శ్రీ రామ నవమి

వనమాలి


తండ్రి మాటను గౌరవించి రాజ్యమును త్యజించిన
పితృవాక్య నిబద్ధుడు దశరధ రాముడు
అన్న అర్హతను గ్రహించి రాచరికము తృణీకరించిన
ఉచితేంగితఙ్ఞుడు తమ్ముడు భరతుడు
సహధర్మమును పాటించి
అన్న మాటన కానలకు నడిచె తన సుదతి
ఋజువర్తనమునెరిగి
అన్న బాట బట్టిరి సర్వమూ పరిత్యాజించి తోబుట్టు సమితి
ప్రాణములు తృణములు జేసి తన కీర్తి నినుమడింపజేయు
ఈ త్యాగధనులను పొందుటకు రాముడెంతటి పుణ్యమ్ము జేసెనో

తప్త హృదయులు బారులు తీరిన రాచబాటలతో
భగ్న మనసులు పరివేష్టితమైన రాచకొలువులో
మాట తప్పని బాటకు పట్టమును గట్టి
పాదుకలకే పట్టాభిషేకము జేసి
రామరాజ్యమునకు భరతుడాయె రాజ ముద్ర
పొంగి పొరలు గుండె దిటవు చేసుకున్న శోక సముద్ర

పూల పరివారము బారులు తీరిన రాచబాటలతో
వన్య పరిజనము పరివేష్టితమైన రాచకొలువులో
కువకువల కిలకిలల వేదమంత్రాల నడుమ
వృక్షజాతుల వందిమాగధ కీర్తనల గరిమన
రామరాజ్యమారంభమాయె చిత్రకూట వనవాసమున
రాచరికము నెరిపె తాపసికులు వింత వేషభూషలన

No comments: