యుగాది

అది ఇదే

అంతటా ఆవురించిన అంధకారము... అంతలోనే పెను విస్ఫోటము...
నీరవము నుంచి ప్రణవము శూన్యము నుండి సృష్టి ఆవిర్భావము
లెక్కలకు అందని సమయము సాక్షిగా ప్రాణమునకు అంకురార్పణము
తొలినాట కణముగా పుట్టి అటుపైన కణముల కంకణములు కలిసి
ప్రాణము జీవముగా ఎదిగి జీవము జీవితముగా స్థాపితము
సృష్టిలో ఇంధనము రగులుతున్నంత వరకూ బ్రతుకు ఆరాటము
అది ముగిసినంతనే సమయు కొడిగట్టు వెలుగు పోరాటము
తిరిగి ఆవురించు అంతటా అంధకారము.... తదుపరి జీవ ప్రక్రియకు నిరీక్షణము
భ్రమణాలు చక్రాలు దశలు జీవితానికే కాదు సృష్టికీ కారణభూతాలు
వర్షాలు యుగాలు కల్పాలు కాలానికే కాదు ప్రాణ మూలానికీ కొలమానాలు

ఉన్న అన్ని రుచులు ఆస్వాదించడం మనిషికి ముఖ్యమైతే
ఉన్న అన్ని కోణాలు ప్రదర్శించి పోవడం ప్రకృతికి పరిపాటి
తీయందనం వెనకనే వగరు పులుపు ఉప్పందుకుని ఉప్పు
చేదు చెంగు పట్టుకు కారము దైనిందినమున మమేకమైనట్టే
ఆహ్లాదము అడుగులో ఉత్పాతమూ మనోఙ్ఞము వెంటనే విలయమూ
అబ్బురము అండనే భీభత్సమూ ప్రకృతి వివిధ పార్శ్వాలు
జిహ్వకంటిన రుచికి గుణము లేదు మిగిల్చిపోవు అనుభవము తప్ప
ప్రజ్వరిల్లే ప్రకృతికి దోషము అంటదు అది తన స్వభావము కనుక
పరిధి దాటిపోయిన దాని యెడ వినమ్రతతో మెలుగుట యందే మానవాళికి ఉపాధి
రుచుల పాఠము చెప్పి ఈ కరకు సత్యము చెప్పిపోవునీ ఉగాది

No comments: