శివరాత్రి

 జడము


మూడు కళ్ళూ మూసుకుని మౌని ముద్రలో కూర్చుని

చుట్టూ ఏమీ పట్టనట్టు ఏమిటా ఆలోచన త్రిలోచనా?

తరాల తరబడి యుగాల వెంబడి ఆత్మనే తరచుకుని

ఏ సమాధానము కోసము నీ అనంతమైన శోధన?

పరస్పర విరుద్ధాలతో ఏర్పరిచిన చరాచర జగత్తులో

ఏ పరిష్కారము కోసము నీ ఎడతెగని సాధన?

ప్రాణులకు నియమాల రాత రాసి ప్రకృతికి నియతి గిరి గీసి

కలుగ చేసుకోవలెనన్న కాంక్షను అతి కష్టముతో అణుచుకుంటూ

ప్రపంచమను ప్రయోగశాలలో సృష్టి అనే సృజనను చేసి

ఫలితము కోసము వేచి ఉంటున్నట్టు ఉంది నీ నిశ్చల రూపం


కల్పాల గాడిలో దొర్లుకుంటూ పోతున్న కాలచక్రములో

దేనిని దొరకపుచ్చుకునేందుకు ఆ ధ్యానము యోగీశ్వరా?

త్రికాలాలకు త్రికరణశుద్ధిగా సాక్షీభూతమై నిలిచి

మారుతున్న పాత్రలతో జరుగుతున్న జగన్నాటకమును

రాగభావ రహితముగా నిర్లిప్తతతో గమనిస్తూ

దరి చేర కోరిన వారికి అంతే దూరముగా

తెలుసుకో తలచిన వారికి అంతే దుర్లభముగా

తను బరిలోకి దిగక తన చెంతకు చేరనీయక

అర్ధమునకు ఆవల ఉండవలసిన ఈ ప్రయోగపు ప్రయోజనము

తుదిమొదళ్ళు తేల్చుకునేందుకు అన్నట్టు ఉంది నీ తపో తత్వం


సృష్టితో మొదలు కాలమునకు కదలవలెన్న సంకేతము

సమయమునే స్వాగతించు వేళ ఏల నీ మౌనము మునిపుంగవా?

ప్రతి ప్రారంభముతో మరల మొదలు కొత్త పాత్రలతో నూత్న పరిచయము

ఆసక్తికర మలుపులతో ఆట రక్తి కడుతోందనుకున్న మరు నిముషములో

కాలాతీతమంటూ జరుగుతున్న కథను మధ్యలో ఆపేసి ఉన్న పాత్రలను ఉత్తినే తరిమేసి

రంగస్థలమునును తిరిగి సరికొత్త బొమ్మలను నింపి పాత్రలను పరిచయము చేసే

ఈ అనాది వేదిక పైన అంతు తెలియని కథలు ఎన్ని చూసి ఉంటావో!

ఏ కథ మీద ఆసక్తి పడక ఏ పాత్ర మీద అనురక్తి పెంచుకోక

కాల ప్రవాహములో కరిగిపోయే మట్టి బొమ్మలు చెప్పే కట్టు కథలు

చిద్విలాసముగా మరో మారు చూద్దాము అన్నట్టు ఉంది నీ మౌన ముద్ర

No comments: