నవరాత్రి

కిం కర్తవ్యం?

కాలం అజేయం
విధి బలీయం
రెండూ కలిసిన కర్మ 
అవశ్య ప్రాప్యం
తప్పని తగులాటం

అవునా? అంతేనా?
కర్మ తప్పించుకోలేని జాలమా?
దారి తెన్నూ పాలేపోని శున్యమా?
దరీ పొంతూ కానరాని యోజనమా?

తత్వము శలవిచ్చినట్టు
జన్మ కర్మ పరిపక్వత కోసమే ఐతే
అసలు అడుసులో అడుగు పెట్టుట ఎందుకు?
అంటిన దానిని ఒక్క ఉదుటున పోగొట్టుకోలేక
జన్మజన్మల పారిశుద్ధ్య చర్యలెందుకు?

బ్రతుకు తాడు తిప్పిన బొంగరమే ఐతే
విసిరి కొట్టేవాడెవిడిదో వినోదమే ఐతే
ఈ ఆరాటాలెందుకూ? ఉబలాటాలెందుకూ?
ఝంఝాటాలెందుకూ? జీవన వేదాలెందుకూ?
ఏ ఆటనైనా పోరాటాననైనా 
పట్టింపులూ పట్టుదలలూ 
ప్రాణం పణం పెట్టి ఆడే ఆటగాడికా? 
లేక చెప్పినట్టు కదిలే కీలుబొమ్మలకా?

లేదు, అది కాదు, అలా కాకూడదు
కర్మల కాకి లెక్కలు 
కట్టె కాలిన కనుమే కాని
కాలు కదిపే కారణము కారాదు
జీవితాన పరమార్ధము ప్రయత్నమే
పుట్టిన క్షణమున పెట్టిన పొలికేక మొదలు
చివరి నిముషాన తుది శ్వాసకు నెరుపు సమరము వరకు
బ్రతుకు బేరీజు పడిన అడుగుల లెక్కలోనే కాని
తత్వము తర్కించిపోవు మీనమేషాలలో కావు

వారు దేవతలు దేవుళ్ళు
కాలానికీ మరణానికీ ఆమడ దూరము నున్న వారు
కర్మ వాసనలకీ విధి ఆటుపోట్లకీ అతీతమైన వారు
ఐనా అడుగడుగునా కధకధనా అస్థిత్వము కోసము
చెడు చీడ వదిలించు నెపముతో నిత్య ఘర్షణే
ధర్మ ప్రతిష్ఠాపన పేరుతో నిత్య సంఘర్షణే
మరి జన్మ కర్మ పంకిలపు ప్రక్షాళణకే ఐతే
కర్మ తడే తగలని అనిమేషులకి ఈ ఆహవాల ఆపసోపాలెందుకు?

కర్మ కన్నా ఉత్కృష్టమైనది క్రియ
కార్యానికి కారణము కర్మైతే
ఆ కర్మకు సిద్ధిత్వమే ఈ క్రియ
ఇదే జీవిత చక్రము
ఇదే నిత్య సత్యము
కర్మ ధ్యేయమైతే క్రియ ధీత్వము
ఈ నరనారాయణులు నడిపించు బాటలోనే
బ్రతుకు సాఫల్యము జన్మ సార్ధక్యము

కిం కర్తవ్యమా? అడుగు, అడుగే.
అడుగు, ఎందుకు అని.
అడుగు, ఎందాకా అని.

No comments: