పట్టింపులు
పూజా వాటికన పుస్తకములు తెరిచి శ్రీకారము దిద్దే వింత వైనము ఏమిటో?
పంచమ వేదము ప్రవచించు వేళన రాతలు ఆపని పనితనమునకై
చెప్పిన వరసలు పొల్లులు తప్పక అచ్చులు తీరుచు పనిమంతునికై
చుక్కలు చుట్టి దిక్కులు వెతికి కడకు చిక్కులు తీర్చే గణపతి కడకు
వచ్చిన వ్యాసుని మనవిని విని, పట్టిన ఘంటము పక్కన పెట్టే
అంతరమును రానీయబోకుమని, అది ఆగెనా ఇక తాను సాగనని
షరతును పెట్టిన పార్వతి సుతునికి, అర్ధము అవని సర్గల సరిగమ
విశద పరచుకునే ప్రతి మీద పెట్టమని, ప్రతి షరతు పెట్టిన వేద విశారదకి
సామ్యము చూపునీ సత్యము - అర్ధము అవని అక్షరబద్ధము వ్యర్ధము
తర్కించలేని తెలివి శూన్యము - పుస్తకము మీది శ్రీకారమునికి ఇదే భాష్యము
గుంజీల తీపులతో తల మీద మొట్లతో పూజకు ముగింపు పలుకుట ఏమిటో?
వికసించిన పద్మముగా సుఖాసీనమైన శరీరమునకి, కూడ మాగన్ను వేసిన మనసునికి
ఆవురించిన జడమును ఒక్కసారిగ వదిలించి, వ్యతిరేక దిశలలో చేతులను విదిలించి
పుంజీల కొద్దీ గుంజీలు తీయించు కారణమది ఒక్కటే - తంత్రులలో ప్రవాహమే తేజము
కాలు కీలు కదలికే తొలి అడుగుకు నాంది, ఆ అడుగుల సంతర్పణమే చైతన్యమునకు పునాది
శ్రమను ఓర్చి పట్టుదలగా పునరుక్తిగా సలిపిన పనికి ఫలితమే పరమావధి
యుక్తికి శక్తిగా, ఉరుముకు మెరుపుగా, ఆ జోడులో పుట్టేను కోటి సూర్యుల కాంతి
సాధనలో మనసును శోధించుట ఎంతో, కదలికతో తనవును సాధించుట అంతే
వ్యర్ధమైన తనువులో మనలేదు అర్ధము, ఆరోగ్య సూత్రములే ఆలోచనలకు ఆలవాలము
ఆ తలపును తప్పక తలలో పెట్టుకోమని తలను తట్టుటే మొట్టికాయలోని ఆంతర్యము
No comments:
Post a Comment