ఉగాది

ఆద్యంతం


పరిభ్రమణ మంత్రం పఠిస్తూ భూమి
మార్తాండుడికి మరో పొర్లుదండం పెట్టి
మొదలెట్టిన చోటుకే వచ్చి నిలిచింది
తొక్కుడుబిళ్ళ తైతక్కలాడి సమయము
రాసుల పదిరెండు గడులు చక్కబెట్టుకుని
మరో ఆటకు ఇటుపక్కకు చెంగున తిరిగింది
ముదురు పచ్చకోక మీద పరాకు పుట్టినట్టు ప్రకృతి
ఉన్న అచ్ఛాదనమును విసర్జించి వివస్త్రగా ఉండి
వసంతుడు ఎప్పుడూ తెచ్చు లేత ఆకుపచ్చపై మరోమారు మనసు పడింది
ఈ తిరుగుళ్ళూ తిప్పుళ్ళూ తెగుళ్ళూ ఎప్పుడూ ఉన్నవే - అవి ఆద్యంతరహితాలే

పక్క వాడి పెరడులో మామిడి మండలు కోసుకొచ్చి
కాంక్రీటు కీకారణ్యంలో వేప పువ్వు సాధించుకు తెచ్చి
జవచచ్చిన జిహ్వకు జివ్వుమనే షడ్రుచులతో సేదను తీర్చి
ఈ సారి పండగను కూడ అవుననిపించాడు
కందాయ ఫలాలు మొత్తం వినే ఓపిక లేక
ఆదాయ వ్యయల వివారలు మటుకు చాలనుకుని
ఏ కాస్త లెక్క తప్పినా ఏ మూల తేడా కొట్టినా
ఈ మూఢ నమ్మకాలకిక శలవంటూ క్రమం తప్పక భీష్మ ప్రతిన పూనుతాడు
ఏడాది పొడుగుతా వినిపించకపోయినా ఈ వేళలో మాత్రం కోకిల కూయపోతే?
ఈ కాలంలో బాల్యంలో బళ్ళ మీదనించి లాగి కోరికిన చెరుకు గడలు ఈ సారి కనుమరుగైతే?
పక్క వీధిలో శివాలయంలోంచి పంతులిగారి పంచాంగ శ్రవణం ఏ కారణానో మూగపోతే?

శ్రమ పెట్టినా ఆ కాలి నెప్పులు సంతోషాన్నిస్తాయి
కష్టం కలిగినా ఆ కాకి లెక్కలూ ఊరడింపునిస్తాయి
గమనించకపోయినా ఆ కొండ గుర్తులు కొనసాగింపుకు సంకేతాలవుతాయి
ఈ తిరుగుళ్ళూ తిప్పుళ్ళూ తెగుళ్ళూ కుడా ఎప్పుడూ ఉన్నవే - ఇవీ ఆద్యంతరహితాలే

No comments: