ఉగాది


 గలగలల ఆకులను దూసేసి పోయిన
పచ్చదనపు అఛ్ఛాదనమును అపహరించుకుపోయిన
శిశిరపు తుంటరితనమునకు ఇక కాలము చెల్లు
తృణముల మెడలు వంచు మంచు ముద్దలు జార్చు
ముద్దులొలుకు పూమోములపై చన్నీళ్ళు చిలకరించు
ఆకతాయి పౌష్యమి అల్లర్లకు ఇక ఆటకట్టు
బాలభానుని బంధించి ఉంచిన పొగమంచు దుప్పట్లకు
చలిపులికి బెదిరిపోయిన పిల్లతెమ్మెర్ల గజగజలకు
నిస్తేజాలకూ నీరసాలకూ ఇక చెల్లుచీటీలు
నిలచినది మనముంగిట ముస్తాబై నవవసంతము

జగతి నిశ్వాసనను తమ ఉఛ్వాసగ చేసుకుని
మాడ్చు ప్రచండ తాపమును ఇంధనమునుగ మార్చుని
భూసార కాసారాలను వేళ్ళ వేటితో వెలుపలకు తెచ్చుకుని
ఉన్న వంటినే వంటలో ముడిసరుకుగా వాడుకుని
విరామము లేక వండివేలార్చు అపర అన్నపూర్ణలు
పరోపకార విలువ వేనోళ్ళ కీర్తించు వసంతపు వందిమాగధులు
దాచుకున్న బట్టలు బయటకు తీసి దులిపి కట్టుకుని
విరిసిన విరులవరసలను జడలలో తురుముకుని
వలసపోయిన వాసులకు తిరిగి వాకిళ్ళు తెరిచిపట్టుకుని
రేకుల విస్తరాకులలో ఆకుల కంచాలలో విందులు వడ్డించిపెట్టు
ప్రకృతి పూటకూళ్ళ పట్టుకొమ్మలు ఈ తరువు తరుణీమణులు
వికసించిన వసంతపు ఘుమఘుమల గుబాళింపుల ఆనవళ్ళు

No comments: