సంక్రాంతి

ఓహో ఏమి హొయలో!
అడుగడుగునా వొలికిపోవు వంపులలో
తడబాటున తుళ్ళిపడు తుంటరితనములో
అందకుండగ పరువులెత్తు అల్లరి పరువాలలో
అందం యావత్తు దాపెట్టుకున్న గుంభనాలలో 
మైమరచి నిలిచిపోయిన ఆరాధకుల చూపులకు
సిగ్గుతో మెలికెలు తిరిగిపోయిన ముగ్గులలో
ఒహో ఏమి హొయలో!

అహా ఎంత ఆత్మీయతో!
విస్త్రుతి అందని వినీలాకాశంలో
ఒంటరైపోయిన చుక్కల అస్తిత్వములో
పలకరింపులకు నోచని అనంత నీరవములో
దూరపు చుట్టరికాలు చుట్టబెట్టుకుంటూ
ఎక్కడెక్కడి బంధాలను కలుపుకుని పోతూ
విశ్వమంతా ఒకే కుటుంబమన్న చక్కని చుక్కల ముగ్గులో
అహా ఎంత ఆత్మీయతో!

వడి వడి వచ్చేస్తున్నదదిగో!
రాసుల చక్రాలమరించుకుని
కాలాశ్వమ్ములను కూర్చుకుని
పూల పగ్గమ్ములు పూన్చుకుని
గొబ్బిళ్ళ ఘంటారావాల హెచ్చరికతో
పౌష్యములో ప్రవేశించు మనోరధమ్ముతో
కోలాహలమ్ముగ కదలాడు రధమ్ముగ్గు
వడి వడి వచ్చేస్తున్నదదిగో!

రంగవల్లికల అల్లికలలో అలరారు వింత ప్రభ
సంక్రాంతి పండుగకే ప్రత్యేకమగు నూత్న శోభ

No comments: