేరం! ఆలసించిన ఆశాభంగం!
కాదే వస్తువూ కవిత కనర్హం అని కవి అన్నట్టు, కాదే అసంబద్ధమూ కేసుకనర్హం అన్నది ప్రస్తుత న్యాయవాద నీతి. ఈ టార్ట్ బారిన పడ్డ వ్యాపార సంస్థల మీద మరీ అంత జాలి పడే పరీస్థితీ కాదు. చిన్న ఉదాహరణ: విపణిలోకి కొత్తగా వచ్చిన ఒక సంస్థ కారులో సాంకేతికమైన లోపాలు ఉన్నట్టు సదరు కారు కంపెనీ వారు గుర్తించారు. ధర్మాన్ని అనుసరించి వెంటనే విక్రయించబడ్డ కార్లనన్నిటిని వెనక్కి పిలిపించి (recall) ఆ లోపాన్ని స్వీయ ఖర్చుతో సరిచేయించి తిరిగి దానిని వినియోగదారుడికి అప్పగించాలి. వాస్తవానికి జరిగేది వేరు. లోపాలు సవరించడానికి అయ్యే ఖర్చు కన్నా, ఆ సాంకేతిక సమస్యల వల్ల కలిగే ప్రమాదాలు, దాని ఫలితంగా అయ్యే కోర్టు కచ్చేరీల ఖర్చు తక్కువైతే, ఆ లోపాల మాట బయటికి పొక్కనివ్వరు, కోర్టు ఖర్చులే ఎక్కువనుకున్న పక్షంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించి (అంటే, తప్పని తద్దినంగా, చచ్చినట్టు) ఆ కార్లను తిరిగి రప్పించి బాగు చేయించే ప్రక్రియ చేపడతారు. ఈ వినిమయదారుడు - విక్రయదారుడి వింత లెక్కలలో, బాధితులు ఉండరు, లబ్దిదారులు తప్ప.
జాన్ గ్రిషం సరిక్రొత్త నవల ' ద లిటిగేటర్స్ ' న్యాయశాస్త్రపు మరో పార్వ్శాన్ని స్పృశించే మెచ్చదగిన ప్రయత్నం. ఇందులో విక్రయదారుడు, కోట్లకి పడగలెత్తిన ఒక మందుల కంపెనీ. వినియోగదారులు, ఆ కంపెనీ తయారు చేసిన కొలెస్ట్రాల్ మందు వాడిన వారు. వ్యాజ్యం, ఆ మందు వాడినందు వలన గుండెపోటు వచ్చి బాధితుడు పోయాడని అభియోగం. సూత్రధారులుగా, మందు వైపు, గంటకి వందల డాలర్లు వసూలు చేసే ఖరీదైన వకీళ్ళు, మంది వైపు, కంపెనీ కుంభస్థలాన్ని కొట్టి, ఆ కురిసే కోట్ల పరిహారానికి కాచుక్కూర్చునే చకోర పక్షుల్లాంటి చెట్టు కింద ప్లీడర్లు. ఇలాంటి బలవంతుడు-బలహీనుడి కధల నేపధ్యంలో, బలవంతుడు దుర్మార్గుడుగాను, బలహీనుడు ఆదర్శవాదిగా చిత్రీకరించడం సర్వ సాధారణం. బలం మీద హజం చేసి చివరికి నైతిక విజయం పొందడమనేది శిల్పం పరంగా చాలా స్ఫూర్థిదాయకమైన బాట. ఐతే గ్రిషం ఇక్కడ చూపించదలచినది వాస్తవం. నిజ జీవితంలో కోట్ల కంపెనీలన్నీ చెడ్డవీ కావు, బక్క చిక్కిన బాధితులందరూ పతిత్తులుగారు. ఇక్కడి పోరు అత్యాశకి అవకాశవాదానికి మధ్యలోనే. నోటి మీద నియంత్రణ లేక ఊబకాయులైన వాళ్ళు, తమ స్థూలత్వానికి మరొకరిని బాధ్యుల్ని చేసి తద్వారా ధనవంతులమవ్వాలన్న దురాశ ఒక వైపు, మందుల తయారీలో అత్యంత కీలక పర్వమైన మానవ పరీక్షలను (human testing) నియంత్రణల చట్టాలే లేని ప్రాంతలలో గుట్టు చప్పుడు కాకుండా చేససి సామాజిక బాధ్యతల నుండి చేయి కడిగేసుకునే పెట్టుబడిదారీ సంస్థల ధన మదాంధం మరొక వైపు. సందట్లో సడేమియా అంటూ, చచ్చిన శవాలను చూపి మొసలి కన్నీళ్ళు కారుస్తూ, సానుభూతిని రేకెత్తించి సంస్థల గల్లాపెట్టెలు కొల్లగొట్టచూసే న్యాయ బేహారీలు (dealers in law) ఒక వైపు. ప్రజా ప్రయోజనాలు వల్లించినా చివరకు లాభమే పరమావధిగా భావించే పెట్టుబడిదారుల, తమ అధోగతికి మరెవ్వడో కారణం అని చూపుడు వేలు ఎప్పుడూ ఎదుటి వాడి వైపు ఎక్కుపెట్టే ' బలహీన వర్గాల ', ఈ ఎలుక ఎలుక పోరును తీర్చే క్రమంలో రొట్టె మొత్తం ఎగవేసుకుపోదామని కాచుకుని ఉండే ప్లేడర్ల, ముప్పేట పోటీని కళ్ళు కట్టినట్టు వ్రాసిన గ్రిషం శైలి, కధనా చాతుర్యం అమోఘం. ఆదర్శానికి, వాస్తవానికి గల అంతరాన్ని సహజత్వం దగ్గరగా, కావలసిన మేరకే కల్పనని వినియోగించి, గ్రిషం వేలార్చిన ఈ కాలపు విదుర నీతి ' ద లిటిగేటర్స్ '.
తుదిపలుకు: ప్రఖ్యాత తెరవేల్పుగారి తాజా వ్యాపార ప్రకటనలో భవనాలు దూకుతూ, రోడ్ల మీద కార్ల పైకి ఉరుకుతూ, అవిశ్రాంతంగా అటుఇటూ ఎందుకనో పరిగెడుతూ, ఆ తెగువ అంతా ఫలానా వారిని శీతల పానీయం సేవించడం వల్లే అని అమాయకత్వంతో కూడిన అవివేకంతో శలవిస్తారు. ఆ ప్రకటన వస్తున్నంత సేపు, తెర దిగువ భాగం లో సూక్ష్మ ముద్రణలో - ఈ పరాక్రమం అంతా ఉత్తిత్తినే! నిజమే అనుకనేరు! దీనికి అంత దృశ్యము లేదు, దయచేసి అనుకరించవలదు - అని చూపించే అవసరం వెనక, పైన చెప్పి ఒక తెలివిలేని బాధితుడు, ఆ తెలివి తక్కువ తనాన్ని తన లాభంగా తర్జుమా చేసికున్న న్యాయవాదుల సమిష్టి కృషి దాగి ఉంది.
2 comments:
Please see this documentary - "HOT COFFEE" You might want to re-consider your comments in the first paragraph.
A very well-written review. And the postscript is hilarious.
Post a Comment