పుస్తక సమీక్ష : The Innocent Man
గణేష్ ఉత్సవాల నేపధ్యంలో నేర చరిత్ర కలిగిన వాళ్ళని ముందు జాగ్రత్త చర్యగా జైళ్ళలోకి తోయడం, నగరంలో భారీ దొంగతనం ఏది జరిగినా పేరు మోసిన ముఠాలకు ముందస్తుగా విచారణల పేరుతో థర్ద్ డిగ్రీ తీపి రుచులను మారు వడ్డించడం వ్యవస్థకు చిరపరిచతమైన చర్యలు. ఇవి చూసినప్పుడు శిక్ష పడేది చేసిన నేరానికా, ఉన్న నేర ప్రవృత్తికా అన్న మీమాంస వ్య్వస్థను వేధించక మానదు. నేరాన్ని నివారించడనికి, సంఘాన్ని పరిరక్షించుకోవడానికి ఇవన్నీ ఆవశ్యకాలు అని సంఘం ఎంత సరిపెట్టుకున్నా, అదే శిక్షాస్మృతిలో వందమంది నేరస్థులకు శిక్ష పడకపోయిన పర్వాలేదు, ఒక్క అమాయకుడు కూడా చేయని నేరానికి బలి అవకూడదు అన్న సూత్రం అంతర్వాహినిగా చెలామణీ అవుతుందన్నది నిర్వివాదాంశం. శోచనీయమైన విషయం ఏమిటంటే, ఇంత ప్రాధమిక సూత్రం అంతర్వాహినిగా, ఆకాశంలో అరుంధతిగా, లేక చెప్పుకోవడానికి బావున్న నానుడిలాగా కాక, ఒక స్థిరమైన చట్టంగా తర్జుమా కాకపోవడం. ఆ కారణంతో ప్రపంచవ్యాప్తంగా వేల కొద్దీ నిర్భాగ్యులు వంచిత పరిస్థితుల దృష్ట్యా నేరస్థులుగా ముద్ర పడిపోయి జైలు గోడల మధ్య కృశించిపోవడమన్నది నాగరికతకు చెంప పెట్టుగా, సమాజానికి మాయని మచ్చగా ముద్ర పడిపోయింది. వాళ్ళు చేసిన ఏకైక నేరం, అంతకు మునుపు సంఘం చేత నేరస్థులుగా ముద్ర వేయించుకోవడం. 70వ దశకంలో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టేన్లీ కూబ్రిక్ 'A Clockwork Orange' అన్న చిత్రంతో నేర ప్రవృత్తిని శిక్షాస్మ్రితిని ఒక్క కుదుపు కుదిపాడు. అందులో అసాంఘిక భావాలు ధమనుల్లో జీర్ణిచుకుపోయిన ఒక కరుడు కట్టిన నేరస్థుడిని, శిక్షా వ్యవస్థ అప్పుడే కనిపెట్టబడిన ఒక కొత్త ప్రక్రియ ద్వారా సంస్కరణకు ప్రయత్నిస్తుంది. ఆ ప్రక్రియ ఒక విధంగా ఆ నేరగాడిలో మానవత్వం మొలకెత్తించడానికి బదులు, మనిషితనన్నే కూకటి వేళ్ళతో పెకలించివేసి చివరికి పిచ్చివాడిని చేస్తుంది. కొండ నాలుక - ఉన్న నాలుక చందాన సమాజ బాధ్యత నేరానికి శిక్ష వేయడం వరకే గాని, ఆ ప్రవృత్తిని ప్రేరేపించే మనసు మీద సమాజానికి ఎటువంటి హక్కు లేదని తేలుస్తుంది. సినిమా కాబట్టి విమర్శకులు ఆహా అన్నారు, ప్రేక్షకులు ఓహో అన్నారు. నిజ జీవితం లో సమాజం కాసింత కాని, శిక్షాస్మృతి రవ్వంత గాని మారిన పాపాన పోలేదు. ఇటువంటి అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న సమాజ అసంకల్పిత ప్రతీకార చర్యలకు బలైపోయిన ఒక వాస్తవ కధ, జాన్ గ్రిషం కలం కార్చిన ఒక కన్నీటి బొట్టు  'The Innocent Man : Murder and Injustice in a small town'

ఒక యువతి మానభంగం హత్యలకు బాధ్యుడిని చేసి ఒక వ్యక్తిని చట్టానికి రెండు కళ్ళ వంటి రక్ష-శిక్ష వ్యవస్థలకు రూపులైన పోలీసు యంత్రాంగం, చట్టం మంత్రాంగాలు కలిసి చేయని నేరానికి ఉరికొయ్యల ఊగులాటలకు ఎంత దగ్గరగా చేర్చాయో అన్నది స్థూలంగా కేసు. సరి సరి ఈ బాపతులు నేర చరిత్రలో కోకొల్లలు, ఈ మాత్రానికే న్యాయ దేవతకు ఏదో నడి బజార్లో పరాభవం జరింగిందన్నట్టు ఆవేశలూ ఆక్రోశాలు శోకాలూ ఎందుకో! అవును, ఈ బాపతలు మన ధర్మ పన్నాలలో చర్విత చరణాలూ నిత్య పారాయణాలూ. ఆ నేరాలు చేసింది నేను కాదు అని గింజుకున్నా, గొంతు చించుకున్నా  వినిపించుకోకుండా, ఏదీ నువ్వు ఆ నేరాలు చేయలేదని నిరూపించుకో అని జవాబుదారీతనాన్ని (burden of proof) ఎదురు ఆరోపించబడిన వాడి నెత్తి మీదే వెయ్యడం అన్నది ఈ కేసు ప్రత్యేకత. అందులోనూ నేరం జరిగింది మరణ శిక్షలకు పుట్టిల్లయిన అమెరికా దేశంలోని ఓక్లహోమ రాష్త్రం. ఇక్కడి న్యాయ సిబ్బంది నమ్మిన సూత్రం - shoot first, ask questions later (ముందు కాల్చు, ఆనక విచారించు). అది 80వ దశకం. అమెరికన్ సమాజంలో నేరం రాజ్యమేలుతున్న కాలం. ఆ పరిస్థితులకనుగుణాంగా నాటి దేశ అధ్యక్షులు నేరస్థులకు (ఆరోపితులకు) న్యాయస్థానాలలో ఏమాత్రం వెసులుబాటు లేకుండా చట్టాన్ని ఇనుప చట్రాలలో అష్టదిగ్బంధనం చేయడం, తత్ఫలితంగా పోలీసులకూ న్యాయస్థానాలకూ విశేషాధికారలు పట్టుబడడం, వాటి అండదండలతో 'న్యాయం'  ఋజువుల ఊతాల్లేకుండా విశృఖలంగా తాండవించడం ఈ కేసుకు పట్టిన దౌర్భాగ్యం, ఆ ఆరోపితుడు చేసుకున్న దురదృష్టం. నేటి రోజులకు మల్లే సంఘటనా స్థలుల నుండి DNA సాక్ష్యాలు సేకరించే సాంకేతికత ఇంక అబ్బని కాలం అది. అప్రత్యక్ష సాక్ష్యాలు (circumstantial evidence) ఆధారంగా మాత్రమే నిరూపింపగలిగే కేసుల్లో అప్పటి విఙ్ఞానం అందించిన ఏకైక  అస్త్రం - కేశ శాస్త్రం. నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన వెంట్రుక వాసి బట్టి నేరాన్ని నిరూపించడమే (నేరం చేసిన వాడిని నిర్ధారించడం) ఈ శాస్త్రం. కాని ఆ తరువాతి కాలంలో పెంపొందిన విఙ్ఞానం వల్ల తెలిసిన ఫలితం, కేశ శాస్త్రం లోపభూయిష్టమైనది తేలడం, దానిని ఆధరం చేసుకుని నిరూపించిన నేరాలలో 80% వరకు తప్పుడివిగా తేటతెల్లమవడం. ఇది ఆ కేసుకి సంబంధించిన సాంకేతికత (technicality). ఇప్పటి వరకు ఇంత నేరగాడి పరిచయం జరగలేదు కదూ...

నేరానికి ముందు అతని గతం అప్రస్తుతం. అయినా వివరాల కోసం ఐతే, చిన్నప్పటి నించి baseball ఆటలో మంచి ప్రావిణ్యం చూపి చదువుకున్న పాఠ్శాలల్లో, కళాశాల్లో మంచి పేరు తెచ్చుకుని, ఆ పైన దేశంలోనే ప్రఖ్యాతి కాంచిన New York Yankees జట్టులో చోటు సంపాదించి, ఎక్కడో చిన్న ఊరిలో పుట్టి New York వరకు ఎగసిన తారాజువ్వ తత్వం ఒక పార్శ్వం. కాని రెండు పదులు కూడా పూర్తిగా నిండని ఆ చిన్న వయసులోనే లభించిన ఆదరణ డబ్బు పేరునూ నిలబెట్టుకునే వయసు, అనుభవం, పరిపక్వత లేని కారణంతో నింగికెగసిన జువ్వ ప్రకృతి నియమంగా చల్ల బడి నేలరాలి పోవడం, అది తట్టుకునే మానసిక స్థైర్యం లేక వ్యసనాలతో సావాసం చేయడం, ఇక తన వెంటన్ సిరి, లచ్చి వెంటన్ అవరోధ..... వెరసి సర్వ భ్రష్టుడయ్యె... ఒకప్పుడు కుటుంబానికి కంటికి వెలుగుగా ఉన్నవాడు కాలక్రమంలో వారి గుండెల మీద కుంపటై, నిత్యమూ రగులుతున్న రావణ కాష్టమై... ఇవి కూడా చర్విత చరణాలే...ఇంటింటి రామాయణాలే... పెద్దగా ఆశ్చర్య పడాల్సినది ఏదీ లేదు. ఒక్కప్పుడు ఊరిలో ఎవరి కీర్తి దేదీప్యమానంగా వెలగ గలదన్న ప్రశ్నకు ప్రతి వారి వేలు తన వైపు చూపెట్టుకున్న వ్యక్తి, అ తరువాతి రోజుల్లో ఊరిలో ఎటువంటి అసాంఘిక పని జరిగినా అవే వేళ్ళు తన వైపు తిప్పుకున్నే దశకు దిగజారాడు. చెడు అలవాట్లూ, సావాసాలు, అందితే ఫోర్జరీలు, అవి చెల్లని చోట చిల్లర దొంగతనాలు, జడలతో జతులూ, వాటితో జగడాలూ, ఎక్కే జైలూ, దిగే కేసూ. కానీ వీటిలో ఎక్కడా హత్యల వెరకూ దారి తీసే పరిస్థితులు లేవు. ఎప్పటికన్నా మారకపోతాడా అని గుండె చిక్కబట్టుకున్న తల్లితండ్రులూ, తిరిగి మళ్ళీ తారపథాన దూసుపోకపోతాడా అని కనిపెట్టుకున్న అక్కలూ....ఇది ఆ నేరగాడి నేపథ్యం. ఓ రాత్రి.... ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు....తెలిసేసరికి తన ఇంట్లో చచ్చి పడి ఉన్న ఒక యువతి, హత్యా స్థలంలో వేలి ముద్రలు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు, హత్య చేసి పోయిన వాడు జారవిడిచిన వల్లా ఓ రెండు తల వెంట్రుకలు. (ఆ వెంట్రుకలే ఉరితాళ్ళై అతని మెడకు బిగిసినాయి). ఆధారలు ఏమీ లేని చోట మొలకెత్తేవి అనుమానాలే. ఉన్న వేళ్ళు అసంకల్పితంగా పాపాల భైరవుడి వైపు చూపడం, మెరుపు వేగంతో రక్ష-శిక్ష వ్యవస్థ వ్యవహరించి, 'చట్టం తన పని తను చేసుకుపోయిందని ' అని చంకలు గుద్దుకోవడం జరిగిపోయినాయి. మిగిలిన వల్లా 'నేను కాదు మొర్రో' అన్న మొరలే...

అమెరికన్ న్యాయ వ్యవస్థకు, భారతీయ వ్యవస్థకూ ఉన్న వ్యత్యాసం, అక్కడి న్యాయ పతులు ప్రజల చేత ఎన్నుకోబడిన వారు, ఎంతో ముఖ్యమైన ఆ పదవులకి కూడా ఎన్నికలు, పోటీలు, అవతలి వాడి దుమ్మెత్తి పోయడాలు తదితర ప్రజాస్వామ్య అవలక్షాణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. పోటీ చేస్తున్నాపుడు నేను ఇంతమందిని ఉరికంబం ఎక్కించాను, నేను ఇంతమందిని జైళ్ళలోకి నెట్టేను, అసలు నేరం అన్న మాటకు నా పేరంటేనే హడల్ వంటి ప్రగల్భాలు పలకడాలూ, ఛాతిని చరుచుకోవడాలూ కడు మామూలు. మధ్యంతర ఎన్నికలూ వస్తున్నాయంటే ఏవిధంగా పాలక పక్షంవారి మనసులు మబ్బుల్లా కరిగి వరాలు వర్షిస్తాయో, అదే విధంగా ధర్మాధికారుల ఎన్నికలు సమీపిస్తున్నాయంటే న్యాయపతులకు చట్టం మీదా ఎక్కడ లేని మమకారం, దాని ఉల్లంఘన అంటే పట్టరాని కోసం, అవి చేసిన వాడిని ఏ కాస్త వీలు చిక్కినా ఉరికొయ్యలకు ఎర వెయ్యడం అమెరికన్ న్యాయ వ్యవస్థపు అతి పెద్ద లోపం. న్యాయం, విద్య, వైద్యం, ఈ సమాజపు మూలస్థంబాలు ఎప్పుడైతే ప్రజా హితం నించి మరలి ప్రజాదరణ (వాళ్ళకేది ఇష్టమో అదే ఇస్తాం) బాట పట్టాయో, ఆ మూడిటికీ సమాజంలో ఉన్న సమున్నత స్థానం కాస్తా సాధారణమయిపోయింది. నన్ను గెలిపించిండి నేను మరిన్ని మరణ శిక్షలు అమలు చేస్తా, కాదు నన్ను గద్దె నెక్కించండి నేరం గుండెల్లో నిద్ర పోతా, అంటూ శపథాలు చేసే తలారులు ఒక పక్క, ఇక వారి న్యాయ వ్యవస్థలోని మరో బలహీనత - ప్రజలే ధర్మకర్తలై వ్యవహరించే పద్ధతి (jury of peers) - మరొక వైపు. చేసిన తప్పు నలుగురి ఎదురుగా ఋజువు చేసే ఆలోచన ఉదాత్తమే కావచ్చు, కాని ఆ నిర్ణయాధికరం కలిగిన ఆ నలుగురికి కూడా ఆవేశకావేషాలు ఉంటయని, వాటిని రెచ్చకొట్టి వారిని తెలివిగల న్యాయవాదులు తమకు అనుకూలంగా తెచ్చుకోగలరని, అసలు నేరాన్ని ఋజువు చేయడం చేయకపోవడంతో పని లేకుండా, ఆ ధర్మకర్తల్ని ప్రసన్నం చేసుకోవటమే న్యాయస్థానల పరమార్ధమైపోయిన పరిస్థితులలో, ఒంటరి (అందులో చాల అందగెత్తైన) ఆడదాని మీద నీచంగా కిరాతకంగా కీచకంగా ప్రవర్తించింది మునుపు నేరాల గండపెండేరాలు ధరించిన ఈ నిత్య నేరగాడే అని నమ్మించడానికి ఎవరూ పెద్దగా కష్టపడలేదు.  అనుకున్నట్టే తూ తూ మంత్రాల చావు బాజా మోగడమూ అతని ఉరి శిక్ష పడడమూ పధకం ప్రకారం జరిగిపోయినాయి...కధ ఇక్కడే ముగియలేదు...అసలు అక్కడే మొదలయ్యింది...

విచారణ మొదలు పెట్టక మునుపు నుండి అతని ప్రవర్తన రోజు రోజుకీ దిగజారడం కళ్ళకి గంతలు కట్టుక్కున్న న్యాయానికి కనపడలేదు. ఒక్కొక్కసారి ఉలుకుపలుకూ లేక మౌన మునిలా ఉండిపోయిన వాడే, మరు నిముషమే ఉన్మాదిలా మారి పిచ్చి ప్రేలాపనలు చేయడం, ఒక్కోసారి కేసు పూర్వోత్తరాలు ఔపోసన పట్టిన అగస్థ్యుడిలా వల్లెవేసిన వాడే, మరో సారి పిచ్చివాడిలా శూన్యంతో సంభాషించడం న్యాయస్థానం చూసినా, అవి schizophrenia లక్షణాలు అని తెలిసినా వైద్య పరీక్షలకు ఆదేశించనూలేదు, తాత్కాలిక పిచ్చితనం (temporary insanity) కింద విచరణార్హుడు కాదు అని ప్రకటించనూలేదు. ఆ ప్రహసనం అంతటితో ముగియలేదు. న్యాయస్థానం కాబట్టి ఆ పిచ్చితనాన్ని ఉపేక్షించి అప్పుడప్పుడూ సుత్తి విరిగిపోయేలా order order అని గద్దించినా, శిక్షను అమలు చేసే జైళ్ళు ఆ మాత్రమూ కనికారం కూడ చూపకుండా, మాట వినని పిచ్చి వాడిని నేరుగా ఏకాంత నిర్బంధానికి (solitary confinement) నడిపినాయి. అసలే ఉన్మాదం, అందులో బలవంతపు ఏకాంతం. న్యాయపు వైకుంఠపాళీలో అతనికి పడిన ప్రతి అడుగున ఒక కాలసర్పము కాచుకోవడం కసిగా కటువేయడమే. అతనిది దురదృష్టమా,  న్యాయపు పక్షపా(వా)తమా,  లేక వ్య్వస్థాగత లోపమా అన్నది యక్ష ప్రశ్నే. ఈ కధలో ఎక్కడా గ్రిషం కనిపించడు. కల్పనలో కూడ రాయలేని మలుపులు, ప్రతినాయకుల కంటే కృరమైన ప్రతికూల పరిస్థితులూ,  కంచే చేను మేసిన చందాలు ఈ చేదు వాస్తవానికి సొంతం. మరణ శిక్షను సమర్ధించే వారు మరిచే ముఖ్యమైన విషయాలు ఈ కధలో ప్రతి పుటాలో సాక్షాత్కరిస్తాయి - నేరం శిక్షార్హర్మే కావచ్చు, కాని నేరగాడని నిర్ణయించే పద్ధతులు సహేతుకం కాకపోతే అది నేరాన్ని మించిన ఘోరం అవుతుంది . వాటిలో ఏ మాత్రమైనా అనుమానానికీ, సందేహానికీ తావుంటే, నేరం ఋజువు చేసే ప్రక్రియలో చేతకాని తనానికి చోటిస్తే, న్యాయ దేవత చేతిలోని త్రాసు యొక్క రెండు పక్షాలు నేరము-శిక్ష కాక, అభిప్రాయం-మంది న్యాయం (mob justice) కే ప్రతీకలవుతాయి. కొన్ని ఖచ్చితమైన కేసుల్లో మరణ శిక్ష సరియైనదే కావచ్చు, కాని మనిషి తాలుకూ దౌర్బల్యం, కౄరం, పక్షపాతం నిజ నిర్ధారణ పద్ధతులపై పడినంత కాలం, జరిగినది ఏదీ, నిరూపించగలినది ఏదీ, నేరమేది, శిక్ష ఎవరికి అన్న వాటి మీద అనుమానాలు రాక మానవు, ఆక్షేపణలూ జరగక మానవు. నూటికి తొంభైతొమ్మిది శాతం సక్రమమైనా, కాని ఆ ఒక్క శాతం విషయంలో తిరగబడలేని అమాయక చక్రవర్తులకు ముళ్ళ కిరీటాలు తొడగబడితే? వ్యవస్థ మొత్తం కూడబలుక్కుని ఒక మనిషి మీద కసి తీర్చుకుంటే? వ్యక్తిగతం కాకపోయినా వ్యవస్థలో అనాదిగా పేరుకుపోయిన పాచి భావాల కారణంగా రంగు, జాతి, మతాల పరదాల కింద నలిగి నిజం కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతుంటే? ఇదే కధలో జరిగితే చదివిన వాళ్ళకు కన్నీరొలకచ్చు, అదే నిజ జీవితంలో ఐతే, ముసురుకున్న పరిస్థితులు ఉసురు తీయడానికి చూస్తే, గుండె చిక్కబట్టుకున్న వాడు తీవ్రవాది అవుతాడు, అంత బలం లేని వాడు పిచ్చి వాడు అవుతాడు.

No comments: