ఇతి
అస్థిత్వమునకు అర్ధము కల్పించి చాటుకు చేరి చోద్యము చూసేవు
అణు పరిమాణము నుండి అనంతము వరకు నీ లీలా వినోదము
సాగు చరితకు సాక్షిభూతవు పక్షపాతమెరుగని సమవర్తివీవు
నీ విశ్వరూపమును తలపోయ తెలివికి తర్కము కాదు
అర్ధమునకు అందినట్టే అంది అంతలోనే నిగూఢమైపోతావు
జీవిత చక్రానికి బాటనీవు బ్రతుకు గమనానికి బాసట నీవు
వ్యక్తివో వస్తువువో వ్యవస్థవో భావనా మాత్రవో
నీ నిజరూపమందున సంశయమున్నా నీ ప్రభావము నిర్వివాదాంశమన్నా
భగవంతుడంటే నీవేనా, కొలమానము లేని కాలమా?
లిప్తపాటు ఒక జీవిత కాలము కొన్ని జీవాలకు
ఆరుపదుల వయసు పూర్ణ ఆయుష్షు కొన్ని జీవితాలకు
ఈ సాపేక్షతలో సాఫల్యమునకు పరిపతించు ప్రయత్నాలలో
మనుగడకు మూలమైన ముడిసరుకు స్వరూపము లేని సమయము
క్షణముగా విభజించినా కల్పముగా కూడించినా
పూర్ణమదః పూర్ణమిదే ఉన్నదిదే లేనిదిదే
కాల తాళజతికి చిందాడు కాలాల అభినయ రీతులు
కాల ఘంటికా నాదానికి స్పందించు హృదయ ప్రకంపనలు (to the toll of time resonates the beat of the heart)
పుట్టినరోజులూ పండుగలూ ఉగాదులూ ఉషస్సులూ వేడుకలూ వీడ్కోళ్ళూ
కాలంలో ప్రతి మజిలీ ఒక పండగే సమయంలో అడుగడుగూ ఒక సంబరమే
No comments:
Post a Comment