వినాయక చవితి

శివ కుటుంబం


వింత పరివారమిది...

ప్రాణసముడగు పతిపై నిందలను పడలేక
గుండె మంటల రోషాగ్నిలో తనువును త్యజించి
బూది భూషణుడి లేపనముగ మారె ప్రాణప్రదమగు ప్రియ సతి
జన్మ మారినా వేరుగా మనలేక
యోగినిగా మారి తాపసిని ప్రసన్ను చేసికొని
ఇక విడివడని విధముగ శరీరముననే సగమాయె పంతముతో పార్వతి

విషయ వాంఛలంటని విధముగ విరాగి వేష భూషలు
అర్ధనిమీలితపు ఏమరుపాటును సదా కాచుకొను ముక్కంటి మూడో కన్ను
పాశములకు పట్టుబడని రాగములకు కట్టుబడని కపర్ది విపరీత చర్యలు
అయినా... బంధములకు అతీతుడయినా తల మీద తెచ్చుకున్న మూడు ముళ్ళ బంధము
అనురాగములకు ఆమడననున్నా అర్ధాంగికి సమర్పించిన తనువులోని సగము
ఇక ఇచ్చినా వరాలనెన్న భక్తుల ఈప్సిత సముద్రమున తల మునకలు తప్పదన్నా!

పిల్లలిద్దరి జన్మ మూలము ఆత్మీయ సంయోజనము కాదు అసుర సంహారము
అభ్యంగనమున నలుగు పిండి నుండి రూపు దిద్దుకున్నవాడు ఒకడు
అభ్యంతరకరమై రేతస్సు బరువు నుండి ఉసురుపోసుకున్నది మరి ఒకడు
తండ్రి మీదకనే కత్తి దూసి తలను తెంచుకున్నవాడు ఒకడు
తల్లి పాల కోసము తల్లడిల్లి తలలు పెంచుకున్నవాడు మరి ఒకడు
గట్టివాడయినా పొట్టివాడు ఒకడు తెంపరి వాడయినా అన్నతో తంపుల వాడు మరి ఒకడు

విలక్షణతయే వీరి వేడుక లేమితనముతోనే వీరితో చేరిక
వీరిని వేడుటకై వ్రతాల నోముల పని లేదు పిలిచే పిలుపులో ఆర్తి తప్ప
వీరిని కొలుచుటకై హోమ ద్రవ్యాల పని పడదు గరిక పరికలతో జరుగుబాటు తప్ప
వీరిని పూజించ వేద మంత్రాల అవసరము రాదు పలుకు తేనియ పంచాక్షరి తప్ప
వీరినెరిగిన వారికి స్వర్గ సౌఖ్యముల ఆశ ఉండదు అనంతుడిలో ఐక్యత తప్ప

వింత పరివారమిది... శక్తి స్వరూపులమన్న స్పృహేలేని సామాన్య శివ కుటుంబమిది

No comments: