శివరాత్రి

కోర్కె తీర్చమన్నది తడవు తల మీదకు తెచ్చుకునేవు
కోర్కె రాజేయ పూనిన అభాగ్యుని అనంగుని చేసావు
కోరి చేరిన వయ్యారిని క్రీగంటనన్న పరికించకపోయేవు
శైలి మార్చిన శ్రీహరికై తలమునకలుగా తపించిపోయావు
కడుపు పండించిపోఅమన్న సతిని వీలుకాదని విస్మరించేవు
ఉదరాన వసించమన్నందుకు ఉదారాన గర్భవాసుండవయ్యావు
ఎవరో కన్న బిడ్డకై కాలునిపై కన్నెర్ర చేసేవు
సొంత చూలని చూడక కోపమున శూలానికి ఎరవేసావు
ఇన్ని వైరుధ్యాల నీ లీల ఏ లీల అర్ధమయ్యేది
ఇంత వైవిధ్యాల నీ మాయ ఏరీతి తేటపడేది

చేయి చాచినంత ఎదురు దోపెట్టు పిచ్చి బిచ్చగాడు
శరణు జొచ్చినంత సర్వమూ మరచు చిన్న పిల్లవాడు
జగము వేడినంత విషము మ్రింగెడు వింత లయుడు వాడు
కోపతాపాలకు కాళ్ళ గజ్జెలు గట్టు జగజ్జంత్రగాడు
ఉన్న ఉనికిని చెరి సగము చేసి అర్ధాంగి అయినాడు
తుల లేని మేనికి జిలుగులను వర్జించి దిగంబరుడయ్యాడు
కపాల తటిలో జ్ఞాన కమలము విప్పార్చిన త్రినేత్రుడు వాడు
పెట్టుటే గాని పట్టుట ఎరుగని ప్రకృతి ప్రతిరూపు వాడు
లేమిలో కలిమి కలదన్న నిండు గుండెవాడు
చింతను ఇసుమంత దరిజేర్చని బూదిపూత వాడు

No comments: