కాగితపు కళ్ళు విప్పుకుని
తడిమిన వేళ్ళ గిలిగింతలకు
కాంతుల కేరింతలు కుమ్మరించు నవ్వుల షరాబులు
కడుపులో కోటి తుళ్ళింతలు దాచుకున్న పసి మతాబులు
ఉంచిన చోట కిక్కురుమనక నిలిచి
చెలరేగమని సెగ రగిలించినంతనే
నూత్నోత్సాహముతో నింగినంటుకొను
చిచ్చర పిడుగుల చిచ్చుబుడ్లు
ఒంటితనము కన్న ఐకమత్యమునగల
కలివిడి బలిమి తెలివి తెలుసుకుని
యవ్వనపు భుజభుజాల అండదండల నిలుచు
ఛటఛటల చిటపటల ఫటఫటల దండలు
కూర్చుకున్న సంపత్తితో
తగు సమయానికి నిరీక్షించుచూ
అవకాశ వత్తికి అవసర వేడిమందినంతనే
ఆకాశమును ఛేదించుకొనిపోవు తారాజువ్వలు
చెవులు రింగుమను చప్పుళ్ళ నడుమ
నిశ్శబ్దముగా తమపనిని చేసుకొనిపోతూ
వయసు పండిన వివేకముతో వర్తించు
వెలుగు పువ్వులు వెదజల్లు కాకర వత్తులు
సంచిలో దాగిన సంచాలో వస్తువకొక విలక్షణం
తుంటరి టపాసులు తేటతెల్లపరిచే జీవదశల పరిణామం
No comments:
Post a Comment