సంక్రాంతి

కష్టే ఫలి


ఆ పండగ పూట...
నునుపెంచు చమురు వంటిని చీకాకు పెట్టేసింది
వదిలించు నలుగు దానిని రెట్టింపుచేసింది
తల అంటు పులుసు కళ్ళలో అగ్ని పేర్చిపోయింది
ఆనక సాంబ్రాణి పొగ ఉక్కిరిబిక్కిరి చేసింది
గుక్క ఆపని పాపాయి ఏడ్పుతో అలసి నిద్దరోయింది
ఆ సాయంకాలం...
కొత్థ బట్టల మెరుపులో కళ్ళు చికిరించింది
మీద పడు పళ్ళను లేని పళ్ళతో కొరకచూసింది
పుణికి పోయిన బుగ్గలతో మోము ఎరుపుతేలింది
ఇచ్చివెళ్ళిన బహుమతులు వెంటనే తెరవజూసింది
పొద్దుటి పాట్లకు చక్కటి ప్రతిఫలం దక్కిందనుకుంది

ఆ నిశీధి సమయం...
వంగిన నడుము ఇక ఉండలేక బావురుమంటోంది
వంచిన మెడ ఇక నిలువలేక వాలిపోతోంది
గొంతు కూర్చున్న కాళ్ళు ఇక కూల బడమంటున్నాయి
వంకర్లు తిప్పిన వేళ్ళు ఇక కొంకర్లు పోతున్నాయి
మొదలైన చక్రాలు ఇక ముందుకు సాగమంటున్నాయి
మరు ప్రాతఃకాలం...
ముగ్గుకున్న రంగులన్నీ బుగ్గలకు ఎక్కినాయి
రంగవల్లికా అల్లికలు కడకు కొలిక్కి వచ్చినాయి
అదను చూసిన నీరసాలు ఒక్కసారి దాడి చేసినాయి
కదలదనుకున్న రధము కొత్త కులుకు నేర్చింది
బిగిసికూర్చున్న మూతి మీద మొదటిసారి చిరునవ్వు మెరిసింది

ఆ చేల గట్టున ...
పాత పంట ఫలము అరకొరలు మిగిలించింది
బీటలేసిన పొలము క్రొత్త సవాళ్ళను విసిరింది
కరుడుకట్టిన కాలము కష్టాన్ని అదృష్టంతో తూచింది
గతపు గుణపాఠాల గురించి రైతన్నను ప్రశ్నించింది
ప్రకృతి పరిస్థితులతో పోరు వలదని వారించింది
ఇక సంక్రమణ సమయాన...
బొబ్బలెక్కిన చేతులు పంట పాపలను నిమిరినాయి
బండ్లకెక్కిన  బరువులు కష్టమును మరపించినాయి
ఎండబడిన వొళ్ళు ఎట్టకేలకు సేద తీరింది
మొండి నిలిచిన చేలు మరల సాగుకు సైయ్యంది
ఒడిదుడుకుల జీవితము ఈ యేటికి గట్టెక్కింది

1 comment:

BP said...

'ఒడిదుడుకుల జీవితము ఈ యేటికి గట్టెక్కింది' - చాలా చక్కటి ముగింపు!