సంక్రాంతి
 పతంగు పసందు 

సొగసైన రూపుతో సొంపైన తీరు
కుదురన్నది ఎరుగక కదలిపోవు జోరు
ముద్దులొలుకు ముఖాన మిరుమిట్ల కళలు
అందమను మాటకు కొత్త అర్ధములు కాబోలు
కొలువైన ఠీవిలో కదలాడు రాజసము
పొరుగున్నవాటితో పోటీ పడు పసితనము
నలుగురూ చేరి జరిపేరు వేడుక
కన్నవారికి కూడ చేయి కలప కోరిక
నడిపించువారి నైపుణ్యమును వెలయించు కీర్తి పతాకలు
గగన వేదికన విశృంఖలముగ నర్తించు నింగి రంగవల్లికలు

కదన రంగమున కాలుదువ్వు ఆవేశము
తోకను ఎగగట్టి తొడగొట్టు పౌరుషము
మీద కురికెడి తుంటరుల తప్పుకొను కౌశలము
అదను జూచి తెంపరిగ తిప్పికొట్టు చాతుర్యము
కుత్తుకల తెగ్గోయ పదును తేలిన కవచము
జోడి కుదిరెనా ఆత్మీయతన పెనవేయు బంధము
ఆయువున్నంత వరకు తల వంచని మొక్కవోని తనము
తీరినంతనే గాలిలో కలిసిపోవు కులాసాకు చిహ్నము
బరిలో పోరాట పలాయనములు ప్రయోగించు పాటవము
ఒంటిగా శాంతి మంత్రమును పఠించు మింటి కుక్కుటము

No comments: