యుగాదివైతాళికులుఅభివృద్ధి చాటున అరణ్యాలను హరించి
నాగరికత మాటున హర్మ్యాలను నిర్మించి
మొక్కకూ చెట్టుకూ పుట్టకూ పుట్రకూ
మనుషులతో మనగలగు రాతలేదని నిర్ధారించి
కడకు కోకిల కూత రాయంచ ఊసువంటి కాల్పనిక కసరత్తుగా
పుల్ల మామిడి పిందె అసలు అస్థిత్వమే లేని గగన కుసుమముగా
చేసుకున్న జనసంద్ర సాంద్ర సందోహపు హోరులో
సవ్వడికి సందులేని సందడి జోరులో
తప్పనట్టు తిరిగే తారీకు పట్టీలన తప్ప
ఈ జన కీకారణ్యాన, ఉగాదీ, నీ ఉనికెక్కడ?

కరుణ ఎరుగని కరకు కాల చక్రము క్రింద
గతవైభవములన్నీ నలిగి గతించుట కద్దు
గడచిపోయిన ఘడియను విడిచిపెట్టు కీలకము
కాలమే పనిగట్టుకు నేర్పించు మార్పులోని మర్మము
నాడు క్రొత్త వర్షమునకు కోకిల పిలుపులు మామిడి పులుపులు పరాకులైతే
నేడు ఆత్మీయతా పలకరింపులు మానవీయతా పరిమళాలు ప్రతీకలు కాగలవు
పండగ పరమార్ధము సంజ్ఞలు సంకేతాలూ కాక
మనిషి తత్వమును మానవత్వమును పదిలపరచుకోను
వ్యవహారము సమసిపోయినా ఆచారము మరచిపోకుండగా
వేసే ప్రతి అడుగూ క్రొత్త యుగాదికే వేచే ప్రొద్దూ క్రొత్త ఉషస్సుకే

3 comments:

Praveen said...

Sir,
Just wanted to point out a probable typo (it is quite possible that I am grossly mistaken).

Should 'తప్పనట్టు తిరిగే తారీకు పట్టీలన తప్ప'
read as 'తప్పనట్టు తిరిగే తారీకు పట్టీలోన తప్ప'?

Srinivas Kanchibhotla said...

they both mean the same Praveen. It is akin to saying అందున instead of అందులోన

Praveen said...

Oh, I see. Thanks.