వినాయక చవితి

 స్వయం 


ఏ నవ మాసాల ఊయలూగి ఉప్పతిల్లావని నాడు

ఆ కడుపు చల్లంగ చూడలేదని తల్లడిల్లేవు నేడు?

ఊరేగి వచ్చు మగనికి ఎదురేగ ముస్తాబు ముఖ్యమనుకుని

తప్పటడుగుల తడబడు వేళ వేలిచ్చి నడిపించ తీరుబడే లేదని

చిట్టి చేతులలో చిన్న కర్ర పెట్టి బుడిబుడి అడుగులు వడివడిగ నేర్చుకొమ్మని

అదే అదనుగా వెళ్ళి వాకిలికి కావాలిగ ఉండమని చెప్పిపోయిన

ఆ తల్లి అండ లేదనా, తెగిన తలతో పడి ఉన్న నీవు తలపోసేవు?


ఏ ముద్దు మాటల మురిపెమున ముద్దు మూటల మునిగావని నాడు

ఆ బోసి నోటితో నీలకంఠుని నెదిరించి బతికి బట్టకట్టేవు నేడు?

తన కన్న పెద్దలను నిలదీయ మర్యాద కాదన్న పాఠములు చెప్ప

తన చిన్ని కండలతో కొండలను ఢీకొనుటలో వివేచనను తెలుప

హిత బోధలను జీవిత సత్యాలను కూడ కూర్చొనపెట్టుకుని నేర్పించ

లోక రీతులను లౌక్య వర్తననను అనుభవ ప్రమాణముగా ఎరిగింప

ఏ తండ్రి నీకు తెలిపాడనా, తెగిన తలలో తెగని ఆలోచనలతో సతమతమయ్యేవు?


దేవుడన్న మాటే కాని దైవికము నీకు దోచిపెట్టినది కాదు

వరపుత్రుడన్న ఊసే కాని పదవులు నీకు వారసత్వముగ రాలేదు

తల్లిదండ్రులు ఉద్దండులే కాని వారి తేజము నీకు వచ్చు తలరాత లేదు


బతుకు వేటలో నీ గమనము ఒంటరే గమ్యము ఒంటిదే

బతుకు బాటలో నీ నడక చిట్టిదే నీ నడత గట్టిదే

బతుకు పాటలో నీ రాగము అతిశయమే నీ రవము అనితరమే

No comments: