దీపావళి


In what is probably the ultimate irony in mythology, Narakasura is born to Lord Vishnu, the nemesis of rakshasas, and Bhoodevi, the epitome of forgiving. And in what is also the ultimate in role reversal, the slaying of Narakasura is at the hands of his mother, the personification of patience, after his father, the regular executioner-in-chief, refuses to lift his arms against his son.

తిరగబడి

పురిటి పయనపు ప్రయాసలో అలసి
పొత్తిళ్ళలో పవ్వళించిన పాపాయిని
పితృవాత్సల్యమున ఎదకు పొదువుకుని
రక్తమాంసముల మరకలు పూర్తిగా చెరిగి
పోలికలు తేటపడని పసి మోము మీది
నుదుట రాతను చదివి నిశ్చేష్టుడైన నిముషాన
తను లోక కళ్యాణమునకు లోక కంటకుల తొలగించు తోటమాలియా?
కన్న కొడుకుని సైతము కాటికంపించే కరకు కసాయియా?

గుండె మీద గుదిబండలెన్నో మోసి
పంటి బిగువున కార్చిచ్చులెన్నో ఓర్చి
బడబాగ్నులను పెను ఉప్పెనలను సయిచి
ఓరిమితో కూరిమి చేసుకున్న ధరణి
తన కడుపు పంటే ఎందరో గుండెల మంట
అగునన్న నిర్దయ విధి విధానమును
ఏ పెద్ద మనసు చేసుకు అంగీకరింపగలదు?
ఏ ప్రాప్త కాలఙ్ఞమునతో మిన్నకుండగలదు?

యుద్ధ రంగమున ఎదుట నిలిచిన వైరి
కన్న కొడుకన్న సంగతి ఙ్ఞప్తికి తెచ్చి
పిల్ల చేష్టలను దండించ చేతులు రాని
ప్రేమ పాశమున పడ్డ పిచ్చి తండ్రిని చేసి
స్థిత ప్రఙ్ఞ మదిన అస్థిరతను రేపి
అస్త్ర సన్యాసమే శరణ్యమని తలపించి
క్రమ శిక్షణా బాధ్యతను పక్కకు పడదోసి
పితృ హృదయాన మాతృత్వమును మొలిపించె

సంతు బాగుపడకున్నా సంతసించు తల్లి
ఊరికి చెరుపు చేసిన ఊరకుండునా మరి
తనను ఎదన తన్నినా మురిసిపోయే మాత
పతిని పల్లెత్తు పలికిన కన్నెర్ర చేయకుండదా
పెంపు చేయువాడే కొడుకు చేదాటెనని వగచితే
సకలమూ భరియించు పాత్రలో సమస్యను చేదీసుకోదా
తంతు నడపవలసిన తండ్రే ఓ మూల పడిఉంటే
భర్త భూమికను తను సమర్ధతతో నెరపకుండదా

No comments: