నవరాత్రి

ఆయుధ పూజ


కొండలను పిండి చేయగల కండలతో
మేను మేరు నగమల్లే మెరవడమేనా బలము?
అడుగు పడిన మేర అవని అదిరిపడే
కరి అరికాలు కన్న మించి లేదా భూమిలో బలము?

అడుగు బెసకక బిగువు సడలక పట్టు విడవక
వంచిన తల ఎత్తక నెత్తిన వేల రెట్ల బరువును
దినచర్యగా సుదూరాలకు తరలించుకునిపోవు చీమ
చేతలలో చూపించును శక్తికి నూత్న నిర్వచనం

సాధించుటకు వలసినది సంపత్తి కాదు
సాధనకు అవసరమైనది సంకల్పము

ఆహారము సంహార సమాహారముగా
పొందు పరచబడిన జగతి నియతిలో
ఏమాత్రమైన ఏమరుపాటున నున్నా
పక్క జీవికి అన్న హితవయిపోయే
దాక్షిణ్యములేని జీవన ప్రణాలికలో
నెమ్మదితనమునకు చోటేది? సాధు వర్తనకు మనుగడేది?

పోరాటమో పలాయనమో పరిఢవిల్లే ప్రపంచములో
బ్రతుకుకు నిత్యావసరాలు వేగము క్రౌర్యములు కావు
అట్లైన దూరమును వేగముతో ఆకలిని క్రౌర్యముతో హరించు చిరుత
అందుకోవలసినది చిరంజీవిగా మిగిలిపోయిన ఘనత
అటుల కాక అప్రమత్తతో అడుగులు వేయు కూర్మము
గడిపేను ప్రమాదపు పొడ పడని నిండు నూరేళ్ళ జీవితము

ఆపదలు పొంచి ఉన్న చోట మనుగడకు మూల మంత్రము
సకలమూ హరించు శక్తి కాదు ఒళ్ళు దగ్గరుంచుకొను యుక్తి

పట్టు విడవని తనమే శక్తి తగిన అడుగు ఎంచుకోవడమే యుక్తి
ఎంత సంధించినా సమసిపోని ఈ సమితిని స్మరించుకొనుటే అయుధ పూజ

No comments: