శ్రీ రామ నవమి


వియోగము


జరిగిన ఉదంతానికి ఉమెత్త ఉలుకులేక ఉన్నమాటున
గడిచిన దురంతము పాలుపోక ఉడత చేష్టలుడిగి చూస్తున్న చోటున  
రెప్ప పాటులో మెరపు తీగలా సీత నింగిదారి పట్టె
కమ్ముకొస్తున్న కారుమబ్బులా దశకంఠు రధము తరుముకునిపోయె
గాలి భీతిల్లి స్థంబించె నేల మ్రాంపడి మిన్నకుండె

అందెల రవళితో రింగుమన్న తపోవాకిటన
ఎండుటాకుల చిటుకుల స్మశాన మృత్యుఘోషా కదంబం
చెట్లపాదుల నీటి గలగల కేరింతల బదులుగ
చెక్కలై పడిఉన్న కుండవ్రక్కలో ఊయలూగుతున్న కన్నీటి కెరటం
శుకపికల చుట్టపక్కాలతో పెళ్ళి పందిరిని తలపించు పర్ణశాల
నిలిచె పాడె ఊరేగింపు పిదప మొండిగా నిలిచిన మరణవాకిలిగ

కంటి ఎదుట దృశ్యము బుద్ధి తర్కించలేదు
బుద్ధి ఎంచు కీడు మాట పలకించలేదు
మాట పెకిలించిన భావము మనసు ఒప్పుకోలేదు
మనసు స్థాపించిన సత్యము మనిషి భరియింపలేడు
నిర్జీవమైన స్థలిని చూసి నిర్వీర్యుడయ్యె సీతాపతి

కోరిక వెలిబుచ్చిన వైదేహి మీదనో
వదినను వదిలొచ్చిన సౌమిత్రి మీదనో
పన్నాగము పన్నిన హరిణము మీదనో
మోసమును కనలేని పరిణితి మీదనో 
కానలకు పంపిన కైక మీదనో
తొలుత మాట ఇచ్చిన ముదుసలి తండ్రి మీదనో
అది ఆవేశమో, ఆక్రోశమో, క్రోధమో, కోపమో, బాధో, వ్యధో
పెల్లుబిక్కెనా స్వరకుహరాన దిక్కులు పిక్కటిల్లు పొలికేక

No comments: