ఏది శక్తి?
చక్రాల కళ్ళతో చుట్టుతా వింతలను
చకిత వదనముతో చూసేటి పసి కందు
చిట్టి పిడికిళ్ళతో గాలి గుద్దులాటలో
గంటల పాటు గడప గలిగిన పసి గుండు
వెల్లికల పడుకుని కాళ్ళు కొట్టుకుంటున్నా
అడుగు ముందుకు పడని పసి బాటసారి
అర్ధమవని భాషతో ఆకట్టుకుంటూ
కబురులతో కట్టిపడేసే పసి మాటకారి
ఈ పసి తల్లి ఈ పసిడి తల్లి
తన చుట్టూ జగతిని గెలవడం అదీ శక్తే ఆదిశక్తే
కడగంటి తూపుతో ఛిద్రం చేయమంటున్న గుండె
వేయి కళ్ళతో వేచి చూస్తుంది
తీయ తేనియ పలకుతో పలకరించమంటున్న మది
ఒక్క మాటతో చాలు పులకరించిపోతుంది
మాట దేవుడెరుగు కనీసము కనపించమంటున్న ఆశ
సాక్షాత్కార కటాక్షము కోసము పడిగాపులు పడుతుంది
సాంద్రమైన కల్లోల కెరటాలతో సంద్రమైనా మనసు
సాంత్వనకు సహచర్యమును కాస్త ఇప్పించి పొమ్మంది
వయసులోని వనిత తారామండలమును మొత్తము
తన చుట్టూ తిప్పుకోగలగడం అదీ శక్తే ఆదిశక్తే
బాధ్యతల బరువును పంటి బిగువున మోస్తూ
కుటుంబము మొత్తము ఏక తాటిపై నడిచేలా చేస్తూ
మొగుడి ఈసడింపులు పిల్లల ఏవగింపులు
మనసు సున్నిత పొరలను తగలనీయకుండా చూస్తూ
తన కడుపుని కట్టుకుని అయినా
తన వారి కడుపులు నిండేలా చూసుకుంటూ
భేషుల శభాషులు భేషజాలకు దూరముగా
వేదన నుండి వేడుక దాక నిశ్శబ్దములో మనుగడ సాగిస్తూ
బ్రతుకు బండికి ఇంధనమైన గృహిణి
సంసారముని లాక్కెళ్ల గలగడం అదీ శక్తే ఆదిశక్తే
No comments:
Post a Comment