నవరాత్రి

ప్రకృతి-పార్వతి

భుగభుగలు ఉబికే అనంత గర్భములో
కణకణ మండే గుండెలు బ్రద్దలై
భగభగ మరిగే లావానలము వెల్లడై
చురచురాలడే సూర్య తీక్షణతకు ఎండి
ఛటపటల తేజమ్ముగ అవని వ్రాలె

పాపభారమ్ము మరి భరియింపని ధరణిన
చిక్కబట్టిన గుండెలు ఒక్కబిగిన మండి
ఉగ్గబట్టిన ఉక్రోషాలు కస్సుమంచు లేచి
నీరసించిన నిట్టూర్పులతో ఊపిరిని నింపి
రూపుదిద్దిరొక శక్తిని కట్టకడపటి ఓపిక కూడగట్టుకుని

లేత పూతలలో ఒద్దికయిన లావణ్యము
ఆకు చాటులలో ఒదిగిపోయిన లాలిత్యము
వైరుద్ధ్యాలలో భాసించు సంక్లిష్టత
దృక్కోణాలలో అగుపించు రసరమ్యత
ప్రకృతి ప్రతి రూపు అందమునకు నూత్న నిర్వచనము

వదన ప్రమిదలను వెలిగించు బోసి నవ్వులు
బ్రతుకు పున్నములను పండించు పసిడి మోములు
గుండె గతులను తప్పించు మేని మెరుపులు
శాస్త్రాల శస్త్ర అస్త్రాల మిరుమిట్లు కొలిపే కళలు
పరిపూర్ణతనము ప్రతింబింబించు శక్తి స్వరూపము

భారమైన బరువును దించుకొను క్రమములో
కాసార జిహ్వలతో జాలి లేకుండగ కబళించి
తీండ్రించు చిచ్చుతో సమవర్తియై రగిలించి
కంపించు మేనితో అసమానతలను పెకలించి
పంచభూతాల తోడుగా నియతి నిలిపె ప్రకృతి

మనిషిలో మహిషము కాలుదువ్వు క్రమములో
నైచ్యములో నానిన నాలుకలను తెగ్గోసి
అహముతో పెరిగిన కొమ్ములను పెడవిరిచి
మదముతో బలిసిన తలలను తెగనరికి
సమతుల్యమును సాధించె శక్తి రంకెలిడు దౌష్ట్యమును నిర్జించి

మంచి చెడుల నడుమ నిత్యమూ సాగే తక్కెడల క్రీడ
ప్రకృతి పేర గాని శక్తి రూపున గాని తప్పదీ సంతులత బాధ్యత

No comments: