నవరాత్రి

కోహం (నేనెవరు)?


ఏ రూపమున ఒదిగితివో
ఏ బాధ్యతను నెరపితివో
ఏ  రీతిన బడసితివో
ఏ నీతికి బలియయితివో
నీకైనా తెలుసునా ఓ ప్రాణ శక్తీ?
సృష్టి స్థితి లయలు ఏర్పరిచేవు
గుణ గణ తేడాలు అమరించేవు
సమతుల్యముల సమస్యలు వచ్చెనేని
నిక్కచ్చిగా నిన్నే నీవు భాగించేవు
మాతృహృదయమై సమస్తమూ సృష్టించి
మరణమూర్తియై నిఖిలమూ నిర్జించేవు

కడు వింతైన వర్తన నీది
తలరాతలు నీ చెప్పు చేతల ఉంటే
చెడును అసలు ఆటలో చొరనీయుటెందుకు?
విధి నీ కనుసన్నల మెలిగుతుంటే
వివిధమైన వికృతమును ప్రోత్సహించుటెందుకు?
సంకల్ప శాసనములు నీ లీలా వినోదములు
నిర్మాణ నాశనములు నీ క్రియా విశేషములు
ఆ లెక్కన మంచి చెడులు నీ రెండు చేతులు
నిత్య ఘర్షణ నీ గుండె చప్పుడు
చరాచరమును కదిలించు ఈ చేష్టలు
నీకైనా తెలుసునా ఓ ప్రాణ శక్తి?

No comments: