శివ - రాత్రి
దినపు చైతన్యమంతటినీ చల్లారపెట్టి
మరు రోజు చమురుగా ఓ మూల దాపెట్టు రాత్రి
తండ్రి తెచ్చిన సంపాదనను పొదుపుగా వాడు తల్లి
పగటి పూట ఆవేశమునంతా అణచిపెట్టి
మరు ప్రొద్దు గడియారమునకు మరగా అమర్చు రాత్రి
బ్రతుకు చదరంగములో తెలివితో పావులు కదుల్చు మంత్రి
వెలుగు వేళల వేడినంతా కూడబెట్టి
రేపటిని తీర్చిదిద్దు తపనతో కనులుమూయని రాత్రి
భావి తరాల కోసము మకరందమును ప్రొగ్రేయు భృంగి
వాగర్ధాలు పంచుకున్న ఆ ఆది దంపతులు
దివరాత్రాల బాధ్యతలు తీసుకున్నట్లైతే
కంటి ఎదుటి ప్రకృతి పార్వతైతే కంటపడని రాత్రి ఆ కపర్ది
లయము చేయు గరళమును అన్న వాహికలో ఆపి
ప్రణవ నాదము చేయు గుండె దరి చేరనీయక చేసి
చావు రేవుల తలుపులకు కావలిగా నిలిచిన కాటికాపరి
మరణ శాసనములు కాక బ్రతుకు బాధ్యతలు బోధించు కర్మచారి
లయమనే ఆలయమునకు ప్రధమ పూజారి తను ఐతే
సృష్టి నిర్మాల్యములు నిర్మూలించే నిలకడే తనదైతే
అంతమొందించు పనిని మరు సృష్టికి సిద్ధపరుచు బాధ్యతనుకునే
కర్మ అర్చకుడు, కర్మ ఆచరకుడు, కర్మ పరిరక్షకుడు తాను
విత్తుగా మొదలై వృక్షమై వెలిగి తుదకు మొండిగా మిగులే బ్రతుకు
అండములో మొదలై పిండముగా ఎదిగి బ్రహ్మాండమును ఆవురించిన బ్రతుకు
చావుతో ముగిసి లయముతో సమసి తుదకు ప్రళయముతో ప్రక్షాళింపబడిన బ్రతుకు
ప్రతి కాలచక్రములో సత్యమే ప్రతి సంక్రమణమునందు సుందరమే ప్రతి స్థితిగతులలో శివమే
No comments:
Post a Comment