శ్రీ - కాళ - హస్తి
గాలి వాటున తేలిపోవు తీగ పందిళ్ళతో కాక
ఏల ప్రకటించుకో గలదు సాలె పురుగు
పరమేశ్వరుని పైనున్న అఖండ భక్తిని?
కడుపు చించుకుని ప్రేగు తీగల మూర్ఛనల
పరమ శివుని ప్రసన్నుని చేసుకున్న పౌలస్యుని
రుద్ర వీణా తీవ్రతకు తీసిపోయినదా
అణు పరిమాణాము నుండి యెడతెగని దారాలు దొరలించుకుని
జగద్రక్షకుని ఉదర తంత్రులతో చిన్న నీడ
చేసి ఇవ్వవలెనన్న తదేక ధ్యాన దీక్ష?
తమ వాడిని గొంతుకెత్తుకుని
తమ విషమును గుటక వేసుకుని
తమను తరతమములు లేని విధముగా
అక్కున జేర్చుకున్న అంగజాంతకుని
గౌరవము ఏ మాత్రమూ తగ్గని రీతిన
మెరుపు కాంతులీను మిలమిల మణులను
పుట్టలోనుండి తెచ్చి పూజకు పెట్టెనా ఆ సర్పము?
బూది పూతతో బైరాగిగా తోచు ఆది భిక్షువును
రంగు రాలను ఇచ్చి మారాజును చేసెనా ఆ సరీసృపము
పుత్రవాత్సల్యము పుట్టేనో ఏమో ఆ పరమాత్మునకు
తన చిన్న తండ్రి కవళికలు కనిపించేనో ఏమో
చాటంత చెవులతో నేరేడు పళ్ళంటి కళ్ళతో
పసితనము సదా తోణికిసలాడే ఆ కరివదనములో
ఘోర తపంబున ప్రసన్ను చేసుకున్న గజాసురుడు
కోపవశంబున తలలు తారుమారయిన గజాననుడు
కళ్ళ ముందు మెదిలేరో ఏమో ఆ హస్త మస్తకము కంటే
ఇంత నీరు చిలకరించి అంత అలరు శేషముల నుంచి
తండ్రి ప్రాపుకు ప్రాకులాడు చిన్న బిడ్డడు వాడు
కొలిచే తీరులు వేరయినా కోరుకునేది భక్తి సామ్రాజ్యమే
వేడే దారులు వేరయినా చేరే గమ్యము శివ సాయుజ్యమే
No comments:
Post a Comment