యుగాది

అనాది


గుండ్రముగా ఉన్న కారణానికి దివారాత్రాలూ
ఓపక్క ఒరిగిఉన్న మాత్రానికి కాలచక్రాలూ
భ్రమణ నియమాలు తెచ్చిన చీకటి వెలుగులూ
వెచ్చని వుండతో వచ్చిన ఋతువుల విశేషాలూ
ఇవి ఎవరి ప్రోద్బలము అక్కరలేని ప్రాకృతిక దశదిశలు

చలిలో చుట్టెవరూ చూడటంలేదను ధైర్యంతో
ఆలవోకగా జాలువార్చిన ఆకుల అచ్ఛాదనను
వసంతుని అలికిడి గాలివాలుగా చెవికి సోకినంతనే
తలిరాకు తువ్వాలుగా గబగబా చుట్టేసుకున్న తొందర
ఇది ఎవరి ప్రమేయమూ లేకనే ప్రకృతికి ఏర్పడిన సిగ్గు దొంతర

రెండో మారు చూపుకు నోచుకోని అందముతో
గొంతు సవరించుకున్న చెవి కోసుకోను కంఠముతో
చిటారు కొమ్మన దాగి ఎవరి కంటా పడని సిగ్గుతో
వగరు చిగురు నుండి తియ్యందనము తీసిన కోయిల
ఇది ఎవరి శిక్షణ లేకనే ప్రకృతి వెలువరించిన గాన కోవిద

చేదు రుచికి ఔషధ గుణములనిచ్చి
చవులూరు తీపిని నిషిద్దమని నిర్ణయించి
వగరు పులుపులకు నిరోధక శక్తులను పంచి
ఊరించు ఉప్పును ఉదధి అడుగున దాచి
షడ్రుచుల సమతుల్యముగా ఏర్పరిచిన ఆహార పద్ధతి
ఆరోగ్య పరముగా ప్రకృతి రూపొందించిన నియమావళి

కొత్త కోక కట్టినా కొత్త పూత పట్టినా
కానరాని కోకిల పాత కూతే కంఠతా పెట్టినా
వైవిధ్యమనుచు జిహ్వ ఎట్టి రుచులకైన లొట్టలు వేసినా
ప్రకృతి పరిచిన బాటనే మానావాళికి ఉపాధి
సాలుకొక మారు మాత్రమే విచ్చేయు పర్వము కాదీ ఉగాది

No comments: