గుహ ధర్మము
ఆగు తండ్రీ ఆగు..
రాతిని నాతిని చేసి సద్గతినిచ్చిన నీవు
ఈ పడవను పడతిని చేసిన నా గతి ఏమి గాను?
రోజు తెడ్డులేసి జనులను ఒడ్డుజేర్చు వానిని
ఈ బ్రతుకుటేరున వడిదుడుకుల వలన
అనుభవపు జడితో వయసు తడిసిపోయె
నా మతిమీరిన మాటలకు చీకాకు చెందక
ఆ దరి చేరువరకు చెవులార ఇనుకో
కట్టుకున్న పున్నేనికి నారచీరలు కట్టించి
కానలకు కొనిపోవు కరకు పెనిమిటివే అయినా...
పుట్టినాట నుండి మెట్టినింట వరకు
కష్టమంటకుండ కదిలిన కాంతకు
కదలు బాటలోన కంటకములు తొలగించి
నీ అడగులెమ్మడిగ నెమ్మదిగ నడిపించుకో
జనకునింటి నుండి చెరగని చిరునవ్వును
సారెగా తెచ్చుకున్న మరుమల్లె తీగకు
ప్రేమ పాదు చేసి అనురాగమొలికించి
క్రమము తప్పక నవ్వు పువ్వులను
నిత్యమూ నువ్వు పూయించుకో
తోడబుట్టిన బాగ్గేనికి తోలుబట్టలు తొడిగించి
తమ్ముడిని కూడా నడిపించు కరుడు గుండెవే అయినా...
ఉరుకు వయసు హోరుకు అడ్డుకట్ట గట్టి
రేగు తరుణ తలపులను ఆవలకు నెట్టి
తండ్రి మాటను మన్నించు అన్న బాటను బట్టి
నిగ్రహమునకు నిలువెత్తు విగ్రహముగ
నీ నీడనంటి నిలిచున్న సంగతి
కలలోనైన నీవు ఎన్నడూ మరువబోకు
ఏకాంత సీమలో నీ కాంత సన్నిధిలో
లోకమును మరపించు కాలమును కరిగించు
సుదూర తీరలలో మైమరచిన మాటున
పతి పొందెడబాసి పదునాలుగేండ్లు
పడిగాపులు పడుతూ పడియున్న పడతి
ఉలుకు పలుకులేక వేరున్నదన్న ఊసు
నిముషమైన నీవు విస్మరించబోకు
తండ్రి మాటను మన్నించు కొడుకుగా
నీ దీక్ష ఎంతగానైనా మెచ్చదగినా
సేవ ధర్మమును పాటించి వెంట నడిచిన
వీరి త్యాగ నిరతిని వేనోళ్ళనైనా ఎన్న తరమా?
అన్ని తెలిసినవానికి కూడ
ఎన్నో తెలియచెప్పవలెనన్న ఆరాటము
తరతమములు తెలియక ఏదో పలికించినది
చిన్న వానివైన పెద్ద మనసుని చేసుకు
తప్పులున్నా ఎన్నక మన్నించిపో
బరువెక్కిన గుండెతో ఇక బ్రతుకు తెరువు కొరకు
నీవు లేని ఆ దరికి మరల నేను పోలేను
గుండెమంటతో కంటిప్రమిదలు చిదిమి
రెప్పవాల్చక నీ రాకవరకు
నీ తమ్మునాలికి తోడుగా ఈడనే ఉంటాను
1 comment:
Chala bavundanDi.modaTi renDu vAkyAlu sampOorna ramAyaNam lo rAmaih tanDri pATa lovi anukunTa kadU.
Post a Comment