నర-వానర మైత్రి
వంచుకున్న శిరసు వివరమేమి చూపించెనో
కదలకున్న చూపు తలపులేవి తెప్పించెనో
పెగలకున్న పలుకు శోకమేమి వినిపించెనో
బిగుసుకున్న దవడ కోపమేమి పలింకించెనో
అడిగినది తీర్చపోయి చేజార్చుకున్నదొకరు
అడుగులను అనుసరించక అందలము విడుచుకున్నది మరొకరు
కానిరాని దూరాలకు కంటివెలుగును కోల్పొయెనొకరు
కంటి ఎదుటే చెరనున్న సతిని చూడలేక మరొకరు
వెదుకులాట వేటలో నేర్పుకై ఒకరు
ఒంటరితనపు బతుకులో ఓదార్పుకై మరొకరు
వియోగము వేదికగా ఉమ్మడి ప్రణాళిక పుట్టె
వివాదము బాసటగా కదన కార్యాచరణ కదిలె
విరహము సమిధలుగా ప్రళయ ప్రణయాగ్ని రగిలె
విద్రోహము సమసిపోవగా విధ్వంసము రచన జరిగె
నెత్తురు పంచుకున్న వానితో రక్తములు ఓడు పోరు
కంచమును పంచుకున్న వానితో ప్రాణములు పెనగు పోరు
అడుగులు పంచుకున్న వానితో కట్ట కడపటి పోరు
మాటలు పంచుకున్న వానితో మోసమునకు వెనుదీయని పోరు
అన్న వెనక తమ్ముడు
అన్న ఎదుట తమ్ముడు
అన్నను అనుసరించు తమ్ముడు
అన్నను హతము చేయు తమ్ముడు
అన్న యోగ రక్షకుడు తమ్ముడు
అన్న కాల తక్షకుడు తమ్ముడు
అటు రామ-లక్ష్మణులు, ఇటు వాలి-సుగ్రీవులు
No comments:
Post a Comment