పునః
మూడేళ్ళ పైబడి మానవకోటి కొట్టుమిట్టులాడింది
కంటపడని దానితో కునుకుపడని యుద్ధంలో సతమతమయ్యింది
ప్రాణాధారమైన ప్రాణవాయువే తిరగబడి ప్రాణాంతకమయ్యింది
సమాజానికి మూలస్తంభమనుకున్న సహజీవనమే ప్రశ్నార్ధకమయ్యింది
మనిషి మనుగడకే ముప్పు తెచ్చిన తప్పు ప్రకృతి ప్రవర్తనదా?
నిక్షిప్తమైన శక్తులను వశము చేసుకోవెలనన్న మనిషి అత్యుత్సాహానిదా?
గుహల నాటి నుండి మనిషి శోధన ఆగలేదు తపన తీరలేదు
చేజిక్కిన దానితో చల్లబడి బతుకు బాటలో గమనమాపలేదు
ఎన్ని దక్కినా ఇంకేదో అందిపుచ్చుకోవాలన్న ఆరాటము
ఎదురుపడే ఆటంకముల మీద వెన్నుచూపని పోరాటము
కాలగతిలో కుతూహలమే మానవాళికి మహామంత్రము
పురోగతిలో తప్పటడుగులే మనిషి జీవన విధానము
పనికి అంది వచ్చే ఊసు తప్ప ప్రకృతిలో మంచి చెడులకు తావు లేదు
విధ్వంసము చేయగల పరమాణువే వెలుగునీనే కాంతులు పంచగలదు
జాతులను మాపగల సూక్ష్మ క్రిములే జీవ క్రియలకు కారణము కాగలవు
పట్టు తేడాలో చిన్న పనిముట్టే మారణాయుధముగా రూపు మార్చగలదు
ప్రకృతి ఇచ్చేది ప్రసాదాలూ వరాలు కావు, కేవలము పరికరాలు - వివేచనను బట్టి వృద్ధికో, వినాశనానికో!
తలలు తెగ్గొట్టి నెత్తుటి యేరులు పారించి నేలను మరుభూమిగా మార్చడమా?
అదే నేలను నమ్ముకుని నీళ్ళని పారించి భూమిని భోజన పాత్రగా అమర్చడమా?
ప్రగతి అన్నది సులభమైన సమాధానాల పూదారి కాదు
అది అడుగడుగునా అడ్డుపడే చిక్కు ప్రశ్నల రాదారి - సహనమును బట్టి సాగిపోవుటో, సమసిపోవుటో!
No comments:
Post a Comment