యుగాది

కళ్యాణ పత్రికపూదావి గంధాలు నలుమూలలా అద్ది
పూదేనె పలుకులతో ఒడలెల్లా దిద్ది
పుప్పొళ్ళ అక్షతలతో పునీతము జేసి
పిల్ల గాలులతో పంపు పెండ్లి పిలుపు ఇది

విరబూసిన పువ్వుల విప్పారిన నేత్ర
ముద్దబంతి మోముతో ముద్దులొలుకు ముఖపత్ర
మత్తకోకిల సుస్వరాల సుమధుర గాత్ర
సర్వ వర్ణాలు రంగారు శుభ్ర వస్త్ర
వెరసి నిత్య నూతన కళత్ర మా వధువు

చెరుకు చాపము చేత ధరించి
కాల చక్రముల రుతురధమును అధిరోహించి
శిశిరముతో సమరమున సర్వజితుడై
పరాక్రమమున ప్రకృతుని దక్కించుకున్న
చూడ చక్కని చెలికాడు మా వరుడు

మోడువోయిన చెట్లు చిగురు వేసిన సుముహూర్తాన
మూగవోయిన లతలు మారాకు తొడిగిన మంచి లగ్నాన
పరచి పోయినట్ట్లున పచ్చని వేదికన జరుగు
వాసంతీ వసంతుల వివాహ వేడుక ఇది

యేటేటా జరుగు మనువుకు జగమెల్ల పులకించు పండుగ ఇది
ప్రకృతీ పురుషుల సమాగమమునకు నాంది పలుకు ఉత్సవమీ ఉగాది

No comments: