వినాయక చవితి

అర్హుడు


పరాశక్తి ప్రేగు తెంచుకుని ప్రసవించకున్నా

తన ఒంటి నలుగున మొలకెత్తిన నలుసేగా మరి!

కడుపు చీల్చుకుని కంటేనే మొలుచు మాతృత్వము

మేని మాలిన్యముతో మలుచుకున్న వానియందు పుట్టదా ఏమి?

పాలు పట్టి పెంచకున్నా ఆ పసివాడికి

పతి కుపితమునకు విగతుడై పడి ఉండగా  

ఇంత ఊపిరిని పోయ పాలుపోలేదా ఆ ప్రాణశక్తికి?

కదలికకు కారణమగు కపర్దికీ

నిత్యమూ కైమోడ్పులందుకొను కాత్యాయనికీ

పుట్టిన వాడికా అడుగడుగునా ప్రాణగండాలు మానభంగాలూ! 


ప్రాణప్రదమగు పిల్లల పట్ల తల్లిదండ్రులకు ప్రేమెంత ఉన్నా

వారసత్వమున అందీయ వలసినవి తమ కీర్తి కిరీటాలు మాత్రము కావు

అడగకనే అప్పనముగ ఇచ్చినట్టి ఆస్తుల రాసులతో

బరువు తెలియని బిడ్డలు తమ తలరాతలు మార్చుకోలేరు

తండ్రి లోక రక్షకుడు కానీ తల్లి జగజ్జనని కానీ

తన పేరుకు పరువుకు తన గౌరవముకు గుర్తింపుకు 

తన ఆరాటము తనదే తన పోరాటము తనదే

తోటివాడు తక్కువ చేయనీ పక్కవాడు ఫక్కున నవ్వనీ 

తల తెగి పడినా గెలుపు తలంపును విడవని వాడే

ఆ తల్లి తండ్రుల ఒడి చేరుటకు అర్హుడు

No comments: