శివరాత్రి


కిమ్మన్నాస్తి

నీకు తెలిసేనా?
అనంతములో ఒక మారుమూల
ఏర్పరిచిన ఒక కుటుంబములో
వేడిమికి వలసినంత దూరంలో
వెలుగు దేవుడికి పొర్లు దండాలు పెడుతూ 
చుట్టుపక్కల చుట్టపక్కాల పొడలేని
ఒక చిన్న గోళము మీద
చారడేసి కన్నులతో నీ చిద్విలాసమును
చూచి తరించు మనుషులు
ఉంటిరన్న సంగతి అసలు నీకు తెలిసేనా?

నీకు చేరేనా?
వేర్వేరు జాతుల వింత రీతుల
నిను తెలుసుకోగోరు విధములు
వైరుద్ధ్యముల వలల చిక్కి
కొట్టిమిట్టాడుతున్న సంగతి
కటిక చీకటిలో చిన్న బిడ్డ
కన్న తల్లి కోసం పరితపించు రీతిన
రోదనలను స్త్రోత్రములను చేసి
ప్రయాసలను పూజలను చేసి
ఎలుగెత్తిన వేన వేల గొంతుల ఆర్తి
అనంత నీరవములో నీవరకు చేరేనా?

నీకు చెందేనా?
సృజించిన వాటి నుండి బహుదూరముగా
వాటి దైనిందినములకు అతీతముగా
కలవో కలవో అన్న ద్వంద్వమును కల్పించు
నీ అంటిముట్టని అస్తిత్వము
అర్ధము చేసుకో శక్యములేక
ఉపచారములతో ఉపవాసములతో
నీ సృష్టిని నీకే అర్పించి
నిను మెప్పించుకొను వృధా ప్రయాసలు
నీవెవరో తెలియకపోయినా అవి నీకు చెందేనా?

No comments: