కర్రు చేతల పుణికించిన పులకలతో
కొండ్ర భాషల లిఖియించిన బాసలతో
చాలు ఎత్తుల చాటిన ప్రేమలతో
ఎండిపోయిన ఎదను చలువ చదును చేసి
కరుకు గుండెల సందు వలపు విత్తులు నాటి
యేటా నేలకు నెలలు నిండించు కాలధర్మమ్మిది
అడుసు అడుగులలో అభ్యంగనము ఆచరించి
నారు నాట్లలోని పచ్చందనము పూసుకుని
గట్ల విరిసిన విరులు తీరుగా తురుముకుని
మొలకల ముస్తాబు చేసుకున్న నిండు చూలాలికి
సంబరముగ జరుపు సీమంత వేడుకిది
జగతి జోగుతుండగా వేనవేలుగా పిల్ల పైరులు
మృదుల గర్భమును చీల్చుకుని వచ్చినా
పట్టరాని బాధను పంటి బిగువున భరియించి
చిగురింతల చిరునవ్వులను ప్రపంచానికి పంచి
చల్ల గాలుల జోలలో సేద తీరును
ప్రసవ ఆయాసయమున ధరణి తరుణి
పరువపు బరువుతో వయసు కొచ్చిన వరి కంకులను
కష్ట సుఖములెరిగిన ఒక కర్షకయ్య చేతిలో పెట్టి
కళ్ళకెదురుగా తన కడుపు పంటను బండికెక్కించి
అత్తవారింటికి సాగనంపు సమయములో
కంట నీరు ఇంకి గుండె బీటలు వారి....
యేటికొక సారి ఎంత కడుపు కోతకు గురియయినా
మాతృతనపు మాధుర్యమును చవిచూచిన మహిత
సాలుకొక మారు తిరిగి చూలు కాక మానదు
చేతికంది వచ్చిన సంతు కంటి ముందర కదిలిపోయినా
ప్రయోజకుల పెంపుచేసిన గర్వముతో పుడమి
తన కర్తవ్యమున తిరిగి తల్లికాక మానదు
No comments:
Post a Comment