యుగాది

జంత్రగాడు


 వెలిసిపోయిన నిన్నటి రంగులను మంచు కళ్ళాపుతో చెరిపేసి

రాబోయే రోజులను పగటి వెల్ల వాటుతో సిద్ధం చేసి

ఋతువుల పేరుతో వింత శోభలను వెలయిస్తూ

కాలాల పేరిట కొత్త చిత్రాలను ఆవిష్కరిస్తూ

మూడు నెలలకో ముచ్చటైన ముస్తాబు దిద్ది

వేషానికి తగిన విరుల సౌరభాలు అద్ది

చూపించిన మనోఙ్ఞతను మరల చూపకుండా

కంటి యెదుట కమనీయమును నిలువనీయకుండా

యేడాది పొడుగూతా వాడే గారడీ వస్తువులను

ఏ పెట్టెలో దాపెట్టుకుని వెలికితీస్తుందో ప్రకృతి!


కాల రాట్నపు చక్రమును ఒక చేత తిప్పుతూ

దూదిపింజల జీవితము నుండి అందమను దారమను తీసి

అర్ధముతో దానిని బ్రతుకు మగ్గములో పడుగుపేక చేసి

ప్రకృతి ప్రతి యేటా నేయు వర్ణ చిత్రాల వస్త్ర ప్రపంచములో

మెచ్చుకునేదా మునుపుపెన్నడూ కనని సౌందర్యము?

నేర్చుకునేదా ముగింపు లేదను ఆశావాద దృక్పథము?

తెలుసుకునేదా కలిమి లేముల కలివిడి సూత్రము?

ఏడు రంగులు ఆరు రుచుల ఉదాహరణలతో

నాలుగు కాలాలు చెప్పి పోవు జీవిత పాఠాలు

పది కాలాల పాటు పదిలంగా నిలిచిపోవా!

No comments: