ప్రమిద
వేకువను వెక్కిరించు చీకటి
పరచిపోయిన చిక్కటి దుప్పటిపైన
నీరవము నిరంకుశముగా రాజ్యమేలు
వెలుతురింకిపోయిన గుబులు వేళలలో
వెలుగు నేత నేసిన పత్తి బట్టజుట్టి
పసుపు పాదాలకు పసిడి గజ్జెలుగట్టి
గాలి గిలిగింతలతో తనువూగిపోవు నాట్యరాణి
చెదిరిపోని ఆశకు చెరిగిపోని చిహ్నమా
మొక్కవోని ధైర్యమునకు మరపురాని మారుపేరా
సడలిపోని పట్టుదలకు సమసిపోని పట్టుకొమ్మా
తుంటరితనమున పడదోసి పోవు తెమ్మెరల అల్లరిని
అలవాటుగ తలవాలుగ తట్టుకుని నిలిచి
గొంతు నులిమి పోవు గాలి గద్దింపున ఊపిరిని
వత్తు చివరగా వడిసి చిక్కబట్టుకుని
రెపరెపలాడి పోవు కురచ కాయమును
నిలకడ మంత్రమును చదివి కుదుట పరచుకుని
నలు దెసలా మొహరించు పెంజీకట్లపై
ఊపిరున్నంత వరకు ఒంటరి పోరు సలిపి
పరాక్రమమునకు ప్రమాణము ప్రామాణము కాదను దీప కళిక
ఎదురీతలలో ఎదురొడ్డు వీరతనమునకు ప్రతీక
పరుల ప్రాపుకై ప్రాకులాడక
అస్థిత్వమునకు అహర్నిశమూ శ్రమించి
కడ వరకు స్వేచ్చ గాలులు పీల్చు కడు స్వతంత్ర జీవి
చేయూతనందించు చేతికి
నులి వెచ్చని కరచాలనమందించి
ఆత్మీయతా రుణమునకు చేబదులు చెల్లించు స్నేహశీలి
బ్రతుకన్న తీపి వదలి బ్రతికున్న వరకు
తన తనువునే సమిధ చేసి తిమిరమును తరిమి
ప్రాణమే పణము పెట్టి వెలుగులను వెదజల్లు ప్రమిద
తన జీవితమునే సార్ధకము చేసికొను త్యాగధన
1 comment:
ప్రమిద గురుంచి చాలా చక్కగా వర్ణించారు.
నిజమే, ప్రమిదను చూసి మనం ఎంతో నేర్చుకోవాలి
Post a Comment