త్రిమూర్తి
రుధిర సమిధల జ్యోతిలో మెరవనున్నదా
చిలిపితనము చిందాడు ఈ చిన్నారి మోము
కదన రంగమున ప్రళయ తాండవమాడనున్నదా
తప్పటడుగుల తడబడు ఈ పసి పాదాలు
రక్త తర్పణల రుచి మరగనున్నదా
మురిపాల చారలెండని ఈ పాల నోరు
మహిషు నమానుషమును పెకలించనున్నదా
కేరింతల కేళిలో అలసిన ఈ చిట్టి చేతులు
వేల్పులకే ఇలవేలుపై ఎదగనున్నదా
పుట్టగతులెరుగని ఈ వింత శిశువు
కన్న రుణమెరుగని కాంత ఏడ నేర్చెనోకదా
తల్లితనమును తలపించెడు లాలిత్యమును
లేత పూతల ప్రకృతి పోత పోసెనోకదా
లతల జతలు మరపించెడు లావణ్యమును
ఓంకార ఝుంకారాల బీజాక్షరాల భాషలో
తేనెలూరు మాటలలో తెలియాడు మాధుర్యము
అందమన్న పదమునకు నూత్న నిర్వచనము కాదా
సృష్టించనలవి కాని సాటి లేని సౌందర్యము
ఈ కరుణ శాంత అద్భుత రస మిశ్రమము
కాదా భీభత్స భీతావహ భయోత్పాత కారకము
నేల జారిన కాముకుల నెత్తురు
నుదుట కుంకుమ తిలకమై చిందగా
మతులు చెడిన ముష్కరుల తలలు
మెడలొ పూసల హారమై అమరగా
మదపు బరువున కూలిన మొండెములు
అమ్మ అడుగులకు మడుగులొత్తగా
దిక్కులు పిక్కటిల్లు హాహాకారములు
శక్తిని శ్లాఘించు రుక్కులవగా
సంతులనను సాధించెనా నాతి
జగతిన పునఃస్తాపించి నియతి
1 comment:
Srinivas garu. the way you write poems in telugu always amazes me. by the way it feels funny when I remember the silly questions I asked you previously. here is a suggestion from my side for my sake. why don't you select songs rich in lyrical value written by Sirivennela et al and try to give ur interpretation or meaning. so that we can understand the significance of the song, deeper meaning if any...
Post a Comment