శివరాత్రి

అందునన్ - నన్

పంచభూతాల తత్వమా నీ పంచాక్షరీ మంత్రము?
నిర్వాణము నుండి నిలువరించే కామితమును
ఙ్ఞానజ్యోతిలో రగిలించుటేనా అగ్ని చలనము?
జగతిలో ప్రతిధ్వనించు ప్రణవ నాదము
జటలుగా విస్తరించుటేనా వ్యోమ విశేషము?
ఊపిరుల ఆధారమైన జీవనా మూలము
యొగ ముద్రలో నియతించినదా వాయు పీడనము?
విశృంఖలముగా తాండవము చేయు తలపులను
తలలోన వొడిసి పట్టినిదా ఆపః స్తంభము?
రాగములను పరిత్యజయించిన బూది లేపనమున
వైరాగ్యమును ప్రతిబింబించుటా పృథ్వి తనము?

గ్రహాలూ తారలూ పాలపుంతలూ
లెక్కకందని అంతరిక్ష గవాక్షాలలో
నేలపై నీటిలో నింగిలో
వియన్మండలిన విస్త్రరించిన వివిధ వేదికలలో
మనుషులూ మెకములు అగోచరాలూ
ప్రాణ శక్తి పంచుకున్న భిన్న భూమికలలో
స్ఫూర్తిగా మూర్తిగా తలంపుగా
సృష్టిలో నీ భావము సంతరించుకున్న సృజనను
భక్తితో ఆర్తితో అనురక్తితో
ఏ రీతిలో నిన్ను తెలుసుకోగలము మేము?

No comments: