నులి వెచ్చని ఎండల మెత్తని పిలుపులతో జత కలసిన
చల్లగాలి చక్కిలిగింతల పులకరింతల పలకరింపులకు
బద్ధకపు బరువున వాలిన వరికంకులు లయబద్ధముగ తలలూచు
పచ్చని దుప్పట్లు పరచిపోయినట్లున్న పంట చేలలో
వడ్ల గింజల విందులతో కౌజు పిట్టల అతిధులకు ...
చాలు...చాలు....
ఈ ఊహాలోకాల భావనా విహారాలు ఇక చాలు
రగులుతున్న వర్తమానము మీద నివురుగప్పుతున్న
ఈ కాల్పనిక కవిత్వాల నిస్సారపు నుసి ఇక చాలు
కళ్ళెదుట కదలాడు చేదు నిజాల చద్ది కరుళ్ళు జీర్ణించుకోలేక
అతి తేలికగ అరిగే ఈ అవాస్తవాల పరమాన్నాలకై అర్రులు ఇక చాలు
సమస్యల ముల్లు కర్రతో కర్తవ్యమును గుర్తు చేయ పొద్దుటే తట్టిలేపే
బాధ్యతల తీవ్రతను చూడలేక కళ్ళ మీదకు లాక్కునే నిరాశక్తపు ముసుగులు ఇక చాలు
ప్రబలుతున్న విష సంస్కృతిని ఎలుగెత్తి నిరసించే ధైర్యము చాలక
చాటు గదులలో చేరి ప్రాకృతిక శోభల ఉబుసుపోక ఊక దంపుళ్ళు ఇక చాలు
చితి మంటలతో చలి మంటలను రాజేసుకుని
రక్తపుటేర్లతో రంగవల్లులని తీర్చిదిద్దుకుని
తలలొంచుకుని నడిచిపోవు గంగిరెద్దు జనుల జీవితాలలో
హాహాకార సంకీర్తనలతో దద్దిరిల్లుతున్న ఈ పవిత్ర భూమిలో
ప్రతి పూటా నిత్య సంక్రాంతే ప్రతి నాటా దహన సంస్కృతే
గంజి నీళ్ళకు సైతం ఆనకట్టలు కట్టి
పబ్బం గడుపుకునే అరాజకీయానికి అడ్డుకట్ట వేయాలి
బీటలేసిన నేలనందు కూడ ముళ్ళ కంచెలు జుట్టి
ఆత్మీయతల నడుమ నిలిపిన అడ్డుగోడలను పునాదుల కూడ పెకలించి వేయాలి
పంచభూతాల పందేరాలు చేయ ప్రాంతీయతా విద్వేషాలు వెలిగ్రక్కు
వైష్యమ్యాల విలయతాండవమునకు చరమ గీతము పాడాలి
స్వార్ధ ప్రయోజనాల గర్భ కుహరాల నుండి బయల్వడి
పరుల బాగుననే స్వప్రయోజనముందన్న వెలుగులోకి రావాలి
భవిత మీద ప్రసరించు వర్తమానపు విలువల మెరుపులు
భావి తరాలకు కోటి కాంతుల సంక్రాంతులీనాలి
2 comments:
Shouldn't the last line read: 'భావి తరాలకు', instead of 'భావి తరలకు'?
Was it intentional? Could be a (transliteration) typo.
Corrected, thanks.
Post a Comment