సంక్రాంతి


కర్షక వందనము 


మూడు జాముల వేళ ఉలికిపడి లేచి

మాడు మీద గోనె చేత ములుగు పట్టి

ఉరుకు పరుగుల మీద గట్టు మీదకు చేరి

చేతికొచ్చిన పంటను చూద్దాము అంటే

వెక్కిరింతల గొంతుతో గాలి ఊళలు పెట్టె

మింగువేత ధోరణిలో వాన చెంపపెట్టు పెట్టె

గడియ గడియకు నీట మునుగుతున్న కాపుని చూసి

నిర్లిప్తతన చేష్టలుడిగి చూస్తున్న కాపుని చూసి

ఏ నాటికి తెలివి తీరునో కదా ఈ మనిషికి

గాలివానలతో చెలిమి మాట నిలకడ లేని మనువని

పైరు పాపలను ఊయలలు ఊపు చేతులే

అంతలోనే గిరాటు వేయు గాలివాటగునని

చినుకు చనుబాలతో వృద్ధి చేయు జల్లులే

అతిశయించిన ప్రేమతో దానినే ముంచెత్తునని

ఏ నాటికి తెలివి తీరునో కదా ఈ కర్షకునికి

గాలివానలతో చెలిమి బుజ్జి వాళ్ళని చేయు బుకాయింపులని...


ఆరు నెలల కష్టము కోతతోనే ముగియు చివరికి

కాలము కలిసి వచ్చిందా, పంట కోతతోనో

అదృష్టము అడ్డము తిరిగిందా, గుండె కోతగానో

పంచ భూతాలతో ఆడే నిత్య పాచికల పందెములో

యేళ్ళ పాటు ప్రతీ ఆటకూ ఉన్నదంతా ఊడ్చి పెట్టి

పణముగా కాయ కష్టమొక్కటే మిగిలిన రోజు జీతగానికి

పాములే తప్ప నిచ్చెనలు ఉండని ఈ కరకు వైకుంఠపాళీలో

నడక నెమ్మదిగా ఒక్కో గడే, పడితే మాత్రం పైనుండి వెన్ను విరిగుడే

అయినా...

పొద్దు పొడవక ముందే జోడెద్దుల సైన్యమును అదిలించుకుంటూ

కర్మ కురుక్షేత్రంలో క్రమం తప్పక అడుగేసుకుంటూ

ప్రతి పూటా ప్రకృతి పరిచిపోయే పద్మవ్యూహాలను

ముందడుగే తప్ప వెన్ను చూపకుండా ఛేదించుకొని పోతూ

కడ దాక సదా పోరు సలిపే అభినవ అభిమన్యుడతడు

సరళి ఏదైయినా క్రమము తప్పని సంక్రమణము ఇది

ఫలితమేమయినా చేయక తప్పని జీవన సమరము తనది

No comments: