K Balachander



పిపాసి

తన మృతికి జరుగుతున్న ఈ జాతర - ఈ శ్రద్ధాంజలులూ, ఈ సంస్మరణలూ, ఈ కన్నీళ్ళు, ఈ కౌగిలింతలూ, ఈ బావురు మనడాలూ, ఈ గుండెలు బాదుకోవడాలూ - చూసుంటే బహుశా బాలచందెర్ చితి మీద నించి లేచొచ్చి ఒక గణేష్ పాత్రో ఘాటు మాటతోనో, ఒక ఆత్రేయ విసురు పాటతోనో (అదీ విశ్వనాధన్ స్వరంలో), ఈ లోకాన్ని మళ్ళీ తనదైన బాణీలో చెంప చెళ్ళుమనిపించో, ఆవేశంగా కడిగిపారేశో ఉండేవాడు. గుండె లేని వాడు కాదు బాలచందెర్, గుండె దిటవు చేసుకున్నవాడు అతను. కన్నీళ్ళు రాని వాడు కాదు బాలచందెర్, అవి కేవలం గుండె మంటలు ఆర్పుకోవడం కోసం కళ్ళ బావుల్లోతుల్లో ఎక్కడో భద్రంగా దాచుకున్నవాడు అతను. మనసు లేని వాడు కాదు బాలచందెర్, ప్రయోజనం లేని పనులకు మనసుని అనవసరంగా అడ్డం పెట్టుకునే వాడు కాదు అయన. బాలచందెర్ అనగానే ముందుగా గుర్తొచ్చేది విషాదాంతాలే. తన చలనచిత్ర జీవితంలో అద్భుత దర్శకుడు, హృద్యమైన కధకుడుతో తో పాటు సేడిస్టూ, మేసోకిస్టూ, రాక్షసుడు, మనసు లేని వాడు, మానవత్వం అంటే నమ్మకం లేని వాడు వగైరా బిరుదులన్నీ మూటకట్టుకుని ఆ బరువుని తన జీవిత కాలం భరిస్తూ వచ్చాడు బాలచందెర్. ఎందుకండీ మీకు మనుషలంటే అంత కసి, ఎందుకు ఆడదాన్ని సుఖంగా శుభం సీనును చూడనివ్వరు, ఇది కధే (ఇది కధ కాదు అని మీరు ఎంత అన్నా), ఇది కల్పితమే, వాళ్ళు నటులే, అవి పాత్రలే అయినా, చివర దాకా కష్టాల్లో ఈడ్చి, ఉతికి ఆరేసి, అగ్ని పునీతులను చేసి ఆ చివరలో  వాళ్ళ జీవితల్ని సశేషాలుగా, కొండకచో, అవశేషులుగా, మరికొన్ని చోట్ల కీర్తిశేషుల్ని చేసేయాలన్న కుతి, దుగ్ధ మీకు ఎందుకు సార్. దానికి చిరునవ్వే సమాధనం, తదుపరి చిత్రంలో పాత్రలని తిరిగి రాచి రంపాన పెట్టడం... థియేటర్ బయటికి వస్తూ కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ, నోరారా (దర్శకుడి మీద) తిట్ల దండకం అందుకుంటూ ప్రేక్షకులు మరిచిపోయే చిన్న విషయం ఒకటుందిక్కడ - ఒక పాత్ర ఏ మాత్రం కష్టపడినా కూడా (ఇది కధని తెలిసీ, ఇది సినిమా అని తెలిసి కూడా) విలవిలలాడిపోయే విధంగా ప్రేక్షకులు స్పందించే స్థాయికి ఆ పాత్రని పండించే ఆ కధకుడి చాతుర్యం, ఆ దర్శకుడి కధనం ఆ సానుభూతి కింద చితికిపోతాయి, ఆ ద్వేషం లో దగ్ధమయిపోతాయి. ఆ తిట్లన్నీ ఒక విధంగా అతనికి జరిగే నిందాస్తుతులే. ఇన్ని నిందాస్తుతులను కూడగట్టుకున్న దర్శకుడు (కధకుడి పరంగా O Henry తరువాత) చలనచిత్ర చరిత్రలో ఖచ్చితంగా ఇంకొకరు ఉండిఉండరు!

జీవితాన్ని మరపించేదే సినిమా - ఊహలోకాల్లో విహరిస్తూ, సప్తవర్ణాల్లో కలలను పంచుతూ, ప్రేమలే సమస్యలుగా వాటికి పెళ్ళిల్లే పరిష్కారాలుగా, చివరికి బలవంతపు నవ్వుల గ్రూపు ఫొటోతో సుఖాంతమయ్యేదే అసలైన సినిమా, అన్న వాదన ఒక వైపు. జీవితాన్ని ప్రతిబింబించేదే సినిమా - ఇక్కడ బ్రతుకులు ఉంటాయి, గెలుపుల పిలుపుల కన్నా, ఓటముల వెక్కరింతలే ఎక్కువ, సుఖాల పూలపానుపుల కన్నా, సమస్యల ముళ్ళ బాటలు ఎక్కువ, అర్ధవంతంగా ముగిసే కధల కన్నా, అర్ధాంతరంగా ఆగిపోయే సందర్భాలే ఎక్కువ, అన్న వాదన ఇంకోవైపు. డబ్బులు పెట్టుకుని వెళ్ళి జీవితంలో పడే కష్టాలే మళ్ళీ వెండి తెర మీద ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి అన్న వినోదవాదుల ప్రశ్నకు, బాలచందర్ ఇచ్చే జవాబు చాలా చిన్నది - కళ్ళు మూసేసుకున్నంత మాత్రాన సమస్యలు వదిలిపోవు, కల కరిగిపోయిన తరువాత కళ్ళు తెరిచిచూడాల్సింది మళ్ళీ జీవితాన్నే. మూడు గంటలు పాటు ఒళ్ళు మరిచిపోయేట్టు చేసే మత్తు మందు, మాదక ద్రవ్యం కాదు సినిమా. ఈ మాధ్యమానికి ఒక బాధ్యత ఉంది, దానికి ప్రేక్షకుల సమయాన్ని, వాళ్ళ తెలివితేటలని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఙ్ఞానానికి పరమార్ధం ఏమిటి? ప్రపచంలో ఉన్న విఙ్ఞానం అంతా ఔపోసన పట్టేసినందువల్ల ప్రయోజనం ఏమిటి? ఈ ప్రశ్నలకూ సినిమా పరమార్ధానికి దగ్గర సంబంధం ఉంది. వీటన్నిటికీ ఒకటే జవాబు. ఇవి అన్నీ మనిషిలో సహానుభూతి(empathy) రేకెత్తించాలి. అంతే. ఙ్ఞానం వివేకవంతుడిలో ఆలోచన కలిగించాలి, మార్చగలిగిన వాటిని మార్చే ప్రయత్నం చేయించాలి. పరిష్కారంలేని చోట సహానుభూతి (సానుభూతి కాదు) కలిగించాలి. సినిమా ఉద్దేశం కూడా ఇదే. సినిమా కష్టాలు అందరికీ ఉండవు. మొగుడు వదిలేసిన వదిన పిల్లలు, పెద్ద చదువులకు వచ్చిన తమ్ముడు, పెళ్ళికి ఎదిగిన చెల్లెలు, జబ్బుతో తల్లి, చుట్టపుచూపుగా వచ్చిపోయే తాగుబోతు అన్నయ్య, ఈ బరువులన్నీ మోసే రెక్కలు ఆ ఇంటి మొత్తం మీద ఒక్కరివే. ఇలా కట్టకట్టుకున్నట్టు అన్నీ ఒకే చోట నిజజీవితంలో ఉండచ్చు ఉండకపోవచ్చు. కాని తెర మీద ఆ పరిస్థితులు చూసినప్పుడు ప్రేక్షకుడి గొంతున పడిన ఉండ, కంట జారిన బొట్టు, ఇదే సహానుభూతి, ఇదే మానవత్వం. ఇప్పుడు అతని సినిమాలు అన్నీ ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి. అతను సేడిస్టా? మాసోకిస్టా? మనసు లేని వాడా, రాతి గుండెనా, లేదా దిగువ మధ్య తరగతి జీవితాల వైపు ప్రేక్షకుల కళ్ళను మనసులను కొద్ది సేపైనా తిప్పగలగిన గొప్ప మానవతావాదా?

బాలచందర్ ట్రెండ్సెట్టర్ కాదు, ఎందుకంటే ఆయన ప్రవేశ పట్టిన ఈ వాస్తవిక ఒరవిడిని ఒడిసిపట్టుకుని ఆ బాటనే పట్టిన వారు ఇంకొకరు లేరు. అతని ధోరణిలో అతను తన చిత్రాలు తీసుకుపోయారంతే. ప్రశ్నలు, ప్రశ్నలు, ఎక్కడా వినని ప్రశ్నలు, ఎవరూ అడగని ప్రశ్నలు, అసలు అడగొచ్చో లేదో అనుకునే ప్రశ్నలు. నిప్పులు కడిగే వంశంలో పుట్టిన వాడు పొట్టకూటి కోసం మంగలి కత్తి పట్టుకోవచ్చా? సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి కుటుంబపోషణ కోసం పడుపు వృత్తి చేపట్టచ్చా? మనిషి కోరుకునే తోడు, మనసుకా, శరీరానికా, మనసుకే అయితే వయసుతో దానికి పని ఏమిటి, తండ్రి వయసు వాడు కూతురి వయసు దానితో మనసు కలపచ్చా? కులం, మతం, ప్రాంతం అన్న భావాలు మనుషుల్ని ఒక జట్టు కట్టే ప్రయత్నాలైతే, అవే కులం మతం ప్రాంతం రెండు మనసుల్ని విడదీయడానికి ప్రయత్నిస్తే? ఏడడుగులు నడిచి ఏడుజన్మల బాస చేసిన ఇల్లాలు లోక కళ్యాణం కోసం లోక కంటకుడిగా మారిన మొగుడి తలను నరికేస్తే? ప్రశ్నలు, ప్రశ్నలు... ఇవి అసంబద్ధాలు కావు, ఊహాజనితాలు అంతకంటే కావు. పొద్దున లేచి తెరిచిన చూచిన వార్తా పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో దర్శనాలిచ్చే కటిక వాస్తవాలు ఇవి, కరడు జీవితాలు ఇవి. కోటి మంది జనాభాలో పట్టు మని పది మందికి జీవితమన్నది బనుశ బదులు లేని ప్రశ్న కాకపోవచ్చు. తక్కిన వర్గాలన్నిటికీ కొద్దో గొప్పో తేడాలతో అందమైన బ్రతుకు ఎప్పుడూ ఒక అందని ద్రాక్షే. ఆ అందుకోలేని అనుభావాలు ఆశలుగా, బాధలుగా, కోరికలుగా, కోపాలుగా, నిరాశలుగా, నిస్పృహలుగా కక్షలుగా కార్పణ్యాలుగా, బాలచందర్ చేతిలో కధలుగా....అతని కధలన్నీ జీవితం నుంచి వచ్చినవే, అందుకనే ఎన్ని యేళ్ళు పోయినా వాటి మట్టి వాసన పోవు. బంగారంలాంటి పెళ్ళి సంబంధం తప్పిపోయి, కుటుంబాన్ని పోషించడం కోసం తిరిగి చేతికి బ్యాగు తగిలించుకుని బస్సు ఎక్కే జీవితాలు కళ్ళ ముందు రోజు కదలాడే వెలుగు నీడలు. బాలచందర్ పాత్రలు జాలిని, సానుభూతిని కోరుకోవు, పైగ వాటికి అవి అంటే అసహ్యం. అవి చేతకానితనానికి చిహ్నం. ఆ పాత్రలు కోరుకునేవి ఒక గుర్తింపు (acknowledgment). ఇలాంటి బ్రతుకులు కూడా సమాజంలో ఉంటాయి (అసలు చెప్పాలంటే ఇవే ఎక్కువగా), ఉన్నాయి అన్న గుర్తింపే ఇవి కోరుకునేవి. ప్రశ్నలు వేసి వేసి జీవితం నుంచి బదులు రాక, ఆ కోపం కసి అంతా వెండి తెర మీద చూపించిన నిత్య శోధనుడు బాలచందర్. అతను లేకపోవచ్చు, అతని ప్రశ్నలకు ప్రపంచం జవాబు చెప్పనన్నాళ్ళూ బాలచందర్ గుర్తు వస్తునేవుంటాడు, వేధిస్తునే ఉంటాడు, వెంటాడుతూనే ఉంటడు, వేటాడూతూనే ఉంటాడు. అవును, బాలచందర్ ఒక సేడిస్టే!

అసహాయతలో దడ దడ లడే హృదయ మృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం
యెడారి బతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కూ మొక్కూ తెలియని దీనుల యదార్థ జీవన స్వరాలు
నిలువునా నన్ను కమ్ముతున్నయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించలి ఈ అపశృతి సరిచెయ్యాలి
జన గీతిని వద్దనుకుంటూ నాకు నేనె పెద్దనుకుంటూ
కలలో జీవుంచను నేను కలవరింత కోరను నేను

2 comments:

arvindrishi said...

Baavullotullo ...enta chakkani maata...loved ur blog on Balachander

Anonymous said...

Feb 2, 2023 & Feb 4, 2023 - two of Telugu stalwarts namely Sri. K.Viswanath and Smt. Vani Jayaram left to the heavenly abode. Wish to read something from you.