సంక్రాంతి

పల్లెపదాలుపడిన శ్రమకు సాక్ష్యం నువ్వే ఎదురెండా
జారిన చెమటకు లెక్కలు గట్టు న్యాయంగా
నూర్చే వేళ నలకలు కళ్ళ సలుపవు చిత్రంగా
ఎత్తిన మోపుల బరువును పెదవులు పలకవు విడ్డూరంగా
బండెక్కి ఊరేగుదువు పద ఉత్సాహంగా
ఇంటచేరి కొలువుదీరుదువు వైభోగంగా

ముస్తాబు చేసిన పంటలక్ష్మిని
కొంత కూడ కొనిపోవు హరిదాసుని
అన్నమో రామచంద్ర పిలుపులతో
నేల తల్లి పిల్లను రప్పించు సూత్రధారిని
అన్నపూర్ణ ప్రసన్నతకి పరితపించు
జోగి భూషలో తిరుగాడు భిక్షుకీశుని
ఇలవేల్పులను ఇలా కలుప ప్రతి యేటా
పాటల పందిరి వేయు పురహితుడని

మెడను గంట గట్టి కాళ్ళ గజ్జె తొడిగి
మువ్వల నాదముల తైతక్కల తాళముల
నూత్న నాట్యవేదము రచియించు బసవన్నా
చిరుగు గుడ్డ గట్టి జీర్ణ చర్మము గప్పి
కర్మ భూమిలో తకధిముల తంతులో
పశుపతికి సరిజోడువే ఓరన్నా

విచ్చే నవ్వుకు చప్పట్లు
తిరిగే కాళ్ళకు తిరునాళ్ళు
పాడే నోటికి తాళాలు
వేసే మొగుడికి వే-కళ్ళు
సాగే వయసుల అల్లర్లు
మూగే పడుచుల గొబ్బిళ్ళు

No comments: