శ్రీరామ నవమి

 సంయోగం


రామాయణమును రక్తి కట్టించు క్షణమది
నరుడు వానరునితో జతకట్టు నిముషమది
విలువైనది కనపడక వెతుకుతున్న నరునికి
వేడకుండని వరము ఎదురుపడిన అబ్బురమది
చీకాకు చింతలతో విసిగి వేసారిన మదికి
అరాటమును తీర్చి ఊరటను ఇచ్చిన సమయమది
ఇల్లాలి అనురాగము తమ్ముళ్ళ ఆప్యాయతలే తెలిసిన మనసుకి
తొలిసారి స్నేహ మాధుర్యమును చవిచూపించిన తరుణమది
చెప్పకుండా వైకుంఠమును వీడి భువికి చేరిన హరిని
వెతుక్కుంటూ వచ్చి వెతికి పట్టుకున్న హరుని పంతమిది

మునుపు ఎన్నడూ కలవక పోయినా
మునుపు ఎన్నడో కలిసినట్టున్న భ్రాంతి
పోల్చుకోను ఆధారాలు లేకపోయినా
పోలికలో ఏదో మెరిసినట్టున కాంతి
జన్మతహా జాతుల భిన్నత్వమున్నా
ఆత్మలెన్నడో ఏకీకృతమైన ఆర్తి
వేష భూషలలో తేడాలు కన్నా
అంతర్వాహినిగా ఉన్న హరిహరుల అస్తి
ఎదురు పడిన మరు నిముషము
ఇరువురకూ ఏదో దక్కినట్టున్న ఆస్తి

ధనుర్బాణలు ధరియించిన తాపసికులు వీరులా? విరాగులా?
రాచ బాట వదలిన రాచరికులు యోగులా? వియోగులా?
విషణ్ణ వదనాల వర్తించు వీరలు చరులా? చారులా?

తమ్ముని నోటి వెంట అన్న గారి కీర్తి భాసిల్లెను
మంత్రి పలుకు వెంట రాజు గారి ప్రభ రాజిల్లెను
మాటల వెంబడి ఇరువురి అనుమానాలు సమసెను
బాటల వెంబడి ఇరువురి లక్ష్యాలు కలిసెను

వీరత్వమును చూప కొనగోటి వేలు వీలాయెను
స్నేహత్వమును చూప చక్కని నోటి మాట చాలాయెను

No comments: