రావణత్వము
గిరికంధరుడై శితికంఠుని కదిలించి
తనూవైణికుడై రుద్ర వీణని వెలయించి
నిగమానుసారుడై నియమనిష్ఠలనుంచి
కన్నరుణమెంచి తల్లి మనోరధమ్ము తీర్చి
తోబుట్టువులను కంటిపాపలుగ ఎంచు లంకేశుడసురుడా?
దిక్కులన్నింటిని దొడ్డిలో బంధించి సరిదారి తప్పిన బతుకు బాటసారి
చుక్కలెన్నింటిని చెర పట్టినా చిత్తచాపల్యము చావని నిత్య పిపాసి
ఙ్ఞానమంతటిని ఆకళింపు చేసుకున్నా ఇంగితమవతగతమవని అపర అవివేకి
జగతినంతటిని చెప్పుచేతల తెచ్చి అహమునకు బానిసైపోయిన బహు అల్పజీవి
సాత్వికమును తామసముతో అంతమొందించిన అతడు అసురుడుగాక ఇంకెవ్వడు!
పరకాంత లోలత్వమున తలమునుకలౌవ్వాడు
తోబుట్టువు పరపురుష కాంక్షనెటుల ఖండించు?
కంటికి నదరుగా కనిపించునది కైవసము కావించుకొనువాడు
నియతి యందు నిగ్రహమును ఏవిధమున నేర్పించు?
కోర్కెను బలిమి గుప్పిటిలో బంధించువాడు
ప్రేమ యందలి లాలిత్యమేరీతి తెలుపగలడు?
బుద్ధికి సహకరించని విద్యలెన్ని ఉన్నా పారంగతుడు కాడు
ఉదధి యందలి ఉదకము దాహార్తి తీర్చలేనట్టు
ఆత్మను శాంతింప చేయలేని వాడు భక్తి తత్పరుడు కాడు
ఆల్చిప్పను చేరని చినుకు స్వాతిముత్యము కాలేనట్టు
No comments:
Post a Comment