ద్వైతము
కాలమునకు ఆది వార్నిధికి తుది ఏది?
కట్టు తెంచుకుని చుట్ట విప్పుకుని
కదలి పోవు కాలపు దారపు ఉండ
దొరలు దారి వర్తులమా? సరళ మార్గమా?
విధిని వశపరచుకోను వ్యవధిని వీలుగా విభజించి
నేడు దాటిపోయిన దానిని రేపటి వలలో దక్కించుకోను
ఊరట కొరకు మనసు కాలమును నడిపిన దారి వర్తులము
కదలిపోయిన క్షణము వెనుదిరిగి చూడదన్న కరకు నిజము
గాలమున జారిపోయిన ఘడియ ఇక చేజిక్కదన్న చేదు వాస్తవమును
హెచ్చరిక జూపి బుద్ధి సమయమును తరిమిన బాట సరళ మార్గము
సాలుకొకమారు బారసాల సంబరాన యేటి పాపాయికి నామకరణము జేసి
కాలగతులను తేటపరచి లోకరీతులను తెలుసుకోను జగతిలోనికి పంపి
బ్రతుకు పండిన ఆరు పదుల పిదప తిరిగి వాటిని అక్కున జేర్చుకొని
నేర్చుకున్న విషయములను వాటితో కూడి నెమరువేసుకొను వింత వేడుక ఇది
ఆరు ఋతువుల కాలచక్రము బోధించు ఆశవాద సూత్రమూ
ఆరు రుచుల సమాహారమందించు జీవన సమతుల్య సందేశమూ
రాశి చక్రాల ఎగుడుదిగుళ్ళు ప్రతిబింబించు బ్రతుకు నాట ఎత్తుపల్లాలూ
రాజపూజ్యాల వంది వివరాలు అందించు ఆత్మవిశ్వాసాలకు ఆశ్వాసాలూ
మితవాద ఆశావాదాల నడుమ ఊగిసలాడు ఉగాది ఉపాఖ్యానము
సరళ రేఖలో సాగిపోవు వర్తులాకార కాల వర్తనము
1 comment:
" Each one equally important and each message just as valuable.
Happy Ugaadi to you all!!!"
Post a Comment